కాశ్మీర్ మొత్తాన్నీ లాక్కుంటాం
పాక్ నేత బిలావల్ భుట్టో రెచ్చగొట్టే వ్యాఖ్యలు
తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగమేనన్న బీజేపీ
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని బేనజీర్ భుట్టో కుమారుడు, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ (25) కాశ్మీర్ అంశాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకునేలా కవ్వింపు చర్యలకు దిగారు. పాక్ భావి నేతగా కితాబులందుకుంటున్న ఆయన భారత్ నుంచి కాశ్మీర్ మొత్తాన్నీ తమ పార్టీ స్వాధీనం చేసుకుంటుందంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ముల్తాన్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో బిలావల్ మాట్లాడుతూ ‘‘కాశ్మీర్ మొత్తాన్నీ నేను వెనక్కు తీసుకుంటా. ఒక్క అంగుళాన్ని కూడా వదిలిపెట్టను. ఎందుకంటే...ఇతర రాష్ట్రాల్లాగానే కాశ్మీర్ కూడా పాకిస్థాన్‌దే’’ అని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో దేశ మాజీ ప్రధానులు గిలానీ, అష్రాఫ్‌లు బిలావల్ పక్కనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. బిలావల్ తల్లి బేనజీర్ రెండుసార్లు పాక్ ప్రధానిగా పనిచేయగా, ఆయన తాత జుల్ఫీకర్ సైతం 1970లలో ప్రధానిగా పనిచేశారు.
సరిహద్దులపై రాజీపడం: భారత్
న్యూఢిల్లీ: బిలావల్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భారత్...సరిహద్దుల విషయంలో పాక్‌తో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. పొరుగుదేశంతో సత్సంబంధాలు కోరుకుంటున్నామంటే దాని అర్థం సరిహద్దులపై రాజీపడటం కాదని విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ అన్నారు. భారతసరిహద్దులను మార్చేది లేదన్నారు. పాక్‌తో స్నేహం కోసం దేశసార్వభౌమత్వాన్ని, సమగ్రతను పణంగా పెట్టేదిలేదన్నారు. బిలాల్ వ్యాఖ్యలను సత్యదూరమైనవిగా అభివర్ణించారు. మరోవైపు బిలావల్ వ్యాఖ్యలను అపరిపక్వమైనవిగా, చిన్నపిల్లాడి మాటలుగా బీజేపీ అభివర్ణించింది. కాశ్మీర్ ఎప్పటికీ భారత అంతర్భాగంగానే కొనసాగుతుందని పేర్కొది. కాగా, బిలావల్ వ్యాఖ్యలను ఎద్దేవా చేస్తూ భారత నెటిజన్లు ట్విట్టర్‌లో జోకులు పేల్చారు. యావత్ కాశ్మీర్‌ను బిలావల్ తీసుకున్నా అందులోనూ తండ్రికి 10 శాతం వాటా ఇవ్వాలని ఒకరు చురకలంటించారు.