మహిళా పోలీసులంటే వీళ్లే..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆదర్శనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసులు చూపించిన తెగువ, సాహసం పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. హెడ్ కానిస్టేబుల్ జాశ్విని, కానిస్టేబుల్ పూజ సమయస్ఫూర్తితో వ్యవహరించి దుర్మార్గుడి బారి నుంచి ఓ యువతిని రక్షించారు. ఇటీవల దేశరాజధానిలో కలకలం రేపిన మీనాక్షి హత్య తర్వాత ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళల రక్షణ కోసం ఆపరేషన్ భరోసా పేరుతో ప్రత్యేక మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఆ విభాగానికి చెందిన జాశ్విన్, పూజ లాల్ బాగ్ ఏరియాలో కొంతమంది మహిళలతో మాట్లాడుతున్నారు. ఇంతలో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడనే సమాచారం అందింది. అంతే హుటాహుటిన అక్కిడికి చేరుకున్నారు. అక్కడ సీన్ చూస్తే చాలా భయంకరంగా, గందరగోళంగా ఉంది.
వీరేందర్ సింగ్ సునీల్ (34) అనే వ్యక్తి చేతిలో పిస్టల్ పట్టుకుని, ఓ మహిళను ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. రక్షించాలని ఆ మహిళ భీకరంగా అరుస్తోంది. ఎవరైనా కలగజేసుకుంటే ఆమెను షూట్ చేస్తానని బెదిరించాడు. చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నా ఎవరూ ముందుకు వెళ్లే సాహసం చేయలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను విడిచిపెట్టి.. లొంగిపొమ్మని హెచ్చరించారు. అయినా వినలేదు.. పైగా దగ్గరికొస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులిద్దరూ ఒక్క ఉదుటున అతడి మీదకు లంఘించి, ఆ యువతిని విడిపించారు. పిస్టల్ లాక్కొంటుండగా అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. కానీ మళ్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతలో సునీల్ తనవెంట తెచ్చుకున్న విషపు గుళికలను మింగేశాడు. దీన్నికూడా పోలీసులు అడ్డుకున్నారు. అతడి నోట్లోంచి కొన్ని మాత్రలను వెలికితీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌కు చెందిన సునీల్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడని పోలీసు ఉన్నతాధికారి విజయ్ సింగ్ తెలిపారు. ఆ యువతిని హత్యచేసి, ఆత్మహత్య చేసుకోవాలనే పథకంతోనే వచ్చాడని తెలిపారు. పథకం ప్రకారంమే పిస్టల్ లోడ్ చేసుకుని వచ్చాడని, విషపుమాత్రలు, సూసైడ్ నోట్ కూడా వెంట తెచ్చుకున్నాడని చెప్పారు. అతడిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఈ ఇద్దరు మహిళా పోలీసుల సాహసం గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి సిఫార్సు చేస్తామని సింగ్ తెలిపారు.
ఇదే యువతిని లైంగికంగా వేధించిన కేసులో 2015 జూలైలో అశోక్ విహార్ పోలీసుస్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది విచారణలో ఉండగానే సునీల్ ఈ అఘాయిత్యానికి తెగబడటం గమనార్హం.