
బీజేపీకే ఎక్కువ కష్టాలు
బ్రిటిష్ పాలనలో కాంగ్రెస్ కూడా ఇన్ని ఎదుర్కోలేదు
* అన్ని పార్టీల కంటే ఎక్కువ త్యాగాలు చేసింది మా పార్టీనే
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలు
* బీజేపీ నూతన ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన
న్యూఢిల్లీ: బ్రిటిష్ వారి పాలనలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ప్రతికూలతలకంటే స్వతంత్ర భారతదేశంలో బీజేపీ ఎక్కువ కష్టాలను ఎదుర్కొందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల కంటే ఎక్కువ త్యాగాలు చేసినదిబీజేపీనే అన్నారు. అయితే బీజేపీ మంచి ప్రయత్నాలన్నింటినీ చెడు దృష్టితో చూస్తున్నారని పేర్కొన్నారు. గురువారం ఢిల్లీలో బీజేపీ నూతన ప్రధాన కార్యాలయానికి మోదీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్ నేతలు అద్వానీ, రాజ్‌నాథ్ తదితరులు పాల్గొన్నారు.
అందరినీ కలుపుకుని ‘సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్’ నినాదాన్ని సార్థకం చేసేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ చెప్పారు. ‘‘పుట్టినప్పటి నుంచి కష్టాలను ఎదుర్కొన్న ఏకైక పార్టీ బీజేపీ. ప్రతి మలుపులోనూ అది ప్రతికూలతలు ఎదుర్కొంది.’’ అని మోదీ పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ అభ్యర్థులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, కోల్‌కతాలో పార్టీ కార్యాలయం ఏర్పాటుకు జాగా దొరకలేదని, ఎందుకంటే ఎవరైనా తమకు చోటిస్తే వారు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికార టీఎంసీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ మాతృసంస్థ జన్‌సంఘ్ 1969లో మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చే వరకూ దాన్ని అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు పట్టించుకోలేదని, వాజ్‌పేయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పటికీ మనం ఎంత ఎదిగామో చూసి వారంతా ఆశ్చర్యపోయారన్నారు.
వారంతా ప్రజల ద్వారా మన గురించి తెలుసుకోవాలని భావించారని, కానీ ఎప్పుడూ మనల్ని సరిగా అంచనా వేయలేకపోయారని చెప్పారు. పార్టీ కొంత మంది నాయకులు, ప్రధాని, సీఎంలపై ఆధారపడి అభివృద్ధి చెందలేదని, లక్షలాది మంది కార్యకర్తలతోనే ఇది సాధ్యపడిందన్నారు. బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి దేశంకోసం, ప్రజాస్వామ్యం కోసం ఎలా పనిచేస్తుందో ప్రపంచానికి తెలియజెప్పాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అమిత్‌షా మాట్లాడుతూ.. పార్టీ ఇప్పుడు ఉచ్ఛస్థితిలో ఉందని, ప్రజల మద్దతును నిలబెట్టుకునేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడని కొనియాడారు.
రెండెకరాలు.. ఆరు అంతస్తులు
రెండెకరాల్లో పార్టీ సంసృతిని, జాతీయవాదాన్ని ప్రతిబింబించేలా ఆరు అంతస్తుల్లో బీజేపీ నూతన కార్యాలయానికి రూపకల్పన చేశారు. జిల్లా, బ్లాక్ స్థాయి కార్యకర్తలతో అనుసంధానమయ్యేలా కమ్యూనికేషన్ వ్యవస్థ, కాన్ఫరెన్స్ సదుపాయాలు కల్పించనున్నారు. ఈ కార్యాలయంలో 2 వేల నుంచి 3 వేల మంది కార్యకర్తలతో సమావేశం కావొచ్చు. కాగా, గురువారం రెండున్నర గంటల పాటు ప్రత్యేక యజ్ఞం నిర్వహించారు. 2018 డిసెంబర్ నాటికి ఈ కార్యాలయం అందుబాటులోకి వస్తుందని పార్టీ అంచనా.