stalker
-
ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని రైలు కిందకు తోసేసి..
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో దారుణం జరిగింది. 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిని ఓ ఆకతాయి కదులుతున్న రైలు కిందకు తోసేశాడు. థామస్ మౌంట్ రైల్వే స్టేషన్లో గురవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. అమ్మయి చెన్నై బీచ్‌కు వెళ్లే రైలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఘటనకు ముందు యువతికి, నిందితుడికి మధ్య వాగ్వాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోపంతో ఉన్న నిందితుడు రైలు ప్లాట్‌ఫైంకి రావడం చూసి ఆమెను తోసేశాడని చెప్పారు. నిందితుడ్ని అలందూర్‌కు చెందిన సతీశ్‌గా(23) గుర్తించారు పోలీసులు. అతను రిటైర్డ్ ఎస్ఐ కుమారుడని వెల్లడించారు. ఎనిమిదో తరగతిలోనే చదువు ఆపేశాడని, చాలా కాలంగా యువతి వెంట పడుతున్నట్లు తెలిపారు. యువతికి నిశ్చితార్థం.. మృతి చెందిన యువతిని సత్యగా గుర్తించారు పోలీసులు. ఆమె తల్లి హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారని తెలిపారు. సత్యకు గతనెలలోనే నిశ్ఛితార్థం జరిగినట్లు వెల్లడించారు. ఆమె తల్లి సహా కుటుంబసభ్యులంతా పోలీస్ శాఖలోనే ఉద్యోగాలు చేస్తున్నట్లు వివరించారు. చదవండి: టీచర్ బ్రేకప్ చెప్పిందని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి -
జీవిత భాగస్వాములపై నిఘా..! గూగుల్ కీలక నిర్ణయం...!
Google Get Rid Of Stalkerware Ads Promoting Spying On Spouse: ప్రస్తుత టెక్నాలజీతో ప్రతిదీ సాధ్యమే..! టెక్నాలజీను మంచి మార్గంలో వాడుకుంటే ఎన్నో ఉపయోగాలు..! అదే చెడు కోసం వాడితే భారీ ముప్పునే కల్గిస్తుంది. కొంత మంది వీపరిత బుద్దితో సాంకేతికతను దుర్వినియోగం కోసం వాడే వారు ఎంతోమంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీని ఉపయోగించి తమ భాగస్వాములపై నిఘా పెట్టడం కోసం పలువురు స్టాకర్వేర్ యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ఇదే కొంత మందికి అదునుగా మారి ఆయా వ్యక్తుల అవసరాలను క్యాష్ చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ జీవిత భాగస్వామిపై నిఘా పెట్టేందుకు స్టాకర్వేర్ యాప్స్ భారీగానే అందుబాటులో ఉన్నాయి. ఈ స్టాకర్వేర్ యాప్స్ ద్వారా జీవిత భాగస్వామి ఫోన్ మెసేజ్‌లు, కాల్ లాగ్‌లు, లొకేషన్, ఇతర వ్యక్తిగత కార్యకలాపాలను తెలుసుకుంటున్నారు. ఈ స్టాకర్వేర్ యాప్స్ ఫోన్లో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపట్టడం చాలా కష్టం. చదవండి: మొన్న ఫేస్బుక్ డౌన్..! ఇప్పుడు జీ మెయిల్..! స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ కీలక నిర్ణయం..! తాజాగా స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. స్టాకర్వేర్ యాప్స్‌ను ప్రోత్సహించే యాప్స్‌పై గూగుల్ ఉక్కుపాదం మోపింది. అంతేకాకుండా స్టాకర్వేర్ యాడ్స్‌ను కూడా గూగుల్ యాడ్స్‌లో కన్పించకుండా చేసింది. జీవిత భాగస్వాములపై నిఘా పెట్టే యాప్స్ గూగుల్ కఠినవైఖరిని అవలంభిస్తోందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. కొన్ని యాప్స్ అనేక పద్దతులను ఉపయోగించి స్టాకర్వేర్ యాప్స్‌ను ప్లేస్టోర్‌లో చొప్పించే ప్రయత్నాలను చేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. స్టాకర్వేర్ యాప్స్‌పై గూగుల్ ఎప్పటికప్పుడు నిఘా పెడుతుందని గూగుల్ ప్రతినిధి పేర్కొన్నారు. భారత్‌లో నిఘా ఎక్కువే...! ప్రముఖ సైబర్ సెక్యూరిటీ కాస్పర్‌స్కై నివేదిక ప్రకారం...స్టాకర్వేర్ యాప్స్‌తో భారత్‌లో సుమారు 4627 మంది ప్రభావితమైనట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా స్టాకర్వేర్ యాప్స్‌తో 2019లో 67,500 మంది, 2020లో 53,870 మంది ప్రభావితమయ్యారు. చదవండి: అదృష్టమంటే ఇదేనెమో..! 4 రోజుల్లో రూ.6 లక్షల కోట్లు సొంతం...! -
రెచ్చిపోయిన ఉన్మాది, మహిళపై కత్తితో దాడి
తిరువనంతపురం: కేరళలో మరో ఉన్మాది రెచ్చిపోయాడు. తనతో పెళ్లికి నిరాకరించిందన్న అక్కసుతో మహిళపై దారుణానికి తెగబడ్డాడు. గతంలో కూడా వేధింపులకు పాల్పడిన నిందితుడు సమయం చూసి ఇంట్లోకి చొరబడి మరీ బాధితురాలిని పొట్టన పెట్టుకున్న ఘటన విషాదాన్ని నింపింది. పెద్దమాల పోలీస్ స్టేషన్ పరిధిలోని కరీపూర్ సమీపంలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం ప్రకారం నాలుగేళ్ల క్రితం తిరువనంతపురానికి చెందిన సూర్యగాయత్రిని పెళ్లి చేసుకుంటానంటూ ఆమె కుటుంబాన్ని సంప్రదించాడు నిందితుడు, పెయాడ్కు చెందిన అరుణ్(29).అయితే ఈ ప్రతిపాదనను వారు తిరస్కరించారు. దీంతో అరుణ్ వేధింపుల పర్వం మొదలైంది. దీనికి తోడు తన స్మార్ట్‌ఫోన్, బంగారు నగలు దొంగిలించాడంటూ నాలుగేళ్ల క్రితమే సూర్యగాయత్రి తల్లి తిరువనంతపురంలోని ఆర్యనాడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, అప్పట్లో కేసు నమోదు చేయని పోలీసులు అరుణ్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేశారు. ఆ తరువాత కొంత కాలానికి సూర్యగాయత్రి మరొక వ్యక్తిని వివాహం చేసుకోగా, అరుణ్ కూడా వివాహం చేసుకున్నాడు. అయితే భర్తతో విబేధాల కారణంగా సూర్య గాయత్రి ఇటీవల పుట్టింటికి తిరిగి వచ్చింది. దీంతో అరుణ్ మళ్లీ ఆమె వెంటపడటం మొదలు పెట్టాడు. తనతో సంబంధం పెట్టుకోవాలని బెదిరించాడు. దీనికి నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. అదును చూసి ఎటాక్ చేసి కత్తితో ఏకంగా 15 సార్లు పొడిచాడు. వెంటనే స్పందించిన పొరుగువారు అరుణ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన సూర్యగాయత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూసింది. అరుణ్‌పై అంతకు ముందే క్రిమినల్ కేసులున్న నేపథ్యంలో అతని పెళ్లి ప్రస్తావనను తిరస్కరించామని గాయత్రి తల్లి వల్సల తెలిపారు. అరుణ్ దాడిలో గాయ పడిన వల్సల ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు. అయితే తనను అవమానించినందుకే ప్రతీకారం తీర్చుకున్నానని పోలీసుల విచారణలో నిందితుడు తెలిపాడని చెప్పారు. -
ఇంటర్ యువతిని వెంటాడి, వేధించి గొడ్డలితో నరికేశాడు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలపై వరుస అరాచకాలు, హత్యలు కలకలం రేపుతున్నాయి. తనను పట్టించుకోవడంలేదన్న ఆగ్రహంతో ఇంటర్ చదువుతున్న యువతిని గొడ్డలితో నరికి చంపాడో ప్రబుద్ధుడు. ఆరు నెలలపాటు వెంటాడి, వేధించి మరీ ఈ అఘాయిత్యానికి పాల్పడిన వైనం బాధిత కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెడితే..ఢిల్లీలోని మోతీబాగ్ ప్రాంతంలో నివసిస్తున్న యువతిపై, నిందితుడు ప్రవీణ్ వేధింపులకు పాల్పడేవాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రితో చెప్పుకుంది. దీంతో తండ్రి ప్రవీణ్‌ను కొట్టి, తీవ్రంగా మందలించాడు. ఇక అప్పటినుంచి మరింత రెచ్చిపోయాడు. ఎలాగైనా యువతి మట్టుబెట్టాలని పథకం వేశాడు. ఇందులో భాగంగానే గత నెల ఒక గొడ్డలిని కూడా కొనుగోలు చేశాడు. సోమవారం సాయంత్రం షాపునుంచి ఇంటికి వెళుతున్న ఆమెపై కాపుకాసి గొడ్డలితో ఎటాక్ చేశాడు. ఆసుపత్రికి తరలించినప్పటికీ, తీవ్రగాయాలతో కొద్దిసేపటికే మరణించింది. యువతి హత్యానంతరం హర్యానాకు పారిపోయిన ప్రవీణ్‌ను, సోదరి ఇంట్లో మంగళవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. తమకొక ఎలక్ట్రిక్ షాప్, ఫ్రూట్ షాప్ ఉందని, ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు షాపులో తన సోదరి కూర్చునేదని, ఆ సమయంలో ప్రవీణ్ వేధించేవాడనీ మృతురాలి సోదరి వాపోయింది. పగతో దారుణంగా తన సోదరిని పొట్టనపెట్టుకున్నాడని కన్నీరుమున్నీరుగా విలపించింది. అంతేకాదు పుట్టినరోజుకు ముందే చంపేస్తానని ప్రవీణ్ బెదిరించేవాడని చివరికి అన్నంతపనీ చేశాడని రోదించింది. కాగా గత వారం ఒక క్యాబ్ డ్రైవర్, అనుమానంతో ప్రియురాల్ని గొంతుకోసి హత్య చేశాడు. అలాగే మహిళల పేరుతో వంద నకిలీ సోషల్ మీడియా ఖాతాలను సృష్టించి అశ్లీల సందేశాలు, వీడియోలతో సంచలనం రేపిన జిమ్ ట్రైనర్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. -
ఆపిల్ సీఈవోకు వేధింపులు, ఫిర్యాదు
శాన్ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌పై భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. పాలో ఆల్టోలోని కుక్ అధికారిక నివాసంలోకి రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆపిల్ ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియా కోర్టు అతనిపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ వ్యాలీలోని కుక్ నివాసం, ఆయన సెక్యూరిటీ గార్డులు ముగ్గురు, ఆపిల్ పార్క్ ప్రధాన కార్యాలయానికిదూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో వుంటాయని కోర్టు తెలిపింది. ఆపిల్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ విలియం బర్న్స్ ప్రకారం శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన రాకేశ్ శర్మ అలియాస్ "రాకీ" (41) రెండుసార్లు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. 25 సెప్టెంబర్ 2019న వాయిస్ మెయిల్‌తో శర్మ వేధింపులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4 న షాంపైన్ బాటిల్, పువ్వులు తీసుకొని అనుమతిలేకుండా నేరుగా కుక్ ఇంటికి వచ్చాడు. ఒక వారం తరువాత మరో అవాంఛనీయ కాల్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత, శర్మ తన ట్విటర్ ఖాతాలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌ను ట్యాగ్ చేస్తూ కొన్నిఅభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు షేర్ చేశాడు. అలాగే జనవరి 15 న మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని హెచ్చరిస్తూ ఆపిల్ న్యాయవాదులు రాకీకి ఒక లేఖ పంపారు. అయినా ఏ మాత్రం బెదరని రాకీ ఈసారి ఆపిల్ టెక్నికల్ టీంకు కాల్ చేశాడు. కంపెనీ తనను చంపడానికి చూస్తోందని ఆరోపించాడు. మళ్లీ ఒక నెల తరువాత తిరిగి వచ్చిన అతగాడు ఏకంగా టిమ్ కుక్ నివాసంలోని గేటులోకి ప్రవేశించి డోర్ బెల్ మోగించాడని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. మరోవైపు కుక్ నివాసం వద్ద పదపదే నిబంధనలను ఉల్లంఘించడం, తుపాకీ గురించి మాట్లాటడం చేశాడని, శారీరకంగా తనకు హాని చేస్తాడని గట్టిగా నమ్ముతున్నానని కుక్ సెక్యూరిటీ బృందంలోని ఒక సభ్యుడు ఆరోపించారు. -
మహిళా లెక్చరర్‌ను వెంబడించి..
ముంబై : మహారాష్ట్రలోని వార్ధాలో కాలేజ్ లెక్చరర్‌గా పనిచేస్తున్న మహిళకు ఓ పోకిరి నిప్పు పెట్టిన ఘటన వెలుగుచూసింది. సోమవారం ఉదయం మహిళ కాలేజ్‌కు వెళుతుండగా రెండేళ్లుగా ఆమె వెంటపడుతున్న నిందితుడు విక్కీ నగ్రారే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. 40 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మహిళా లెక్చరర్‌కు నిప్పంటించిన నిందితుడిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. కాగా బాధితురాలికి నిప్పంటించి నిందితుడు పరారవడంతో గమనించిన స్ధానికులు నీటితో మంటలను ఆర్పి సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు నాగపూర్‌లోని ఆరంజ్ సిటీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని పోలీస్ అధికారులు వెల్లడించారు.నిందితుడు వివాహితుడని అతడికి ఏడునెలల కుమారుడు ఉన్నాడని, రెండేళ్లుగా బాధితురాలిని వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. చదవండి : పెళ్లికి నిరాకరణ, రెచ్చిపోయిన ప్రేమోన్మాది -
ఆ సెలబ్రిటీ వెంటపడి ఖాకీలకు చిక్కాడు..
ముంబై : సెలబ్రిటీలను ఫాలో అవుతూ వారిని చికాకు పెట్టే అభిమానులు కొందరైతే వెంటపడి వేధించే ప్రబుద్ధుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా ముంబైలో టీవీ దిగ్గజం ఏక్తా కపూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏక్తా కపూర్‌ను గత నెలరోజులుగా అనుసరిస్తూ ఆమె ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షం కావడంతో పాటు ఆమెను సమీపించేందుకు ప్రయత్నించిన 32 ఏళ్ల క్యాబ్‌డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలరోజుల్లో దాదాపు 30 సార్లు నిందితుడు ఏక్తాను ఫాలో అయ్యాడని పోలీసులు చెప్పారు. క్యాబ్ డ్రైవర్‌ను హర్యానాకు చెందిన సుధీర్ రాజేందర్ సింగ్‌గా గుర్తించారు. కొద్ది రోజుల కిందట ఏక్తా కపూర్ జుహులోని ఓ ఆలయం సందర్శించగా, అక్కడికి చేరుకున్న సింగ్ ఆమెకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించగా ఆమె సెక్యూరిటీ గార్డులు అడ్డుకుని హెచ్చరించి పంపారని పోలీసులు చెప్పారు. ఏక్తా కపూర్ కదలికలను పసిగట్టిన సింగ్ అంథేరి వెస్ట్‌లో తరచూ ఆమె వెళ్లే జిమ్‌లోనే నిందితుడు సభ్యత్వం తీసుకోవడం పోలీసులను షాక్‌కు గురిచేసింది. ఈనెల 16న ఏక్తా జిమ్‌కు వెళ్లగా అక్కడ నిందితుడిని చూసిన ఆమె సెక్యూరిటీ గార్డులు అతడిని అడ్డుకున్నారు. ఏక్తా ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
ప్రేమోన్మాది ఘాతుకం : పెట్రోల్ పోసి నిప్పు
దేశంలో మహిళలపై, యువతులపై అరాచకాలకు అడ్డు లేకుండా పోతోంది. ఏదో ఒక మూల హింసాత్మక ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. తెలంగాణా రాష్ట్రంలో వరంగల్ రవళి విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరో ప్రేమోన్మాది అఘాయిత్యానికి తెగబడ్డాడు. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తూ వెంటబడుతున్న ఒక యువకుడు చివరికి ఆ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పటించాడు. 80శాతం గాయాలతో బాధితురాలు ఆసుప్రతిలో మృత్యువుతో పోరాటాడుతోంది. కేరళలోని పాతానంతిట్టలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తిరువళ్ల పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ పని చేశానని నిందితుడు కుంబానాడ్ నివాసి, అజిన్ రేజి మాథ్యూ (20)ఒప్పుకున్నాడు. బాధితురాల్ని టాటా మెడికల్ సైన్సెస్‌లో బీఎస్సీ చదువుతున్న కవిత విజయ్‌కుమార్ (18)గా గుర్తించారు. రెండు బాటిళ్ల పెట్రోల్‌తో వచ్చిన అజిన్ మొదట అమ్మాయితో గొడవకు దిగాడు. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు సంఘటనా స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు. -
సచిన్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్
కోల్‌కతా: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్‌ను వేధించిన వ్యక్తిని ముంబై పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడు పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు చెందిన దేవ్ కుమార్(32)గా గుర్తించారు. వేధింపులకు పాల్పడటమే కాకుండా సారాను కిడ్నాప్ చేస్తానని నిందితుడు బెదిరించినట్టు పోలీసులు తెలిపారు. సచిన్ కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిని అరెస్ట్ చేశారు. తనకు సారాతో పెళ్లి చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని సచిన్ ఇంటికి ఫోన్ చేసి బెదిరించాడని పోలీసులు వెల్లడించారు. సచిన్ ఇంటిలోని లాండ్ నంబర్‌కు 20 సార్లు ఫోన్ చేసి సారా గురించి అసభ్యంగా మాట్లాడాడని తెలిపారు. డిసెంబర్ 2న చివరిసారిగా ఫోన్ చేశాడని, డిసెంబర్ 5న బాంద్రా పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు చెప్పారు. టెలిఫోన్ టవర్ లోకేషన్ ఆధారంగా అతడిని పట్టుకున్నారు. నిందితుడి మానసికస్థితి సరిగా లేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. అతడిని ముంబైకి తీసుకొచ్చి, కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా, సచిన్ ఫోన్ నంబర్ అతడికెలా తెలిసింది, నిందితుడి మానసిక పరిస్థితి నిజంగానే సరిగా లేదా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమించలేదని దారుణం..టెకీ మరణం
సాక్షి, చెన్నై: ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఓ టెకీ కుటుంబంపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కలకలం రేపింది. చెన్నై అదాంబక్కంలో సోమవారం రాత్రి ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలతో ఇందూజ ప్రాణాలు కోల్పోగా, ఆమెతల్లి, సోదరి మృత్యువుతో పోరాడుతున్నారు. ప్రేమించమని వెంటబడి ఈ దారుణానికి ఒడిగట్టిన అశోక్ పరారీలో ఉన్నాడు. వివరాల్లోకి వెళితే...ఇందుజా, అశోక్ ఒకే కాలేజీలో ఇంజనీరింగ్ చదువుకున్నారు. ఇందుజాను ప్రేమిస్తున్నానని గత నెలరోజులుగా వెంటడుతున్నాడు. కానీ దీన్ని ఇందూజ తిరస్కరించింది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న ఇందూజ స్థానిక కంపెనీలో ఇటీవలే ఉద్యోగంలో చేరింది. అయితే అశోక్ వేధింపులకు తట్టుకోలేక గత నెల రోజులుగా ఇంట్లోనే ఉంటోంది. ఇంతలోనే అశోక్ ఈ అఘాయిత్యానికి తెగబడ్డాడు. ప్రేమించమని వేధిస్తోన్న అశోక్ సోమవారం మరోసారి ఆమె ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు అతనితో వాగ్వాదానికి దిగారు. ఒక్కసారి తలుపు తీయమని అశోక్ వాదనకు దిగాడు. దీంతో వారు తలుపు తీయగానే... క్యాన్‌తో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఇందూజ, ఆమె తల్లి రేణుక, సోదరి నివేదితపై పోసి నిప్పంటించి పారిపోయాడు. విషయం గమనించిన ఇరుగు పొరుగువారు వారిని హుటాహుటిన స్థానిక కేంఎసీ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో..ఇందూజ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచింది. తల్లి రేణుక 49శాతం కాలిన గాయాలతో, నివేదిత 23శాతం గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరోవైపు ఇందూజ సోదరుడు విదేశంలో ఉన్నారని ఇందూజ బంధువు ఒకరు చెప్పారు. అలాగే గత నెల రోజులుగా అశోక్ ఇందూజ వెంటపడుతున్నాడని.. అన్న ఇంట్లో లేడనితెలిసి దాడికి దిగాడని ఆరపించారు. -
యువ నటికి వేధింపులు
సాక్షి, బెంగళూరు: తనను ప్రేమించాలంటూ మలయాళ నటి, మోడల్ రెబా మోనికా జాన్ వెంటపడుతున్న యువకుడిని సోమవారం మడివాళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన మోనికా జాన్ బెంగళూరులో నివాసముంటోంది. ప్రతి ఆదివారం ఆమె చర్చికి వెళ్లేది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్సిటీకి చెందిన ఫ్రాంక్లిన్ విసిల్ అనే యువకుడికి ఆమె పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఫ్రాంక్లిన్ తనను ప్రేమించాలని, పెళ్లిచేసుకోవాలని ఆమె వెంటబడుతున్నాడు. రోబోమోనికాజాన్ అందుకు నిరాకరించి ఆ యువకుడిని తీవ్రంగా హెచ్చరించింది. కానీ ఫ్రాంక్లిన్ ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని అశ్లీల మెసేజ్‌లు పంపేవాడు. దీనిపై మోనికా జాన్ రెండురోజుల క్రితం మడివాళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఫ్రాంక్లిన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354డీ కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచామని పోలీసు అధికారి తెలిపారు. తర్వాత బెయిల్‌పై అతడిని విడిచిపెట్టినట్టు వెల్లడించారు. గతేడాది విడుదలైన ‘జాకొబింతె స్వర్గరాజ్యం’ సినిమాతో మోనికా జాన్ మలయాళ సినిమా పరిశ్రమలో తెరంగ్రేటం చేసింది. ప్రస్తుతం ‘పిపిన్ చువతిలె ప్రణయం’ సినిమాలో నటిస్తోంది. -
బీజేపీ నాయకురాలికి వేధింపులు
ముంబై: అసభ్య సందేశాలతో దుండగుడు ఒకరు తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ నాయకురాలు, ఫ్యాషన్ డిజైనర్ షైనా ఎన్సీ పోలీసులను ఆశ్రయించారు. వాట్సాప్, ఎసెమ్మెస్ ద్వారా తనకు అసభ్య సందేశాలు పంపిస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ముంబై బీకేసీలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఆమె ఫిర్యాదు చేశారు. దుండగుడు గత డిసెంబర్ నుంచి తనకు అశ్లీల సందేశాలు పంపిస్తున్నాడని, పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదని ఫిర్యాదులో తెలిపారు. నిత్యం అభ్యంతకర మెసేజ్ లు వస్తుండడంతో తట్టుకోలేక పోలీసులను ఆశ్రయించినట్టు షైనా తెలిపారు. తనలా మరొకరు వేధింపులకు గురికాకుడదన్న ఉద్దేశంతోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దుండగుడిని అరెస్ట్ చేసి చట్టప్రకారం శిక్షించాలని కోరారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పట్టపగలు మెట్రో స్టేషన్ లో కిరాతకం
గుర్గావ్: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా మహిళను ఓ దుర్మార్గుడు కిరాతకంగా హత్య చేశాడు. గుర్గావ్ లోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్ లో సోమవారం ఉదయం జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. రోహిణి ప్రాంతంలో బ్యూటీ పార్లర్ లో పనిచేస్తున్న పింకీ దేవి(34) అనే మహిళను జితేందర్ అనే ఆటోడ్రైవర్ పాశవికంగా పొడిచి చంపాడు. ముందుగా వెనుక నుంచి ఆమెపై జితేందర్ దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తర్వాత ఆమె గొంతు కోసి, విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడని చెప్పాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని కత్తితో బెదిరించాడు. ఎలక్ట్రిక్ స్టాండింగ్ ఫ్యాన్ విసిరి అతడిని పట్టుకున్నారు. పింకీ దేవిని సమీపంలోని ఉమా సంజీవని ఆస్పత్రికి తరలించగా సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. తీవ్రగాయాలతో మధ్యాహ్నం ఆమె మృతి చెందింది. ఆమె దేహంలో 30 కత్తి గాయాలున్నాయని పోస్టుమార్టం చేసిన వైద్యుడు దీపక్ మాథూర్ తెలిపారు. షిల్లాంగ్ కు చెందిన పింకీ దేవి తన భర్త మాన్ సింగ్ తో కలిసి గుర్గావ్ లోని సార్ హాల్ గ్రామంలో నివసిస్తోంది. మూడేళ్ల క్రితం వీరికి పెళ్లైంది. నిందితుడు జితేందర్ ను ప్రభుత్వాసుపత్రిలో చేర్చామని పోలీసులు తెలిపారు. అతడు ఎందుకు ఈ దారుణానికి ఒడిగట్టాడో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన జితేందర్ గుర్గావ్ లోని రాజీవ్ నగర్ లో నివసిస్తున్నాడని వెల్లడించారు. అయితే గత కొన్ని నెలలుగా పింకీ దేవిని జితేందర్ వేధిస్తున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
1,500 మంది మహిళలను వేధించాడు..
న్యూఢిల్లీ: ఏడాదికాలంగా దేశవ్యాప్తంగా 1,500 మంది మహిళలకు ఫోన్లు చేసి అసభ్యకరంగా మాట్లాడుతూ, మెసేజ్ ల రూపంలో బూతులను పంపుతున్న వ్యక్తిని ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగిని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు వ్యక్తి ఫోన్ నంబర్ ఆధారంగా బలిమారన్ ప్రాంతంలో ఓ షాపు రన్ చేసే మహమ్మద్ ఖలీద్ గా గుర్తించారు. మహిళలకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపి గుర్తించడానికి వీలు లేకుండా వెంటనే ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేస్తాడని వివరించారు. నకిలీ గుర్తింపు కార్డుల ద్వారా మూడు సిమ్ కార్డులను ఉపయోగిస్తూ గత ఏడాదిగా 1,500 మంది మహిళలను వేధించినట్లు తెలిపారు. వీరిలో కేవలం ఐదుగురు మాత్రమే పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. నిందితుడి సిమ్ కార్డుల్లో దాదాపు 2,000 మంది ఫోన్ నంబర్లు ఉన్నాయని వాటిలో 1,500 నంబర్లకు తరచూ అసభ్యకరమైన మెసేజ్ లు పంపినట్లు చెప్పారు. కేసు విచారణ ఒక దశలో ఖలీద్ దొరికే అవకాశం లేదని భావించామని, అదే సమయంలో ఖలీద్ నంబర్ నుంచి జార్ఖండ్ లోని మహిళకు ఫోన్ చేయడంతో అతన్ని గుర్తించినట్లు తెలిపారు. అతని ఇంటి నుంచే ఈ ఫోన్లు రావడం గుర్తించిన పోలీసులు బృందంగా ఏర్పడి వలపన్ని ఖలీద్ ను పట్టుకున్నారు. ఖలీద్ దగ్గర ఉన్న సిమ్ కార్డులన్నీ చాందినీ చౌక్ లోని మొబైల్ షాపుల్లో కొనుగోలు చేసినట్లు వెల్లడించాడని చెప్పారు. ఈ నెంబర్లకు తరచూ ఖలీద్ రీచార్జ్ లు చేయించినట్లు కూడా గుర్తించినట్లు చెప్పారు. విచారణలో ఖలీద్ చెప్పిన విషయాలను విన్న పోలీసులు నివ్వెరపోయారు. రోజుకు 25 నుంచి 30 మంది మహిళలను వేధిస్తాడని నిందితుడు ఒప్పుకున్నట్లు తెలిపారు. అతను చెప్పినట్లు వినకపోతే ఫోన్ నంబర్లు, ఫోటోలను ఫేస్ బుక్ లో పెడతానని బెదిరించేవాడని చెప్పారు. ఖలీద్ కు పెళ్లి చూపుల సమయంలో వివాహం చేసుకోనని కొంతమంది అమ్మాయిలు నిరాకరించడం వల్లే మహిళలను వేధించడం ప్రారంభించినట్లు వెల్లడించారు. బాధితులకు సంబంధించిన ఇతర వివరాలు ఏమైనా ఖలీద్ వద్ద ఉన్నాయేమోనని అన్వేషిస్తున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా సిమ్ కార్డులను యాక్టివేట్ చేసినట్లు విచారణలో వెల్లడైతే టెలికాం ఆపరేటర్లకు 50 వేల జరిమానా ఉంటుందని వివరించారు. -
అందరి ముందే స్వాతిని చెంపదెబ్బలు కొట్టాడు!
చెన్నై: గతవారం నుంగంబాకం రైల్వేస్టేషన్లో దారుణ హత్యకు గురైన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని ఓ వ్యక్తి చెంపదెబ్బలు కొట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే దుండగుడు స్వాతిని ఐదుసార్లు చెంపదెబ్బలు కొట్టాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. చెన్నైలో స్వాతి నివసించే ప్రాంతంలోనే నివసించే డీ తమిళరసన్ తాజాగా ఈ ఘటన గురించి వివరించారు. జూన్ మొదటివారంలో స్వాతిని వెంటాడుతూ వచ్చిన ఓ వ్యక్తిని రైల్వే స్టేషన్లో ఆమెను పలుసార్లు చెంపదెబ్బలు కొట్టాడని తెలిపారు. ‘స్వాతి ఆ దెబ్బలను మౌనంగా భరించింది. అతడిని ఏమాత్రం ప్రతిఘటించలేదు. ఆ తర్వాత మౌనంగా రైలెక్కి వెళ్లిపోయింది’ అని తమిళరసన్ చెప్పారు. అయితే, స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి, ఆమెను కిరాతకంగా చంపిన ఒక్కడే కాకపోవచ్చునని ఆయన చెప్పారు. స్వాతిని చంపిన వాడు నల్లగా ఉన్నాడని, చెంపదెబ్బలు కొట్టిన వ్యక్తి మాత్రం తెల్లగా కనిపించాడని తెలిపారు. స్వాతిని గత శుక్రవారం చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట గత మే నెల నుంచి స్వాతిని వెంటాడుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోను గురువారం చెన్నై పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
వీడే ఆ దుర్మార్గుడు!
టెక్కీ స్వాతి హత్యకేసులో నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటో విడుదల చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు విచారణలో కీలక పరిణామం. స్వాతిని హత్యచేసిన నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోను చెన్నై పోలీసులు గురువారం విడుదల చేశారు. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఈ హత్యకేసు విచారణను రైల్వే పోలీసుల నుంచి చెన్నై పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. స్వాతిని గత శుక్రవారం చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట గత మే నెల నుంచి స్వాతిని వెంటాడుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఫొరెన్సిక్ సంస్థ సాయంతో నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోలను చెన్నై పోలీసులు సంపాదించినట్టు సమాచారం. స్వాతి హత్య జరిగి వారం రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో నిందితుడి స్పష్టమైన ఫొటోను విడుదల చేయడం ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా పోలీసులు భావిస్తున్నారు. -
స్వాతిని అలా చూస్తూ ఉండిపోయారు కానీ..
చైన్నై: తను నిస్సహాయంగా నెత్తుటిమడుగులో కూలిపోయింది. రెండుగంటలపాటు సాయం కోసం అర్థించింది. కానీ, అందరూ చూస్తూ ఉండిపోయారు. ఒక్కరూ కూడా ధైర్యం చేయలేదు. తనకు సాయం చేసేందుకు ముందుకురాలేదు. ఇది చెన్నై నుంగంబాకం రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వాతి ఉదంతమిది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న ఆమెను గత శుక్రవారం ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట వేధించిన వెంటాడిన దుర్మార్గుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైన నేపథ్యంలో స్వాతి తండ్రి సంతాన గోపాలకృష్ణన్ మంగళవారం మీడియాతో తన ఆవేదన పంచుకున్నాడు. ‘రైల్వే స్టేషన్లో రెండుగంటలపాటు నా కూతురు నెత్తురు మడుగులో పడి ఉన్నా.. చుట్టూ ఉన్న ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు.. ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకురాలేదు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి ఆలస్యంగా వచ్చారు. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలో మహిళల భద్రతపై సందేహాలు రేకెత్తిస్తున్నది’ అని గోపాలకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురిని ఓ స్టాకర్ (ఆకతాయి) వెంటాడి వేధిస్తున్న విషయమై గత మే 10వతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆకతాయి గతంలో ఓసారి వేధింపులకు పాల్పడితే.. స్వాతి స్థానిక దుకాణదారుల సాయం తీసుకొని అతని బారి నుంచి తప్పించుకొందని తెలిపారు. ఇంతలో ఆ దుర్మార్గుడు తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణకు పూర్తిగా తమ కుటుంబసభ్యలు పూర్తిగా సహకరిస్తున్నారని, త్వరలోనే స్వాతిని హతమార్చిన నేరగాడికి శిక్ష పడుతుందన్న విశ్వాసం తమకు ఉందని చెప్పారు. -
మహిళా పోలీసులంటే వీళ్లే..
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆదర్శనగర్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన మహిళా పోలీసులు చూపించిన తెగువ, సాహసం పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. హెడ్ కానిస్టేబుల్ జాశ్విని, కానిస్టేబుల్ పూజ సమయస్ఫూర్తితో వ్యవహరించి దుర్మార్గుడి బారి నుంచి ఓ యువతిని రక్షించారు. ఇటీవల దేశరాజధానిలో కలకలం రేపిన మీనాక్షి హత్య తర్వాత ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. మహిళల రక్షణ కోసం ఆపరేషన్ భరోసా పేరుతో ప్రత్యేక మహిళా పోలీసు విభాగాన్ని ఏర్పాటుచేశారు. ఆ విభాగానికి చెందిన జాశ్విన్, పూజ లాల్ బాగ్ ఏరియాలో కొంతమంది మహిళలతో మాట్లాడుతున్నారు. ఇంతలో ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడనే సమాచారం అందింది. అంతే హుటాహుటిన అక్కిడికి చేరుకున్నారు. అక్కడ సీన్ చూస్తే చాలా భయంకరంగా, గందరగోళంగా ఉంది. వీరేందర్ సింగ్ సునీల్ (34) అనే వ్యక్తి చేతిలో పిస్టల్ పట్టుకుని, ఓ మహిళను ఈడ్చుకుంటూ వెళ్తున్నాడు. రక్షించాలని ఆ మహిళ భీకరంగా అరుస్తోంది. ఎవరైనా కలగజేసుకుంటే ఆమెను షూట్ చేస్తానని బెదిరించాడు. చుట్టూ చాలామంది గుమిగూడి ఉన్నా ఎవరూ ముందుకు వెళ్లే సాహసం చేయలేదు. ఇంతలో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను విడిచిపెట్టి.. లొంగిపొమ్మని హెచ్చరించారు. అయినా వినలేదు.. పైగా దగ్గరికొస్తే చంపేస్తానని బెదిరించాడు. దీంతో పోలీసులిద్దరూ ఒక్క ఉదుటున అతడి మీదకు లంఘించి, ఆ యువతిని విడిపించారు. పిస్టల్ లాక్కొంటుండగా అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేశాడు. కానీ మళ్లీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అంతలో సునీల్ తనవెంట తెచ్చుకున్న విషపు గుళికలను మింగేశాడు. దీన్నికూడా పోలీసులు అడ్డుకున్నారు. అతడి నోట్లోంచి కొన్ని మాత్రలను వెలికితీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఉత్తర ఢిల్లీలోని ఆజాద్‌పూర్‌కు చెందిన సునీల్ ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతున్నాడని పోలీసు ఉన్నతాధికారి విజయ్ సింగ్ తెలిపారు. ఆ యువతిని హత్యచేసి, ఆత్మహత్య చేసుకోవాలనే పథకంతోనే వచ్చాడని తెలిపారు. పథకం ప్రకారంమే పిస్టల్ లోడ్ చేసుకుని వచ్చాడని, విషపుమాత్రలు, సూసైడ్ నోట్ కూడా వెంట తెచ్చుకున్నాడని చెప్పారు. అతడిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. ఈ ఇద్దరు మహిళా పోలీసుల సాహసం గురించి ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీకి సిఫార్సు చేస్తామని సింగ్ తెలిపారు. ఇదే యువతిని లైంగికంగా వేధించిన కేసులో 2015 జూలైలో అశోక్ విహార్ పోలీసుస్టేషన్లో ఇతనిపై కేసు నమోదైంది. ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది విచారణలో ఉండగానే సునీల్ ఈ అఘాయిత్యానికి తెగబడటం గమనార్హం. -
పోకిరీని తరిమి తరిమి కొట్టారు..
వైఎస్ఆర్ జిల్లా: గతకొంతకాలంగా అసభ్య పదజాలంతో వేధిస్తున్న ఓ పోకిరీకి మహిళలు తగిన బుద్ధి చెప్పారు. ఫోన్లో తరచూ వేధిస్తున్న అతన్ని చితకబాదడమే కాకుండా.. తరిమితరిమికొట్టారు. వారికి స్థానికులు అండగా నిలువడంతో పోకిరీ తోక మూడిచి పారిపోయాడు. ఈ ఘటన వైఎస్ఆర్ జిల్లా బద్వేలులో ఆదివారం రాత్రి ఘటన జరిగింది. బద్వేలు పట్టణంలోని కృష్ణదేవ రాయనగర్‌కు చెందిన ఓ యువతిని జకీర్ అనే యువకుడు తరచూ ఫోన్ లో వేధిస్తున్నాడు. దీంతో యువతి బంధువులు అతన్ని మార్కెట్ యార్డ్ కు రప్పించి నిలదీశారు. అయినా అతని తీరు మారకపోవడంతో మహిళలు తిరగబడి అతడిని చితకబాదారు. అతడు కూడా వారిపై దాడికి ప్రయత్నించాడు. దీంతో అతన్ని రోడ్డు మీద పడేసి.. తీవ్రంగా తన్నారు. దీంతో పోకిరీ పరారయ్యాడు. ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించి దర్యాప్తు జరుపుతున్నారు. పోకిరీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వేధించినవాడిని ఇంటికి పిలిచి.. యాసిడ్ దాడి
చాలాకాలంగా తనను వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీ మీద యాసిడ్ పోసినందుకు బంగ్లాదేశ్‌లో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఖదీముల్ ఇస్లాం (28) అనే చిరు వ్యాపారి ఈ యాసిడ్ డాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో బలియాడంగీ ఉపాజిలా గ్రామంలో ఈ సంఘటన జరిగింది. ఖదీమ్ తనను చాలాకాలంగా వేధిస్తున్నాడని, తాను వద్దంటున్నా వినకుండా లైంగిక సంబంధం పెట్టుకోవాలంటూ వెంటపడుతున్నాడని, ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని అరెస్టయిన మహిళ తెలిపింది. అతడు చివరకు తన కుటుంబ సభ్యులపై కూడా వేధింపులకు పాల్పడటంతో తాను భరించలేకపోయానని, గత రాత్రి తన గదికి పిలిచానని తెలిపింది. అయితే తాను ఒప్పుకొన్నట్లు భావించిన అతడు వెంటనే రావడంతో గది తలుపులు మూసి అతడిపై యాసిడ్ పోసినట్లు వివరించింది. అతడి అరుపులు విన్న ఇరుగుపొరుగు వాళ్లు వెంటనే వచ్చి, అతడిని ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో అతడి శరీరం, పురుషాంగాలు కూడా బాగా కాలిపోయినట్లు పోలీసులు చెప్పారు. -
శృతిహాసన్పై దాడి కేసులో ఓ వ్యక్తి అరెస్టు
చెన్నై: సినీనటి శృతిహాసన్పై దాడి కేసులో పోలీసులు అడుగు ముందుకేశారు. ముంబై ఫిల్మ్‌సిటీలో పనిచేస్తున్న అశోక్ శంకర్ త్రిముఖి(45)ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు పుటేజీని పరిశీలించిన పోలీసులకు శంకర్ త్రిముఖి పట్టుబడ్డాడు. కాగా అతను మాత్రం శృతిహాసన్ ఎవరో తనకు తెలీదని తెలిపాడు. తన ఇంట్లోకి అక్రమంగా చొరబడిన గుర్తుతెలియని వ్యక్తిపై హీరోయిన్ శ్రుతిహాసన్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై శివార్లలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఆమె ఇంట్లోకి మంగళవారం ఉదయం ఓ వ్యక్తి అక్రమంగా చొరబడిన విషయం తెలిసిందే. ఆరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో శ్రుతిహాసన్ తన అపార్టుమెంట్లో ఉండగా డోర్ బెల్ మోగింది. ఆమె తలుపు తీయగానే అగంతకుడు లోనికి చొరబడ్డాడు. తనను ఎందుకు గుర్తు పట్టడంలేదంటూ నిలదీశాడు. -
ఇంట్లోకి చొరబడిన వ్యక్తిపై శ్రుతిహాసన్ ఫిర్యాదు
తన ఇంట్లోకి అక్రమంగా చొరబడిన గుర్తుతెలియని వ్యక్తిపై హీరోయిన్ శ్రుతిహాసన్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ముంబై శివార్లలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఆమె ఇంట్లోకి మంగళవారం ఉదయం ఓ వ్యక్తి అక్రమంగా చొరబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఆరోజు ఉదయం 9.30 గంటల ప్రాంతంలో శ్రుతిహాసన్ తన అపార్టుమెంట్లో ఉండగా డోర్ బెల్ మోగింది. ఆమె తలుపు తీయగానే అగంతకుడు లోనికి చొరబడ్డాడు. తనను ఎందుకు గుర్తు పట్టడంలేదంటూ నిలదీశాడు. అంతేకాదు.. ఆ నిందితుడు శ్రుతి భుజాలపై చేతులు కూడా వేశాడు. చివరకు ఎలాగోలా అతడిని బయటకు తోసేసి, తలుపు లోపల నుంచి తాళం పెట్టుకుందని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన శ్రతి, పోలీసులకు తాజాగా ఫిర్యాదుచేసింది. దీంతో నిందితుడిపై సెక్షన్ 354, సెక్షన్ 452ల కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ శివాజీ కోలేకర్ తెలిపారు. ఇంతకుముందు కొన్ని సందర్భాలలో తన సినిమా సెట్లు కొన్నింటిలో కూడా ఆ నిందితుడు కనిపించాడని శ్రుతి హాసన్ తెలిపింది. అలాగే మహబూబ్ స్టూడియో, ఫిల్మ్ సిటీ స్టూడియోల వద్ద కూడా అతగాడిని ఇంతకుముందు చూశానంది. పోలీసులు శ్రుతి ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ తెప్పించుకుని పరిశీలిస్తున్నారు. సందర్శకుల డైరీలో అతడు తనపేరు 'అశోక్' అని రాశాడు. అయితే అది తప్పుడు పేరు కావచ్చని పోలీసులు అంటున్నారు.