స్వాతిని అలా చూస్తూ ఉండిపోయారు కానీ..
చైన్నై: తను నిస్సహాయంగా నెత్తుటిమడుగులో కూలిపోయింది. రెండుగంటలపాటు సాయం కోసం అర్థించింది. కానీ, అందరూ చూస్తూ ఉండిపోయారు. ఒక్కరూ కూడా ధైర్యం చేయలేదు. తనకు సాయం చేసేందుకు ముందుకురాలేదు. ఇది చెన్నై నుంగంబాకం రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని స్వాతి ఉదంతమిది. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న ఆమెను గత శుక్రవారం ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట వేధించిన వెంటాడిన దుర్మార్గుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైన నేపథ్యంలో స్వాతి తండ్రి సంతాన గోపాలకృష్ణన్ మంగళవారం మీడియాతో తన ఆవేదన పంచుకున్నాడు. ‘రైల్వే స్టేషన్‌లో రెండుగంటలపాటు నా కూతురు నెత్తురు మడుగులో పడి ఉన్నా.. చుట్టూ ఉన్న ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు.. ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకురాలేదు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి ఆలస్యంగా వచ్చారు. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలో మహిళల భద్రతపై సందేహాలు రేకెత్తిస్తున్నది’ అని గోపాలకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు.
తమ కూతురిని ఓ స్టాకర్ (ఆకతాయి) వెంటాడి వేధిస్తున్న విషయమై గత మే 10వతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆకతాయి గతంలో ఓసారి వేధింపులకు పాల్పడితే.. స్వాతి స్థానిక దుకాణదారుల సాయం తీసుకొని అతని బారి నుంచి తప్పించుకొందని తెలిపారు. ఇంతలో ఆ దుర్మార్గుడు తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణకు పూర్తిగా తమ కుటుంబసభ్యలు పూర్తిగా సహకరిస్తున్నారని, త్వరలోనే స్వాతిని హతమార్చిన నేరగాడికి శిక్ష పడుతుందన్న విశ్వాసం తమకు ఉందని చెప్పారు.