Infosys employee hacked to death
-
అందరి ముందే స్వాతిని చెంపదెబ్బలు కొట్టాడు!
చెన్నై: గతవారం నుంగంబాకం రైల్వేస్టేషన్లో దారుణ హత్యకు గురైన ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతిని ఓ వ్యక్తి చెంపదెబ్బలు కొట్టిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే దుండగుడు స్వాతిని ఐదుసార్లు చెంపదెబ్బలు కొట్టాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. చెన్నైలో స్వాతి నివసించే ప్రాంతంలోనే నివసించే డీ తమిళరసన్ తాజాగా ఈ ఘటన గురించి వివరించారు. జూన్ మొదటివారంలో స్వాతిని వెంటాడుతూ వచ్చిన ఓ వ్యక్తిని రైల్వే స్టేషన్లో ఆమెను పలుసార్లు చెంపదెబ్బలు కొట్టాడని తెలిపారు. ‘స్వాతి ఆ దెబ్బలను మౌనంగా భరించింది. అతడిని ఏమాత్రం ప్రతిఘటించలేదు. ఆ తర్వాత మౌనంగా రైలెక్కి వెళ్లిపోయింది’ అని తమిళరసన్ చెప్పారు. అయితే, స్వాతిని చెంపదెబ్బ కొట్టిన వ్యక్తి, ఆమెను కిరాతకంగా చంపిన ఒక్కడే కాకపోవచ్చునని ఆయన చెప్పారు. స్వాతిని చంపిన వాడు నల్లగా ఉన్నాడని, చెంపదెబ్బలు కొట్టిన వ్యక్తి మాత్రం తెల్లగా కనిపించాడని తెలిపారు. స్వాతిని గత శుక్రవారం చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట గత మే నెల నుంచి స్వాతిని వెంటాడుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోను గురువారం చెన్నై పోలీసులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
వీడే ఆ దుర్మార్గుడు!
టెక్కీ స్వాతి హత్యకేసులో నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటో విడుదల చెన్నై: ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకేసు విచారణలో కీలక పరిణామం. స్వాతిని హత్యచేసిన నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోను చెన్నై పోలీసులు గురువారం విడుదల చేశారు. మద్రాస్ హైకోర్టు జోక్యంతో ఈ హత్యకేసు విచారణను రైల్వే పోలీసుల నుంచి చెన్నై పోలీసులకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. స్వాతిని గత శుక్రవారం చెన్నైలోని నుంగంబాకం రైల్వే స్టేషన్లో ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట గత మే నెల నుంచి స్వాతిని వెంటాడుతున్న ఓ యువకుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ ఫొరెన్సిక్ సంస్థ సాయంతో నిందితుడి హై రిజుల్యూషన్ ఫొటోలను చెన్నై పోలీసులు సంపాదించినట్టు సమాచారం. స్వాతి హత్య జరిగి వారం రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో నిందితుడి స్పష్టమైన ఫొటోను విడుదల చేయడం ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామంగా పోలీసులు భావిస్తున్నారు. -
స్వాతిని అలా చూస్తూ ఉండిపోయారు కానీ..
చైన్నై: తను నిస్సహాయంగా నెత్తుటిమడుగులో కూలిపోయింది. రెండుగంటలపాటు సాయం కోసం అర్థించింది. కానీ, అందరూ చూస్తూ ఉండిపోయారు. ఒక్కరూ కూడా ధైర్యం చేయలేదు. తనకు సాయం చేసేందుకు ముందుకురాలేదు. ఇది చెన్నై నుంగంబాకం రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే దారుణంగా హత్యకు గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగిని స్వాతి ఉదంతమిది. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న ఆమెను గత శుక్రవారం ఓ దుండగుడు దారుణంగా నరికి చంపిన సంగతి తెలిసిందే. ప్రేమ పేరిట వేధించిన వెంటాడిన దుర్మార్గుడే ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైన నేపథ్యంలో స్వాతి తండ్రి సంతాన గోపాలకృష్ణన్ మంగళవారం మీడియాతో తన ఆవేదన పంచుకున్నాడు. ‘రైల్వే స్టేషన్లో రెండుగంటలపాటు నా కూతురు నెత్తురు మడుగులో పడి ఉన్నా.. చుట్టూ ఉన్న ప్రయాణికులు చూస్తూ ఉండిపోయారు.. ఒక్కరు కూడా సాయం చేసేందుకు ముందుకురాలేదు. పోలీసులు కూడా సంఘటన స్థలానికి ఆలస్యంగా వచ్చారు. ఇది నన్ను దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలో మహిళల భద్రతపై సందేహాలు రేకెత్తిస్తున్నది’ అని గోపాలకృష్ణన్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కూతురిని ఓ స్టాకర్ (ఆకతాయి) వెంటాడి వేధిస్తున్న విషయమై గత మే 10వతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశామని, ఆకతాయి గతంలో ఓసారి వేధింపులకు పాల్పడితే.. స్వాతి స్థానిక దుకాణదారుల సాయం తీసుకొని అతని బారి నుంచి తప్పించుకొందని తెలిపారు. ఇంతలో ఆ దుర్మార్గుడు తమ బిడ్డను పొట్టనబెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల విచారణకు పూర్తిగా తమ కుటుంబసభ్యలు పూర్తిగా సహకరిస్తున్నారని, త్వరలోనే స్వాతిని హతమార్చిన నేరగాడికి శిక్ష పడుతుందన్న విశ్వాసం తమకు ఉందని చెప్పారు.