సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్, ఒవైసీ తదితరులతో... రాహుల్ కుమ్మక్కయ్యారని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. రాహుల్ పూర్తిగా బాబర్ భక్తుడని, ఖిల్జీ వారసుడని వ్యాఖ్యానించారు. బాబర్ రామాలయాన్ని ధ్వంసం చేస్తే ఖిల్జీ సోమ్‌నాధ్ దేవాలయాన్ని ఛిద్రం చేశారని, నెహ్రూ వారసులు దేశంపై దండెత్తిన ఇస్లాం పాలకులకు వత్తాసు పలుకుతున్నారని ధ్వజమెత్తారు.
అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టులో సున్నీ వక్ఫ్ బోర్డు తరపున వాదనలు వినిపిస్తున్న కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ కేసులో కోర్టు నిర్ణయం తీవ్ర ప్రభావం చూపే కారణంగా నిర్ణయాన్ని సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జులై 2019 వరకూ వాయిదా వేయాలని సర్వోన్నత న్యాయస్ధానాన్ని కోరిన నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతల పరస్పర ఆరోపణలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
Comments
Please login to add a commentAdd a comment