ఢిల్లీ సీఎం కుర్చీపై బీజేపీ గురి
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. ఢిల్లీ సీఎం పీఠంపై కన్నేసింది. అధికారం చేజిక్కించుకునే దిశగా పావులు కదుపుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తామని ఢిల్లీ బీజేపీ శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లేనందున బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల్లో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా కాంగ్రెస్ సభ్యుల మద్దతు అవసరం. అయితే బీజేపీ, ఆప్లలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా విడిపోయారు. కాంగ్రెస్లో విభేదాలను బీజేపీ నిశితంగా గమనిస్తోంది.
70 ఎమ్మెల్యేలు గల ఢిల్లీ శాసనసభలో బీజేపీకి 31 మంది, ఆప్కు 28 మంది సభ్యుల బలం ఉంది. కాంగ్రెస్కు కేవలం ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అకాలీదళ్ నుంచి ఒకరు, మరో ఇద్దరు స్వతంత్రులు గెలిచారు. కాంగ్రెస్ మద్దతుతో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. అయితే జన్ లోక్పాల్ బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వనందుకు నిరసనగా కేజ్రీవాల్ రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీ శాసనసభను రద్దు చేయకుండా రాష్ట్రపతి పాలన విధించారు.
ఆ తర్వాత రాజకీయ పరిణామాలు మారాయి. ఆప్పై మోజు తీరిపోవడం, కాంగ్రెస్ చతికిలపడటం, దేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ఘనవిజయం సాధించడం.. ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కాగా బీజేపీ శాసనసభ్యుల్లో ముగ్గురు పార్లమెంట్కు ఎన్నికవడంతో సభలో ఆ పార్టీ బలం ప్రస్తుతం 28కి తగ్గింది. ఆప్ నుంచి ఒక ఎమ్మెల్యేను బహిష్కరించారు. అకాలీదళ్ మద్దతు బీజేపీకి ఉంది. అయినా ప్రస్తుతం 67 మంది ఎమ్మెల్యేలు గల ఢిల్లీ శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీకి కనీసం మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు మద్దతు ఇస్తారని బీజేపీ వర్గాలు ఆశిస్తున్నాయి. మరోవైపు ఆప్కు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సుముఖంగా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. సీఎం పదవికి రాజీనామా చేసి తప్పు చేశానని భావిస్తున్న కేజ్రీవాల్ కాంగ్రెస్ మరోసారి మద్దుతు ఇస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ రాజకీయాలు ఎలా ఉండబోతాయన్నది ఆసక్తిగా మారింది.