ముంబై : సెలబ్రిటీలను ఫాలో అవుతూ వారిని చికాకు పెట్టే అభిమానులు కొందరైతే వెంటపడి వేధించే ప్రబుద్ధుల ఉదంతాలూ వెలుగుచూస్తున్నాయి. తాజాగా ముంబైలో టీవీ దిగ్గజం ఏక్తా కపూర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఏక్తా కపూర్‌ను గత నెలరోజులుగా అనుసరిస్తూ ఆమె ఎక్కడికి వెళితే అక్కడ ప్రత్యక్షం కావడంతో పాటు ఆమెను సమీపించేందుకు ప్రయత్నించిన 32 ఏళ్ల క్యాబ్‌డ్రైవర్‌ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలరోజుల్లో దాదాపు 30 సార్లు నిందితుడు ఏక్తాను ఫాలో అయ్యాడని పోలీసులు చెప్పారు.
క్యాబ్ డ్రైవర్‌ను హర్యానాకు చెందిన సుధీర్ రాజేందర్ సింగ్‌గా గుర్తించారు. కొద్ది రోజుల కిందట ఏక్తా కపూర్ జుహులోని ఓ ఆలయం సందర్శించగా, అక్కడికి చేరుకున్న సింగ్ ఆమెకు దగ్గరగా వచ్చేందుకు ప్రయత్నించగా ఆమె సెక్యూరిటీ గార్డులు అడ్డుకుని హెచ్చరించి పంపారని పోలీసులు చెప్పారు. ఏక్తా కపూర్ కదలికలను పసిగట్టిన సింగ్ అంథేరి వెస్ట్‌లో తరచూ ఆమె వెళ్లే జిమ్‌లోనే నిందితుడు సభ్యత్వం తీసుకోవడం పోలీసులను షాక్‌కు గురిచేసింది. ఈనెల 16న ఏక్తా జిమ్‌కు వెళ్లగా అక్కడ నిందితుడిని చూసిన ఆమె సెక్యూరిటీ గార్డులు అతడిని అడ్డుకున్నారు. ఏక్తా ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment