పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)
అగర్తల : ఇస్లామాబాద్‌లో సైన్యం, ఐఎస్‌ఐ ఉగ్రవాదులు పాలన కొనసాగిస్తున్నారు. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ఓ చప్రాసీ మాత్రమే అంటూ బీజేపీ వివాదాస్పద ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక పాకిస్తాన్‌ను నాలుగు భాగాలుగా విభజించాలని పేర్కొన్నారు. పాకిస్తాన్ సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సాహిస్తూ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ ఐక్య రాజ్య సమితి వేదికగా ప్రకటించిన నేపథ్యంలో సుబ్రహ్మణ్య స్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘పాకిస్తాన్‌లో సైన్యం, ఉగ్రవాదం అధికారమేలుతున్నాయి. ఇప్పుడక్కడ ఇమ్రాన్ ఖాన్ కేవలం ఓ చప్రాసీ మాత్రమే. మన దేశం ఎంత శాంతియుతంగా ఉంటున్న పాక్ మాత్రం దూకుడుగానే వ్యవహరిస్తోంది. ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక్కటే మార్గం. పాకిస్తాన్‌ను బలూచ్, సింధ్, పష్తున్‌లతో పాటు పశ్చిమ పంజాబ్ అనే నాలుగు భాగాలుగా విభజించాలి. అప్పుడైతేనే ఈ సమస్యలు సమసిపోతాయి’ అన్నారు.
అంతేకాక ‘అంతర్జాతీయ వేదికల మీద మన దేశం, పాకిస్తాన్ తప్పులను ఎత్తిచూపినప్పుడల్లా ఆ దేశం ఒత్తిడికి గురై ఏవేవో ఆరోపణలు చేస్తుంది. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక పాకిస్తాన్ గురించి మర్చిపోండి. మన ఆర్మీని సిద్ధం చేయండి. కేవలం ఒక్క రోజులో పాక్ నాలుగు భాగాలుగా విడిపోతుంది’ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన బంగ్లాదేశ్ గురించి కూడా ప్రస్తావించారు. ‘మన దేశం అన్ని రకాలుగా బంగ్లాదేశ్‌కు సాయం చేస్తోంది. కానీ బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. అందుకే ఆమె హిందూవులను వేధిస్తూ, దేవాలయాలను నాశనం చేస్తూన్న పిచ్చి వారిని ఆపడంలేదు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే బంగ్లాదేశ్‌పై తగు చర్యలు తీసుకోవాలిని నేను మన ప్రభుత్వానికి సిఫారసు చేస్తాన’ని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment