వారి కూతుళ్లపై రేప్‌లు జరిగితే తెలిసొస్తుంది
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో గత కొన్ని నెలలుగా చిన్నారులపై అత్యాచార ఘటనలు పెరుగుతుండటంపై ప్రభుత్వాన్ని నిలదీసే క్రమంలో ప్రతిపక్ష బీజేపీ నేత కె.ఎస్. ఈశ్వరప్ప శుక్రవారం నోరుజారారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి కె.జె. జార్జ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. సీఎం, హోంమంత్రుల కుమార్తెలపై ఒకవేళ అత్యాచారం జరిగితే అప్పుడు ఆ బాధ ఏమిటో వారికి తెలుస్తుందంటూ వ్యాఖ్యానించి రాజకీయ దుమారం రేపారు. ‘‘రేప్‌లపై ఓవైపు రాష్ట్రం అట్టుడుకుతుంటే ఒకరేమో (హోంమంత్రి) టీఆర్‌పీ రేటింగ్‌లకోసమే మీడియా హడావిడి చేస్తోందంటారు. మరొకరేమో (సీఎం) ఆ ప్రకటనను పరిశీలిస్తానంటారు.
ఒకవేళ వాళ్ల కుమార్తెలపై అత్యాచారాలు జరిగితేనే వారికి ఆ తీవ్రత తెలుసొస్తుంది’’ అని ఈశ్వరప్ప విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ సైతం తీవ్రంగా తప్పుబట్టింది. నాగరికులెవరూ ఈశ్వరప్పలా చౌకబారు మాటలు మాట్లాడరని సీఎం సిద్ధరామయ్య దుయ్యబట్టగా తమ పార్టీ నేత అలా మాట్లాడిఉండాల్సింది కాదని, ఇకపై అటువంటి వ్యాఖ్యలు చేయరాదని ఈశ్వరప్పకు సూచిస్తామని బీజేపీ కర్ణాటక విభాగం చీప ప్రహ్లాద్ జోషీ చెప్పారు. తన వ్యాఖ్యలపై దుమా రం రేగడంతో ఈశ్వరప్ప నష్టనివారణ చర్యలకు ప్రయత్నించా రు. మహిళలంటే తనకు గౌరవమని... సీఎం, హోంమంత్రి కూతుళ్లు తనకు చెల్లెళ్ల వంటి వార ని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యల్లో కొన్నింటినే మీడియా చూపుతోందని మండిపడ్డారు. కాగా, సీఎం సిద్ధరామయ్యకు ఇద్దరు కొడుకులు తప్ప కూతుళ్లు లేకపోవడం కొసమెరుపు.