
భార్యాపిల్లలను చంపి బీజేపీ నేత ఆత్మహత్య
భోపాల్: మధ్యప్రదేశ్ లో బీజేపీ నేత ఒకరు భార్యాపిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. కట్ని జిల్లాలోని బొహ్రిబంద్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ దారుణం చోటుచేసుకుంది. పెట్రోల్ పంపు నిర్వహిస్తున్న శశాంక్ తివారి(38) ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇంట్లో రక్తపు మడుగులో పడివున్న శశాంక్ కుటుంబ సభ్యులను చూసి పోలీసులకు పనిమనిషి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగుచూసింది.
శశాంక్ భార్య మిని తివారి(30), కుమార్తె మాని(12), కొడుకు అభి(8) మృతదేహాలపై బుల్లెట్టు గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. రెండు పెంపుడు కుక్కలు కూడా చనిపోయి ఉండడాన్ని పోలీసులు కనుగొన్నారు. కుంగుబాటు, ఆర్థిక సమస్యలతో శశాంక్ తివారి ఈ కిరాతకానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడి పెట్రోల్ బంకును స్థానిక అధికారులు ఇటీవల మూసివేయడంతో ఆర్థిక సమస్యల్లో చిక్కున్నట్టు వెల్లడించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.