శాన్‌ఫ్రాన్సిస్కో: టెక్ దిగ్గజం ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌పై భారతీయ సంతతికి చెందిన ఒక వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. పాలో ఆల్టోలోని కుక్ అధికారిక నివాసంలోకి రెండు సార్లు అక్రమంగా చొరబడి అనుచితంగా ప్రవర్తించడంతో పాటు, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై ఆపిల్ ఫిర్యాదు చేయడంతో కాలిఫోర్నియా కోర్టు అతనిపై తాత్కాలిక నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. సిలికాన్ వ్యాలీలోని కుక్ నివాసం, ఆయన సెక్యూరిటీ గార్డులు ముగ్గురు, ఆపిల్ పార్క్ ప్రధాన కార్యాలయానికిదూరంగా ఉండాలని కూడా ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 3వ తేదీ దాకా ఈ ఉత్తర్వులు అమల్లో వుంటాయని కోర్టు తెలిపింది.
ఆపిల్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ విలియం బర్న్స్ ప్రకారం శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన రాకేశ్ శర‍్మ అలియాస్ "రాకీ" (41) రెండుసార్లు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడ్డాడు. 25 సెప్టెంబర్ 2019న వాయిస్ మెయిల్‌తో శర్మ వేధింపులు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 4 న షాంపైన్ బాటిల్, పువ్వులు తీసుకొని అనుమతిలేకుండా నేరుగా కుక్ ఇంటికి వచ్చాడు. ఒక వారం తరువాత మరో అవాంఛనీయ కాల్ చేసిన బెదిరింపులకు పాల్పడ్డాడు. కొంతకాలం తర్వాత, శర్మ తన ట్విటర్ ఖాతాలో ఆపిల్ ఎగ్జిక్యూటివ్‌ను ట్యాగ్ చేస్తూ కొన్నిఅభ్యంతరకరమైన వ్యాఖ్యలు, ఫోటోలు షేర్ చేశాడు. అలాగే జనవరి 15 న మరోసారి ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుండగా భద్రతాసిబ్బంది అడ్డుకున్నారు. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడ వద్దని హెచ్చరిస్తూ ఆపిల్ న్యాయవాదులు రాకీకి ఒక లేఖ పంపారు. అయినా ఏ మాత్రం బెదరని రాకీ ఈసారి ఆపిల్ టెక్నికల్ టీంకు కాల్ చేశాడు. కంపెనీ తనను చంపడానికి చూస్తోందని ఆరోపించాడు. మళ్లీ ఒక నెల తరువాత తిరిగి వచ్చిన అతగాడు ఏకంగా టిమ్ కుక్ నివాసంలోని గేటులోకి ప్రవేశించి డోర్ బెల్ మోగించాడని కంపెనీ తన ఫైలింగ్‌లో పేర్కొంది. మరోవైపు కుక్ నివాసం వద్ద పదపదే నిబంధనలను ఉల్లంఘించడం, తుపాకీ గురించి మాట్లాటడం చేశాడని, శారీరకంగా తనకు హాని చేస్తాడని గట్టిగా నమ్ముతున్నానని కుక్ సెక్యూరిటీ బృందంలోని ఒక సభ్యుడు ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment