సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ఢిల్లీలో ప్రారంభం కానున్నాయి. రెండు రోజులపాటుసాగే ఈ సమావేశాల్లో ప్రధాని మోదీ తమ ప్రభుత్వ ఆర్థిక, రాజకీయ భవిష్యత్తు ఎజెండాను ప్రకటించే వీలుంది. ఇవి విస్తృత కార్యవర్గ సమావేశాలనీ, పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, పలు రాష్ట్రాల అధ్యక్షులు, పదాధికారులు, 337 మంది ఎంపీలు, 1,400 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా 2,000 మందికి పైగా నాయకులు పాల్గొంటారని బీజేపీ శ్రేణులు చెప్పాయి. చివరిరోజైన సోమవారం మోదీ ప్రసంగిస్తారు. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2 శాతం పడిపోవడంతో ప్రతిపక్షాలు మోదీని తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ, జీఎస్టీ, రోహింగ్యాలు తదితర అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉంది.