పాక్ ఉగ్రవాదులు గత కొద్దిరోజులుగా భారత సరిహద్దుల్లోకి చొరబడుతున్నారని ఇటీవల జరిగిన ఉగ్రదాడులు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా కథువాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. మరోవైపు ఉగ్రవాదులకు పాకిస్తాన్ నుంచి అందుతున్న నిధులకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం వెల్లడయ్యింది. సరిహద్దుల్లో పాకిస్తాన్ నడుపుతున్న ఉగ్రవాద శిబిరాల జాబితా కూడా దీనిలో ఉంది.
మీడియాకు అందిన సమాచారం ప్రకారం పాకిస్తాన్ తమ దేశంలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, మాజీ ఎస్‌ఎస్‌జీలు, కొందరు సైనికులతో కూడిన ఒక్కో గ్రూపునకు లక్ష రూపాయలు ఇచ్చి భారతదేశానికి పంపుతోందని తెలుస్తోంది. అలాగే పాక్ ఈ ఉగ్రవాదులకు ఎం4 లాంటి ఖరీదైన ఆయుధాలు, బుల్లెట్లను అందిస్తోంది. చొరబాటు సమయంలో ఉగ్రవాదులకు సహాయం అందించే గైడ్‌లకు కూడా రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు అందజేస్తోందని తెలుస్తోంది. అలాగే స్మార్ట్ ఫోన్లు, రేడియో సెట్లను ఉగ్రవాదులు విరివిగా వినియోగిస్తున్నారని సమాచారం.
ఇదిలా ఉండగా తాజాగా భారత సైన్యం సరిహద్దుల్లోని కంచెలు, సొరంగాల తనిఖీని ముమ్మరం చేసింది. భారతదేశంలోకి చొరబడిన ఉగ్రవాదులు ఆహారం కోసం ఐదారు వేల రూపాయలు ఖర్చు చేస్తారని తెలుస్తోంది. పాక్ ఆర్మీ సహాయంతో ఈ ఉగ్రవాదులు శిక్షణ పొందుతున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తన ఉగ్రవాద శిబిరాలను తిరిగి యాక్టివేట్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇటువంటి శిబిరాలు సరిహద్దుల్లోని నికియాల్, జాంద్రుత్, ఖురేటా కోట్లి, సమానీ, అబ్దుల్ బిన్ మసూద్, సమన్, కోట్‌కోటేరాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment