
దేశంలో మహిళలపై, యువతులపై అరాచకాలకు అడ్డు లేకుండా పోతోంది. ఏదో ఒక మూల హింసాత్మక ఘటనలు నమోదవుతూనే ఉన్నాయి. కేరళలో మరో షాకింగ్ ఉదంతం చోటు చేసుకుంది. తెలంగాణా రాష్ట్రంలో వరంగల్ రవళి విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరో ప్రేమోన్మాది అఘాయిత్యానికి తెగబడ్డాడు. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధిస్తూ వెంటబడుతున్న ఒక యువకుడు చివరికి ఆ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పటించాడు. 80శాతం గాయాలతో బాధితురాలు ఆసుప్రతిలో మృత్యువుతో పోరాటాడుతోంది. కేరళలోని పాతానంతిట్టలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
తిరువళ్ల పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పెళ్లికి నిరాకరించడం వల్లే ఈ పని చేశానని నిందితుడు కుంబానాడ్ నివాసి, అజిన్ రేజి మాథ్యూ (20)ఒప్పుకున్నాడు. బాధితురాల్ని టాటా మెడికల్ సైన్సెస్‌లో బీఎస్‌సీ చదువుతున్న కవిత విజయ్‌కుమార్ (18)గా గుర్తించారు. రెండు బాటిళ్ల పెట్రోల్‌తో వచ్చిన అజిన్ మొదట అమ్మాయితో గొడవకు దిగాడు. అనంతరం పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అంతేకాదు సంఘటనా స్థలం నుంచి పారిపోతున్న నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కాగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment