Woman cops
-
మహిళా పోలీసులంటే వీళ్లే..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆదర్శనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసులు చూపించిన తెగువ, సాహసం పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. హెడ్ కానిస్టేబుల్ జాశ్విని, కానిస్టేబుల్ పూజ సమయస్ఫూర్తితో వ్యవహరించి దుర్మార్గుడి బారి నుంచి ఓ యువతిని రక్షించారు. ఇటీవల దేశరాజధానిలో కలకలం రేపిన మీనాక్షి హత్య తర్వాత ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళల రక్షణ కోసం ఆపరేషన్ భరోసా పేరుతో ప్రత్యేక మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఆ విభాగానికి చెందిన జాశ్విన్, పూజ లాల్ బాగ్ ఏరియాలో కొంతమంది మహిళలతో మాట్లాడుతున్నారు. ఇంతలో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడనే సమాచారం అందింది. అంతే హుటాహుటిన అక్కిడికి చేరుకున్నారు. అక్కడ సీన్ చూస్తే చాలా భయంకరంగా, గందరగోళంగా ఉంది. వీరేందర్ సింగ్ సునీల్ (34) అనే వ్యక్తి చేతిలో పిస్టల్ పట్టుకుని, ఓ మహిళను ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. రక్షించాలని ఆ మహిళ భీకరంగా అరుస్తోంది. ఎవరైనా కలగజేసుకుంటే ఆమెను షూట్ చేస్తానని బెదిరించాడు. చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నా ఎవరూ ముందుకు వెళ్లే సాహసం చేయలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను విడిచిపెట్టి.. లొంగిపొమ్మని హెచ్చరించారు. అయినా వినలేదు.. పైగా దగ్గరికొస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులిద్దరూ ఒక్క ఉదుటున అతడి మీదకు లంఘించి, ఆ యువతిని విడిపించారు. పిస్టల్ లాక్కొంటుండగా అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. కానీ మళ్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతలో సునీల్ తనవెంట తెచ్చుకున్న విషపు గుళికలను మింగేశాడు. దీన్నికూడా పోలీసులు అడ్డుకున్నారు. అతడి నోట్లోంచి కొన్ని మాత్రలను వెలికితీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌కు చెందిన సునీల్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడని పోలీసు ఉన్నతాధికారి విజయ్ సింగ్ తెలిపారు. ఆ యువతిని హత్యచేసి, ఆత్మహత్య చేసుకోవాలనే పథకంతోనే వచ్చాడని తెలిపారు. పథకం ప్రకారంమే పిస్టల్ లోడ్ చేసుకుని వచ్చాడని, విషపుమాత్రలు, సూసైడ్ నోట్ కూడా వెంట తెచ్చుకున్నాడని చెప్పారు. అతడిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఈ ఇద్దరు మహిళా పోలీసుల సాహసం గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి సిఫార్సు చేస్తామని సింగ్ తెలిపారు. ఇదే యువతిని లైంగికంగా వేధించిన కేసులో 2015 జూలైలో అశోక్ విహార్ పోలీసుస్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది విచారణలో ఉండగానే సునీల్ ఈ అఘాయిత్యానికి తెగబడటం గమనార్హం. -
మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపేశారు
కోల్‌కతా: గొలుసు దొంగల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోతోంది. ఈ చైన్ స్నాచర్లు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. మమతా బెనర్జీ లాంటి ఫైర్ బ్రాండ్ ముఖ్యమంత్రులున్న కోల్‌కతాలో కూడా రెచ్చిపోతున్నారు. సామాన్య మహిళలతో పాటూ, మహిళా పోలీసులను టార్గెట్ చేశారు. ఏకంగా ఓ మహిళా ఏఎస్ఐ గొలుసునే తెంపుకెళ్లిపోయారు. కోల్‌కతాలోని తిల్జాలా పోలీస్ స్టేషన్ కు చెందిన మహిళా ఏఎస్ఐ నిర్మలారాయ్ విధులు నిర్వర్తించుకుని ఇంటికి తిరిగెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. పిక్నిక్ గార్డెన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కచ్చితంగా ఎవరో స్థానికులే చేసి ఉంటారని నిర్మల తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు. లాల్ బజార్ నేర పరిశోధక విభాగం దీనిపై దృష్టి పెట్టింది. పాత నేరస్తుల వివరాలను సేకరిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును ఛేదిస్తామని తెలిపారు. బైక్ వివరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. -
మహిళా పోలీసులకు శిక్షణ
ఘజియాబాద్: పోలీసింగ్‌లో మహిళా కానిస్టేబుళ్లకూ మరింత ప్రాధాన్యం కల్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని రకాల నేరాలను దర్యాప్తు చేసేలా వారిని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. హత్యలు, దోపిడీలు, దాడులు, నేరస్థలాల పరిశీలనలో వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా దర్యాప్తు నైపుణ్యాలను పెంచుతామని ఘజియాబాద్ తొలి ఎసెస్పీ సచ్చీ ఘిల్డియాల్ ఆదివారం అన్నారు. ‘మహిళా పోలీసులు కూడా పురుషుల్లానే పని చేయాలని మేం కోరుకుంటున్నాం. వారిని కూడా నేరం జరిగిన ప్రదేశాలకు పంపిస్తాం. దాడుల నిర్వహణలోనూ భాగస్వామ్యం కల్పిస్తాం. దర్యాప్తులో నైపుణ్యం సాధించడానికి మహిళా పోలీసులను పురుష సహోద్యోగులతోపాటు ఘటనాస్థలాలకు పంపిస్తాం’ అని 2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఘిల్డియాల్ అన్నారు. ఘజియాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 427 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వీరిని కార్యాలయాలు, ట్రాఫిక్ విభాగాల్లో నియమించారు. హత్యలు, దోపిడీలు, దాడుల వంటి కేసుల దర్యాప్తునకు అనుమతించడం లేదు. ఈ 427 మందిలో 13 మంది ఎస్ఐలు, ఇద్దరు హెడ్-కానిస్టేబుళ్లు, 312 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ‘నేరస్తులు ఉన్న ప్రాంతాల్లో దాడులు నిర్వహించినప్పుడు మహిళా పోలీసులను అక్కడికి తీసుకెళ్లడం లేదు. ఇక నుంచి వాళ్లు కూడా దాడులు నిర్వహిస్తారు’ అని ఎసెస్పీ ఈ సందర్భంగా వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో పనిచేసినప్పుడు స్థానిక బందిపోటు దొంగలు పలువురిని అరెస్టు చేయడంతో ఆమెకు సాహస పురస్కారం కూడా దక్కింది. అయితే ఎన్నికల సంఘం ఘజియాబాద్ ఎసెస్పీ ధర్మేంద్ర సింగ్‌ను బదిలీ చేయడంతో ఘిల్డియాల్ ఇక్కడికి వచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట్లకు మహిళా పోలీసులను పంపించి దర్యాప్తు చేయిస్తామని ఈమె చెప్పారు. ‘కొందరు మహిళలను పీసీఆర్ వ్యాన్లలో నియమించినా నేరస్తులను వెంబడించడం వంటి సమయాల్లో వారిని రానివ్వడం లేదు. ఇలాంటి పనుల్లోనూ మహిళా పోలీసులను నియమిస్తామంటూ ఎసెస్పీ ఘిల్డియాల్ చేసిన ప్రకటన హర్షణీయం. ఆమె మహిళలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు’ అని నోయిడాలోని సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగి కవిత అన్నారు.