ఘజియాబాద్: పోలీసింగ్‌లో మహిళా కానిస్టేబుళ్లకూ మరింత ప్రాధాన్యం కల్పించేందుకు జిల్లా ఉన్నతాధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అన్ని రకాల నేరాలను దర్యాప్తు చేసేలా వారిని తీర్చిదిద్దేందుకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. హత్యలు, దోపిడీలు, దాడులు, నేరస్థలాల పరిశీలనలో వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారా దర్యాప్తు నైపుణ్యాలను పెంచుతామని ఘజియాబాద్ తొలి ఎసెస్పీ సచ్చీ ఘిల్డియాల్ ఆదివారం అన్నారు. ‘మహిళా పోలీసులు కూడా పురుషుల్లానే పని చేయాలని మేం కోరుకుంటున్నాం. వారిని కూడా నేరం జరిగిన ప్రదేశాలకు పంపిస్తాం. దాడుల నిర్వహణలోనూ భాగస్వామ్యం కల్పిస్తాం. దర్యాప్తులో నైపుణ్యం సాధించడానికి మహిళా పోలీసులను పురుష సహోద్యోగులతోపాటు ఘటనాస్థలాలకు పంపిస్తాం’ అని 2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఘిల్డియాల్ అన్నారు.
ఘజియాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 427 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. వీరిని కార్యాలయాలు, ట్రాఫిక్ విభాగాల్లో నియమించారు. హత్యలు, దోపిడీలు, దాడుల వంటి కేసుల దర్యాప్తునకు అనుమతించడం లేదు. ఈ 427 మందిలో 13 మంది ఎస్‌ఐలు, ఇద్దరు హెడ్-కానిస్టేబుళ్లు, 312 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ‘నేరస్తులు ఉన్న ప్రాంతాల్లో దాడులు నిర్వహించినప్పుడు మహిళా పోలీసులను అక్కడికి తీసుకెళ్లడం లేదు. ఇక నుంచి వాళ్లు కూడా దాడులు నిర్వహిస్తారు’ అని ఎసెస్పీ ఈ సందర్భంగా వివరించారు. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్ జిల్లాలో పనిచేసినప్పుడు స్థానిక బందిపోటు దొంగలు పలువురిని అరెస్టు చేయడంతో ఆమెకు సాహస పురస్కారం కూడా దక్కింది.
అయితే ఎన్నికల సంఘం ఘజియాబాద్ ఎసెస్పీ ధర్మేంద్ర సింగ్‌ను బదిలీ చేయడంతో ఘిల్డియాల్ ఇక్కడికి వచ్చారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన చోట్లకు మహిళా పోలీసులను పంపించి దర్యాప్తు చేయిస్తామని ఈమె చెప్పారు. ‘కొందరు మహిళలను పీసీఆర్ వ్యాన్లలో నియమించినా నేరస్తులను వెంబడించడం వంటి సమయాల్లో వారిని రానివ్వడం లేదు. ఇలాంటి పనుల్లోనూ మహిళా పోలీసులను నియమిస్తామంటూ ఎసెస్పీ ఘిల్డియాల్ చేసిన ప్రకటన హర్షణీయం. ఆమె మహిళలను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు’ అని నోయిడాలోని సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగి కవిత అన్నారు.
మహిళా పోలీసులకు శిక్షణ
Published Sun, Apr 27 2014 10:40 PM | Last Updated on Sat, Sep 2 2017 6:36 AM
Advertisement
Advertisement