రాజ్యసభ ఎన్నికల్లో కమలం హవా | BJP dominant in the Rajya Sabha elections | Sakshi
Sakshi News home page

రాజ్యసభ ఎన్నికల్లో కమలం హవా

Published Sun, Jun 12 2016 12:35 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

రాజ్యసభ ఎన్నికల్లో కమలం హవా - Sakshi

రాజ్యసభ ఎన్నికల్లో కమలం హవా

27 స్థానాల్లో బీజేపీకి 11, కాంగ్రెస్‌కు 6
- ఎస్పీ ఖాతాలో ఏడు.. రెండు సీట్లు బీఎస్పీ కైవశం
- రాజస్తాన్ నుంచి వెంకయ్య, కర్ణాటక నుంచి నిర్మల విజయం
- యూపీ, కర్ణాటక, హరియాణాల్లో క్రాస్ ఓటింగ్
- హరియాణాలో అనూహ్యంగా ‘జీ’ చైర్మన్ విజయం
 
 న్యూఢిల్లీ: రాజ్యసభలో 27 స్థానాలకు శనివారం జరిగిన ఎన్నికల్లో అధికార బీజేపీ 11 సీట్లు గెలుచుకుని పైచేయి సాధించింది. కాంగ్రెస్ 6 స్థానాలు గెలుచుకుంది. యూపీలో సమాజ్‌వాద్ పార్టీ ఏడు సీట్లు దక్కించుకుంది.   కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు రాజస్తాన్ నుంచి, నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి గెలిచారు. ఎన్నికలు జరిగిన 7 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీలే విజయం సాధించాయి. రాజస్తాన్, జార్ఖండ్, హరియాణాల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కర్ణాటక లో క్రాస్ ఓటింగ్ జేడీఎస్ కొంపముంచగా.. హరియాణాలో కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లకపోవడం బీజేపీ మద్దతుతో బరిలో దిగిన ‘జీ’ గ్రూపు చైర్మన్ సుభాష్ చంద్రకు అనూహ్య విజయాన్నందించింది. జార్ఖండ్‌లో చివరి నిమిషంలో నాటకీయ పరిణామాల మధ్య ఓ జేఎంఎం ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయటంతో ఓటింగ్ బీజేపీకి కలిసొచ్చింది. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఒక్కసీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

 మధ్యప్రదేశ్‌లో బీజేపీ 2, కాంగ్రెస్ 1
 మధ్యప్రదేశ్‌లో 3 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండింటిని, కాంగ్రెస్ ఒక స్థానాన్ని గెలుచుకున్నాయి. బీజేపీ నుంచి.. జర్నలిస్టు, బీజేపీ అధికార ప్రతినిధి ఎంజే అక్బర్, మరో సీనియర్ నేత అనిల్ దవేలు గెలుపొందగా.. సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది వివేక్ తంఖా కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. బీజేపీ మూడో అభ్యర్థి వినోద్ గోతియా ఓడిపోయారు. బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు తెలిపారు.

 యూపీలో ఎస్పీ మ్యాజిక్.. యూపీలో ఆరుగురికి అవకాశమున్న అధికార సమాజ్‌వాద్ పార్టీ ఏడో అభ్యర్థిని అదనంగా బరిలోనిలిపి అందర్నీ గెలిపించుకుంది. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా మొత్తం 11సీట్లలో ఎస్పీ 7, బీఎస్పీ 2, బీజేపీ, కాంగ్రెస్ చెరో సీటు గెల్చుకున్నాయి. కాంగ్రెస్‌కు కావాల్సినంత మంది అభ్యర్థుల మద్దతు లేకున్నా ఆరెల్డీ, ఇండిపెండెంట్ల మద్దతుతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ గట్టెక్కారు. ఎస్పీ నుంచి గెలిచిన వారిలో ఇటీవలే  పార్టీలో మళ్లీ చేరిన అమర్‌సింగ్, బేణీప్రసాద్ వర్మ ఉన్నారు.

 జేడీఎస్‌కు క్రాస్ ఓటింగ్ దెబ్బ
 కర్ణాటకలో భారీ క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ మూడో అభ్యర్థిని గెలిపించింది. బీజేపీ తరపున కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ గెలుపొందగా, కాంగ్రెస్ నుంచి జైరాం రమేశ్, ఆస్కార్ ఫెర్నాండజ్, మాజీ ఐపీఎస్ అధికారి కేసీ రామ్మూర్తి గెలిచారు. 8 మంది జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటేశారు. బీజేపీకి ఇద్దరు స్వతంత్రులు మద్దతు తెలిపారు.

 ఎడారిలో కమలం హవా.. రాజస్తాన్‌లో బీజేపీ ఉన్న 4 సీట్లను అలవోకగా గెలుచుకుంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ ఉపాధ్యక్షుడు ఏపీ మాధుర్ గెలుపొందిన వారిలో ఉన్నారు. తనను గెలిపించిన ఎమ్మెల్యేలకు, ప్రతిపాదించిన అధిష్టానానికి వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు.  

 ఛత్రపతి వంశస్తుడు నామినేషన్..
 శివాజీ వంశస్తుడైన ప్రముఖ శంభాజీ రాజే ఛత్రపతి రాజ్యసభకు కేంద్రం నామినేట్ చేసిం ది. గత నెల రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించిన గాయత్రీపరివార్ నేత ప్రణవ్‌పాండ్యా స్థానంలో శంభాజీ నామినేట్ అయ్యారు.
 
 సుభాష్ చంద్ర అదృష్టం
 హరియాణాలో 14 మంది కాంగ్రెస్ సభ్యుల ఓట్లు చెల్లకపోవటం.. బీజేపీ మద్దతుతో బరిలో దిగిన జీ గ్రూపు చైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్రకు కలిసొచ్చింది. కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ మరోసారి ఎన్నికయ్యారు. సుభాష్ చంద్రకు కేవలం 15 మంది మద్దతు మాత్రమే ఉండటంతో.. ఐఎన్‌ఎల్‌డీ-కాంగ్రెస్ అభ్యర్థి ఆర్కే ఆనంద్ గెలుపు ఖాయమనే భావించారు. అయితే..  సాంకేతిక కారణాలతో 14 కాంగ్రెస్ ఓట్లు తిరస్కరణకు గురవటంతో.. మ్యాజిక్ ఫిగర్ 34 నుంచి 26కు చేరింది. బీజేపీ మొదటి ప్రాధాన్య ఓట్లను సుభాష్ చంద్రతో పంచుకుంది.

 పెన్నే కొంపముంచింది!.. హరియాణాలో 14 మంది కాంగ్రెస్ సభ్యుల అనర్హతకు పెన్ను కారణమైంది. ఎన్నికల్లో ఓట్ల ప్రాధామ్యాన్ని వెల్లడించేందుకు రిటర్నింగ్ అధికారిచ్చిన పెన్ను కాకుండా తమ వ్యక్తిగత పెన్నును కాంగ్రెస్ సభ్యులు ఉపయోగించారు. దీంతో సాంకేతికంగా వీరి ఓట్లు చెల్లవని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. ఇదే సుభాష్ చంద్రకు కలిసొచ్చింది.
 
 జేఎంఎం ఎమ్మెల్యే అరెస్టుతో గట్టెక్కిన బీజేపీ

 జార్ఖండ్‌లోని 2 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ, మహేశ్ పొద్దార్ గెలుపొందారు. ఎన్నికకు  ముందు జేఎంఎం ఎమ్మెల్యే చమ్రా లిండాను 2013 నాటి కేసులో పోలీసులు అరెస్టు చేయటంతో ఆయన ఓటేయలేదు. నక్వీకి దక్కిన మొదటి ప్రాధాన్యత ఓట్ల పంపిణీతో పొద్దార్ గట్టెక్కారు. జేఎంఎం అభ్యర్థి బసంత్‌సొరేన్ స్వల్పతేడాతో ఓడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement