ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బోరివలి నుంచి పోటీచేస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ తావ్డేకు ఈసారి విజయం అంత సులభం కాద విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 25 యేళ్ల బీజేపీ-శివసేన కూటమి బీటలు వారడానికి తావ్డే కూడా కారణమని శివసేన భావిస్తున్న నేపథ్యంలో అతడిని ఎలాగైనా ఓడించాలని ఆ పార్టీ తన కార్యకర్తలను ఆదేశించడం గమనార్హం.
కాగా బోరివలి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మరాఠీ, గుజరాతీ బ్రాహ్మణులతోపాటు నరేంద్ర మోదీ హవా కూడా తనను గట్టెక్కిస్తుందని తావ్డే భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ తరఫున ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్న వినోద్ తావ్డే తాను నివాసముంటున్న బోరివలి స్థానాన్నే కోరుకోవడానికి కారణం ఆ నియోజకవర్గం మొదటి నుంచి బీజేపీకి కంచుకోటగా నిలుస్తోంది. పాతికేళ్ల బీజేపీ-శివసేన కూటమి లో బీజేపీ కోటాలో ఈ స్థానం కొనసాగు తూ వస్తోంది. ఇక్కడ మరాఠా, గుజరాత్‌లకు చెందిన మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివశిస్తున్నారు.
ఒకవేళ బీజేపీ- శివసేన కూటమి కొనసాగి ఉంటే.. వినోద్ తావ్డే తన గెలుపుకోసం అంత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని శివసేన సీనియర్ లీడర్ వినోద్ ఘోసాల్కర్ అభిప్రాయపడ్డారు. ‘మహాకూటమి ఉండి ఉంటే తావ్డే అసెంబ్లీ లో అడుగుపెట్టడం అంత కష్టం కాకపోయేది.. ఇప్పుడు మాత్రం విజయం కోసం చెమటోడ్చాల్సిం దే.. ఎందుకంటే ఇక్కడ సేన స్థానిక వ్యక్తికి టికెట్ ఇచ్చింది..’ అనిచెప్పారు. కాగా, మహా కూటమి విచ్ఛిన్నానికి తానుకూడా కారణమని శివసేన చేస్తున్న విమర్శలను పట్టించుకోవడంలేదని తావ్డే తెలిపారు.
‘లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించిన విధంగానే ఈ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటు వేయమని ప్రజలను మేం కోరుతున్నామ’ని తావ్డే స్పష్టం చేశా రు. ఇదిలా ఉండగా బోరివలి స్థానం నుంచి శివసేన అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. తాను పాతికేళ్లుగా బోరివలిలో ఉం టున్నానని చెప్పాడు. స్థానికులందరికీ తన గురించి తెలుసని, శివసేన సిద్ధాంతాలను వివరించడం ద్వారా విజయం సాధించేందుకు కృషిచేస్తానని తెలి పాడు.తావ్డేను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించబోననిచెప్పాడు. స్థానికంగా అన్ని వర్గాల్లో తనకు పట్టు ఉందని తెలిపాడు.
తన కోసం ప్రచారంచేయడానికి పలు ప్రాంతాలనుంచి సీఏలు వస్తున్నారని చెప్పా డు. కాగా, బీజేపీ అభ్యర్థులను ఓడించడమే తమ ప్రధాన అజెండా అని శివసేన కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ నియోజవ ర్గంలో సంస్థాగతంగా శివసేనకు సరైన నాయకత్వం లేదని, ఉన్నవాళ్లలో చాలామంది ఎమ్మెన్నెస్‌కు వలసపోయారని విశ్లేషకులు అంటున్నారు. కొంకణ్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్న తావ్డేకే బోరివలిలో ఉన్న కొంకణ్ వాసులు మద్దతు పలికే అవకాశముందని వారు పేర్కొంటున్నారు.
‘సేన’తో తావ్డేకు తలనొప్పే..
Published Sun, Oct 5 2014 10:21 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM