vinod tawde
-
ఖర్గే, రాహుల్‌కు రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు
ఢిల్లీ: తనపై నిరాధార ఆరోపణలు చేసినందుకుగాను కాంగ్రెస్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సుప్రియా శ్రీనాట్‌లకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే శుక్రవారం లీగల్ నోటీసులు పంపించారు. క్షమాపణలు చెప్పాలని, లేకుంటే రూ. 100 కోట్ల పరువు నష్టం నోటీసులు ఎదుర్కోవాలంటూ ఆయన హెచ్చరించారు.ముంబైకి 60 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ జిల్లాలోని విరార్‌లోని ఓ హోటల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ నేత రూ.5 కోట్లు పంపిణీ చేశారని బహుజన్ వికాస్ అఘాడీ (బీవీఏ) నాయకుడు హితేంద్ర ఠాకూర్ మంగళవారం ఆరోపించిన క్రమంలో తావ్డే లీగల్ నోటీసు ఇచ్చారు.ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను సుదీర్ఘ రాజకీయ జీవితంలో అలాంటి చర్యలకు ఎన్నడూ పాల్పడలేదు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ నేతలు తన పరువుకు భంగం కలిగించి పార్టీని దెబ్బతీయాలని చూశారన్నారు. కాంగ్రెస్ నేతలు తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాలి. అందుకోసమే ఈ నోటీసులు పంపాను’’ అంటూ తావ్డే మీడియాకు వెల్లడించారు. -
టీడీపీతో పొత్తు.. బీజేపీలో రచ్చ.. ‘వినోద్ ధావడే’ ఉక్కిరిబిక్కిరి
సాక్షి, విజయవాడ: విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో అలజడి రేగింది. టీడీపీతో పొత్తులపై జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడేని కార్యకర్తలు నిలదీశారు. ప్రధాని మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలకు క్షమాపణలు చెప్పకుండా ఎలా పొత్తులు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ప్రధానికి చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందేనన్న కార్యకర్తలు.. పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎలా సీట్లు ఇస్తారంటూ ప్రశ్నలు గుప్పించారు. బీజేపీకోసం పనిచేసే వారికే టిక్కెట్లు ఇవ్వాలన్న కార్యకర్తలు.. బీజేపీకి కేటాయించిన సీట్లలో చంద్రబాబు పెత్తనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తల ప్రశ్నలకు వినోద్ ధావడే ఉక్కిరిబిక్కిరి అయారు. ప్రధాని మోదీ చిలకలూరిపేట సభని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన వినోద్ ధావడే.. రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డాని కలుస్తానని, అధిష్టానం దృష్టికి కార్యకర్తల మనోభావాలను తీసుకెళ్తానన్నారు. కాగా, ఏపీ బీజేపీలో టికెట్ల పంచాయితీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రాష్ట్రంలో పొత్తులపై స్థానిక బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు, పురందేశ్వరి తీరుపై ఫైరవుతున్నారు. ఇదే సమయంలో పలువురు సీనియర్ నేతలు హైకమాండ్‌కు లేఖ రాయడం కలకలం సృష్టించింది. మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం ప్రధాని మోదీ పర్యటన వేళ ఏపీ బీజేపీలో కలకలం రేగుతోంది. బీజేపీ అధ్యక్షుడు నడ్డాకి రాసిన లేఖని సీనియర్లు వ్యూహాత్మకంగా లీక్ చేశారు. ఓడే సీట్లనే బీజేపీకి టీడీపీ కేటాయిస్తోందని సీనియర్లు లేఖలో పేర్కొన్నారు. ఆ సీట్లలో టీడీపీ గతంలో గెలవలేదని లేఖలో ప్రస్తావించారు. టీడీపీ నేతలను బీజేపీలోకి పంపి టిక్కెట్లు వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సీనియర్లు.. బీజేపీ ముసుగులో టీడీపీ నేతలు తెరపైకి వస్తున్నారని ఆరోపిస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారికే టిక్కెట్లు కేటాయించాలంటున్న సీనియర్లు ఏపీలో జరుగుతున్న పరిణామాలపై దృష్టి సారించకపోతే పార్టీకే నష్టమంటున్నారు. ఇదీ చదవండి: ఏపీ బీజేపీలో కొత్త ట్విస్ట్.. చిచ్చుపెట్టిన చంద్రబాబు! -
Lok Sabha elections 2024: వారణాసి నుంచే... మళ్లీ మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: అధికార బీజేపీ లోక్‌సభ సమర శంఖం పూరించింది. విపక్ష ఇండియా కూటమి ఇంకా పొత్తుల ఖరారు ప్రయత్నాల్లో ఉండగానే, ఎన్నికల షెడ్యూలైనా రాకముందే ఏకంగా 195 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది! ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో శనివారం సాయంత్రం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే ఈ మేరకు మీడియాకు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీ చేయనున్నారు. ఈసారి మరింత బంపర్ మెజారిటీతో ఆయన ఘనవిజయం సాధిస్తారని తావ్డే ధీమా వెలిబుచ్చారు. పలు రాష్ట్రాల్లో మరింతగా చొచ్చుకుపోయి ఎన్డీఏ కూటమిని ఇంకా బలోపేతం చేయడమే లక్ష్యంగా జాబితాను రూపొందించినట్టు ఆయన వెల్లడించారు. ఇక గుజరాత్‌లోని గాం«దీనగర్ నుంచి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్, రాజస్థాన్‌లోని కోటా నుంచి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బరిలో దిగుతున్నారు. యూపీలో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో 2019లో ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాం«దీని మట్టికరిపించి సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మరోసారి అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. అప్పట్లో రెండుచోట్ల పోటీ చేసిన రాహుల్ వాయనాడ్ నుంచి నెగ్గారు. తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు చోటు దక్కింది. మన్సుఖ్ మాండవీయ (పోరుబందర్), భూపీందర్ యాదవ్ (ఆళ్వార్), శర్బానంద సోనోవాల్ (దిబ్రూగఢ్), గజేంద్రసింగ్ షెకావత్ (జోధ్‌పూర్), అర్జున్ రామ్ మేఘ్వాల్ (బికనేర్), జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), కిరణ్ రిజిజు (అరుణాచల్ వెస్ట్), రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), అర్జున్ ముండా (కుంతీ), జ్యోతిరాదిత్య సింధియా (గుణ) తదితరులు వీరిలో ఉన్నారు. టికెట్ దక్కిన మంత్రుల్లో ఏడుగురు రాజ్యసభ సభ్యులు కావడం విశేషం. తొలి జాబితాలోనే ఏకంగా మూడో వంతుకు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడం ద్వారా బీజేపీ దూకుడు కనబరచడమే గాక కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీలో నలుగురి మార్పు దేశ రాజధాని ఢిల్లీని ఈసారి బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. అక్కడి ఏడు లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పారీ్టకి ఈసారి కూడా ఏ అవకాశమూ ఇవ్వొద్దని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో భాగంగా ఢిల్లీలో ప్రకటించిన ఐదు స్థానాల్లో ఏకంగా నాలుగింట సిట్టింగులను పక్కన పెట్టడం విశేషం! వారిలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి, కేంద్ర మాజీ మంత్రి హర్షవర్ధన్, పరేశ్ వర్మతో పాటు బీఎస్పీ ఎంపీపై మతపరమైన వ్యాఖ్యలతో పెను వివాదానికి తెర తీసిన రమేశ్ బిధూరి ఉన్నారు. మనోజ్ తివారీ మాత్రమే ఈశాన్య ఢిల్లీ నుంచి మళ్లీ బరిలో దిగుతున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి లేఖి బదులుగా దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బాసురీ పోటీ చేయనుండటం విశేషం. ఇక భోపాల్ నుంచి వివాదాస్పద ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్లకు మొండిచేయి చూపారు. ఆమె స్థానంలో అలోక్ శర్మకు చాన్స్ దక్కింది. మరో కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలీకి కూడా టికెట్ దక్కలేదు. పుష్కలంగా గ్లామర్ సినీ నటులకు తొలి జాబితాలో బాగానే చోటు దక్కింది. భోజ్‌పురి గాయకుడు, నటుడు పవన్ సింగ్ పశి్చమ బెంగాల్‌లోని అసన్సోల్ నుంచి బరిలో దిగుతున్నారు. సిట్టింగులు హేమమాలిని (మథుర), రవికిషన్, మహేశ్‌శర్మ, బఘేల్, సాక్షి మహారాజ్‌కు చాన్స్ దక్కింది. ఇద్దరు మాజీ సీఎంలు బీజేపీ తొలి జాబితాలో ఇద్దరు మాజీ సీఎంలున్నారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ విదిశ స్థానం నుంచి లోక్‌సభ బరిలో దిగుతున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ ఘనవిజయం సాధించినా అధినాయకత్వం ఆయన్ను సీఎంగా కొనసాగించలేదు. ఇక త్రిపుర మాజీ సీఎం బిప్లవ్‌దేవ్ త్రిపుర వెస్ట్ నుంచి బరిలో ఉన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఖేరి నుంచి మళ్లీ అవకాశమివ్వడం విశేషం. ఆయన కుమారుడు ఆశిష్‌పై 2021లో యూపీలోని లఖీంపూర్ ఖేరీలో రైతులపైకి కారు పోనిచ్చి నలుగురిని పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపణలున్నాయి. యూపీ నుంచి 51 మంది బీజేపీకి అత్యంతకీలకమైన ఉత్తరప్రదేశ్‌కు తొలి జాబితాలో అగ్రతాంబూలం దక్కింది. 195లో యూపీ నుంచి 51 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 2019లో యూపీలో 80 సీట్లకు గాను బీజేపీ 62 చోట్ల నెగ్గింది. మధ్యప్రదేశ్‌లో 24, పశి్చమ బెంగాల్లో 20, గుజరాత్, రాజస్తాన్‌ల నుంచి 15 చొప్పున, కేరళ నుంచి 12, అసోం, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ నుంచి 11 చొప్పున, తెలంగాణ నుంచి 9, ఢిల్లీ నుంచి 5, ఉత్తరాఖండ్ నుంచి 3, అరుణాచల్‌ప్రదేశ్, జమ్మూ కశీ్మర్ నుంచి రెండేసి సీట్లతో పాటు గోవా, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవులు, డామన్ డయ్యూ స్థానాలకు కూడా అభ్యర్థుల వెల్లడి జరిగింది. 195 మందిలో 28 మంది మహిళలు, 57 మంది ఓబీసీలు, 27 మంది ఎస్సీలు, 18 మంది ఎస్టీలకు స్థానం లభించింది. 47 స్థానాల్లో 50 ఏళ్ల లోపువారికి అవకాశం కల్పించారు. సుదీర్ఘ చర్చల తర్వాతే... తొలి జాబితా రూపకల్పన కోసం బీజేపీ భారీ కసరత్తే చేసింది. ప్రకటనకు ముందు గురువారం రాత్రి పొద్దుపోయేదాకా మోదీ సారథ్యంలో అగ్ర నాయకత్వం సుదీర్ఘంగా చర్చోపచర్చలు జరిపింది. సిట్టింగుల పనితీరుపై నిశిత పరిశీలన, కొంతకాలంగా జరిపిన పలు లోతైన సర్వేలతో పాటు నమో యాప్ తదితర వివరాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్టు చెబుతున్నారు. తొలి జాబితాలో ప్రకటించిన 195 స్థానాల్లో 155 చోట్ల 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నెగ్గింది. ఆ 155 మంది సిట్టింగుల్లో ఏకంగా 20 శాతం మందికి ఈసారి టికెట్లివ్వకపోవడం విశేషం! ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370కి పైగా, ఎన్డీఏ కూటమి 400 పై చిలుకు స్థానాల్లో నెగ్గాలని బీజేపీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుంది. -
మార్కుల లిస్ట్ లో మంత్రి ఫొటో!
ముంబై: మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే మరో వివాదానికి తెర తీశారు. విద్యార్థుల మార్కుల లిస్టులపై తన ఫొటోను ప్రచురించి ముక్కున వేలేసుకునేలా చేశారు. బుధవారం పంపిణీ చేసిన పదో తరగతి సామర్థ్య పరీక్ష మార్కుల లిస్టుల్లో వినోద్ తావ్డే ఫొటో ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు. విద్యార్థులకు అభినందనల సందేశంతో పాటు, ఈ పరీక్ష ఎందుకు నిర్వహించారో వివరిస్తూ మార్కుల లిస్టులో వినోద్ తావ్డే ఫొటో ప్రచురించారు. విద్యార్థుల మార్కుల లిస్టులను సొంత ప్రచారాలకు వాడుకోవడం తగదని సీనియర్ ఉపాధ్యాయుడొకరు వ్యాఖ్యానించారు. అంతకుముందు వినోద్ తావ్డే ఇంజనీరింగ్ పట్టాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరిలో నిర్వహించిన అప్టిట్యూడ్ పరీక్షను 15 లక్షల మందిపైగా విద్యార్థులు రాశారు. పదో తరగతి విద్యార్థుల నైపుణ్యాలు, అభిరుచుల గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్రలో తొలిసారిగా ఈ పరీక్ష నిర్వహించారు. -
రైతు సమస్యలు పరిష్కరించకుంటే జైల్ భరో
సాక్షి, ముంబై : కరవు ప్రాంతాల్లోని రైతుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ‘జైల్ భరో’ ఆందోళన చేపడతామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వారిని గద్దె దించాలని ఆయన అన్నారు. కరవుతో మూడు రోజుల మరాఠ్వాడా పర్యటనను ఆయన శుక్రవారం ఉస్మానాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారు. మొదటి రోజు ఉస్మానాబాద్‌లో ర్యాలీ నిర్వహించిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పవార్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పేదలను, కరవు కోరల్లో చిక్కుకున్న రైతుల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైందని అన్నారు. ఒక్క ఉస్మానాబాద్లోనే 88 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు. 25 రోజులు వృథా పార్లమెంట్లో రైతుల సమస్యలను ప్రస్తావించాలని అనుకున్నామని.. అయితే సమావేశాలు సక్రమంగా జరగకపోవడం వల్ల 25 రోజులు వృథా అయ్యాయని, ఒక్క రోజు కూడా ప్రధాని పార్లమెంట్‌కు హాజరుకాలేదని మండిపడ్డారు. ప్రధానికి రైతు తమ్ముళ్లు, కుటుంబాలు ఎందుకు గుర్తురావడంలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందని దుయ్యబట్టారు. సెప్టెంబరు 14వ తేదీలోపు రైతుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జైల్ భ రో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శని, ఆదివారాలు లాతూర్, బీడ్, పర్భణి జిల్లాలో ర్యాలీలు ఉంటాయని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు 35 ఏళ్ల తర్వాత ఆయన రోడ్డుపైకి వచ్చారు. దీంతో అందరి దృష్టి పవార్‌పై పడిం ది. 1980, డిసెంబర్లో ఆయన చివరగా జల్గావ్ నుంచి నాగ్‌పూర్ వరకు ర్యాలీ చేపట్టారు. ఎన్సీపీలో సరైన నాయకుడు లేడు: వినోద్ తావ్డే అయితే విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే మాట్లాడుతూ.. ఎన్సీపీలో మరో నాయకుడు లేడు కాబట్టి పార్టీ అధినేత గల్లీల వెంబడి తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉస్మానాబాద్ ర్యాలీని కేవలం పవార్ నిర్వహిస్తున్నారా?.. మిగతా ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్, సునీల్ ఠాక్రే, జయంత్ పాటిల్ ఎక్కడ అని ప్రశ్నించారు. దీనిపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత ధనంజయ్ ముండే మాట్లాడుతూ.. బోగస్ డిగ్రీ ఉన్న మంత్రులు బోగస్ మంత్రులని, ఎన్సీపీ నాయకుల గూర్చి మాట్లాడే ముందు.. బోగస్ డిగ్రీపైనిజనిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
'నా ఇంజనీరింగ్ పట్టా బోగస్ కాదు'
ముంబై: నకిలీ డిగ్రీ పట్టాను ఆధారంగా చూపి మంత్రి పదవి పొందారన్న ఆరోపణలపై మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే వివరణ ఇచ్చారు. సోమవారం ముంబైలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 'పలు వార్తా ఛానెళ్లు ప్రసారం చేసినట్లు నా గ్రాడ్యుయేషన్ పట్టా నకిలీది కాదు. సత్యప్రమాణకంగా నిజమైందే. పుణేలోని ధ్యానేశ్వరీ విద్యాపీఠంలోనే నేను బీఈ ఎలక్ట్రానిక్స్ చదివాను. 1980 నుంచి 1984 వరకు నేనక్కడ చదువుకున్నా. అయితే అప్పట్లో మా కోర్సుకు ప్రభుత్వ గుర్తింపు ఉండేదికాదు. దూర విద్యావిధానం కిందికి వచ్చే కోర్సులో చేరేముందు ఈ విషయాన్ని టీచర్లు కూడా మరోసారి గుర్తుచేశారు. గుర్తింపులేని డిగ్రీ చదవాలో లేదో మమ్మల్నే నిర్ణయించుకోమని చెప్పారు కూడా. అప్పట్లో ధ్యానేశ్వరీ విద్యామందిర్ ప్రవేశపెట్టిన ఈ కోర్సుపై కొందరు కోర్టుకు వెళ్లారు. కోర్టు తీర్పు కూడా వారికే అనుకూలంగా వచ్చింది. అందుకే మా డిగ్రీ సర్టిఫికేట్లు చెల్లకుండా పోయాయి. కానీ నేను కోర్సు చదివింది మాత్రం నిజం' అంటూ తన విద్యార్హతపై వివరణ ఇచ్చారు వినోద్ తావ్డే. కాగా, తావ్ డే తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని మహారాష్ట్ర ప్రతిపక్షనేత రాధాకృష్ణ పాటిల్ డిమాండ్ చేశారు. నకిలీ డిగ్రీ పట్టా కేసులో ఢిల్లీ న్యాయశాఖ మంత్రి జితేంద్ర సింగ్ తోమర్ జైలు పాలైన నేపథ్యంలో అన్నిరాష్ట్రాల్లో మంత్రుల విద్యార్హతలపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. -
లండన్‌లోని అంబేద్కర్ ఇల్లు 35 కోట్లు
అంబేద్కర్ ఇల్లు 35 కోట్లు, మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం, వినోద్ తవ్డే కొనుగోలుకు మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ముంబై: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 1921-22 మధ్య లండన్‌లో నివసించిన ఇంటిని కొనుగోలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2,050 చదరపు అడుగులతో మూడంతస్తుల్లో ఉన్న ఈ భవనాన్ని కొనుగోలు చేయడానికి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తవ్డే లండన్‌కు వెళ్లారు. ఈ భవంతిని రూ.35 కోట్లకు కొనుగోలు చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వినోద్.. ప్రస్తుతం దావోస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు చెప్పారు. ఈ భవనాన్ని అంబేద్కర్ జయంతి అయిన ఏప్రిల్ 14 నుంచి సందర్శకులకు అందుబాటులో ఉంచనున్నారు. కాగా ఈ భవంతి కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఆశిష్ షెలార్ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి కొద్దిరోజుల కిందట లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఇది అంబేద్కర్ అభిమానులు, మహారాష్ట్ర ప్రజల ఉద్వేగానికి సంబంధించినదని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై దళిత సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. -
‘ఉట్టి’.. ఇకపై సాహసక్రీడ..!
ప్రకటించిన బీజేపీ సర్కార్ సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాలను ‘సాహస క్రీడ’ల జాబితాలో చేర్చాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం క్రీడా శాఖ మంత్రి వినోద్ తావ్డే ప్రకటించారు. ఉట్టి ఉత్సవాల్లో గోవిందా బృందాల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. నిర్వాహకులు అందజేసే నగదు బహుమతి, ఇతర పారితోషికాలకు ఆశపడి బృంద సభ్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అనేక మంది పైనుంచి కిందపడి గాయపడడం, మృతి చెందడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉట్టి ఉత్సవాన్ని సాహస క్రీడల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ముంబై హైకోర్టు ఉట్టి ఉత్సవాలపై అనేక ఆంక్షలు విధించింది. కోర్టు నిర్ణయాన్ని నగరంలోని అన్ని సార్వజనిక గోవిందా బృందాలు వ్యతిరేకించాయి. దీంతో కోర్టు కొన్ని నియమాలు సడలించడంతో ఈ ఏడాది ఎప్పటిలానే ఉత్సవాలు నిర్వహించారు. కాని ఈ ఉట్టి ఉత్సవాలను సాహస క్రీడా జాబితాలో చేర్చాలనే డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో మానవ పిరమిడ్లు నిర్మించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కాని మన దేశంలో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎక్కడ కనిపించదు. కాగా, దీన్ని సాహస క్రీడల జాబితాలో చేర్చడంవల్ల నియమ, నిబంధనాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని నిబంధనలతో కూడిన ప్రత్యేక జాబితాను తయారుచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ క్రీడను గోవిందా బృందాలు మరింత సురక్షితంగా ఆడేందుకు వీలుపడనుందని తావ్డే అభిప్రాయపడ్డారు. ఎన్సీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్ అసెంబ్లీ సభాగృహంలో గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించిన ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాడ్ను శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. శాసన సభలో కరువుపై చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతుండగా ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. అనంతరం మళ్లీ సమావేశాలను ప్రారంభించినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. కాగా, సభ్యుల ఆందోళన సమయంలో పోడియంలోకి అవాడ్ దూసుకెళ్లడంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ స్పందించారు. ఆయనను సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించారు. అనంతరం జితేంద్ర అవాడ్ను శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ హరిబావు బాగడే ప్రకటించారు. -
‘సేన’తో తావ్డేకు తలనొప్పే..
ముంబై: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బోరివలి నుంచి పోటీచేస్తున్న మహారాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు వినోద్ తావ్డేకు ఈసారి విజయం అంత సులభం కాద విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 25 యేళ్ల బీజేపీ-శివసేన కూటమి బీటలు వారడానికి తావ్డే కూడా కారణమని శివసేన భావిస్తున్న నేపథ్యంలో అతడిని ఎలాగైనా ఓడించాలని ఆ పార్టీ తన కార్యకర్తలను ఆదేశించడం గమనార్హం. కాగా బోరివలి నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న మరాఠీ, గుజరాతీ బ్రాహ్మణులతోపాటు నరేంద్ర మోదీ హవా కూడా తనను గట్టెక్కిస్తుందని తావ్డే భావిస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ తరఫున ముఖ్యమంత్రి రేసులో కూడా ఉన్న వినోద్ తావ్డే తాను నివాసముంటున్న బోరివలి స్థానాన్నే కోరుకోవడానికి కారణం ఆ నియోజకవర్గం మొదటి నుంచి బీజేపీకి కంచుకోటగా నిలుస్తోంది. పాతికేళ్ల బీజేపీ-శివసేన కూటమి లో బీజేపీ కోటాలో ఈ స్థానం కొనసాగు తూ వస్తోంది. ఇక్కడ మరాఠా, గుజరాత్‌లకు చెందిన మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా నివశిస్తున్నారు. ఒకవేళ బీజేపీ- శివసేన కూటమి కొనసాగి ఉంటే.. వినోద్ తావ్డే తన గెలుపుకోసం అంత ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని శివసేన సీనియర్ లీడర్ వినోద్ ఘోసాల్కర్ అభిప్రాయపడ్డారు. ‘మహాకూటమి ఉండి ఉంటే తావ్డే అసెంబ్లీ లో అడుగుపెట్టడం అంత కష్టం కాకపోయేది.. ఇప్పుడు మాత్రం విజయం కోసం చెమటోడ్చాల్సిం దే.. ఎందుకంటే ఇక్కడ సేన స్థానిక వ్యక్తికి టికెట్ ఇచ్చింది..’ అనిచెప్పారు. కాగా, మహా కూటమి విచ్ఛిన్నానికి తానుకూడా కారణమని శివసేన చేస్తున్న విమర్శలను పట్టించుకోవడంలేదని తావ్డే తెలిపారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ఆదరించిన విధంగానే ఈ ఎన్నికల్లోనూ బీజేపీకి ఓటు వేయమని ప్రజలను మేం కోరుతున్నామ’ని తావ్డే స్పష్టం చేశా రు. ఇదిలా ఉండగా బోరివలి స్థానం నుంచి శివసేన అభ్యర్థిగా పోటీచేస్తున్న ఉత్తమ్ ప్రకాశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. తాను పాతికేళ్లుగా బోరివలిలో ఉం టున్నానని చెప్పాడు. స్థానికులందరికీ తన గురించి తెలుసని, శివసేన సిద్ధాంతాలను వివరించడం ద్వారా విజయం సాధించేందుకు కృషిచేస్తానని తెలి పాడు.తావ్డేను తన ప్రధాన ప్రత్యర్థిగా భావించబోననిచెప్పాడు. స్థానికంగా అన్ని వర్గాల్లో తనకు పట్టు ఉందని తెలిపాడు. తన కోసం ప్రచారంచేయడానికి పలు ప్రాంతాలనుంచి సీఏలు వస్తున్నారని చెప్పా డు. కాగా, బీజేపీ అభ్యర్థులను ఓడించడమే తమ ప్రధాన అజెండా అని శివసేన కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ నియోజవ ర్గంలో సంస్థాగతంగా శివసేనకు సరైన నాయకత్వం లేదని, ఉన్నవాళ్లలో చాలామంది ఎమ్మెన్నెస్‌కు వలసపోయారని విశ్లేషకులు అంటున్నారు. కొంకణ్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్న తావ్డేకే బోరివలిలో ఉన్న కొంకణ్ వాసులు మద్దతు పలికే అవకాశముందని వారు పేర్కొంటున్నారు. -
దత్‌కు మద్యం అందుతోంది
సాక్షి, ముంబై: ఇటీవలే పెరోల్ వివాదంతో ఇబ్బందులుపడ్డ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు మరో సమస్య ఎదురయింది. 1993లో ముంబైలో వరుస పేలుళ్ల కేసులో ఇతడు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బాలీవుడ్ నటుడికి యెరవాడ జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నట్టు బీజేపీ ఆరోపించింది. జైలు శిక్షపడిన అనంతరం సంజయ్ దత్‌ను ముంబై నుంచి పుణే యెరవాడ జైలుకు తరలించిన విషయం విదితమే. అందరు ఖైదీల మాదిరిగానే సంజయ్ దత్ ను కూడా జైలు అధికారులు చూడాల్సి ఉంటుంది. అయితే ఆయనకు జైళ్లో ఏకంగా మద్యం (బీర్, రమ్) అందిస్తున్నట్టు ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే ఆరోపించారు. కొందరు పోలీసులు అధికారులు, సిబ్బంది ఇలాంటి వారికి సహకరిస్తుంటారని చెప్పారు. తావ్డే తాజాగా చేసిన ఈ ఆరోపణలు దుమారం లేపాయి. విధానసభలో ఈ అంశంపై సోమవారం గొడవ జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. జైళ్లల్లో శిక్షను అనుభవిస్తున్న సంపన్న వ్యక్తులకు జైలు సిబ్బంది సహకరిస్తున్నట్టు గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. దత్ వంటివాళ్లతోపాటు శక్తిమిల్లు వద్ద అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కూడా రాచమర్యాదలు అందుతున్నాయని తావ్డే ఆరోపించారు. దత్‌కు ఇటీవలే 30 రోజుల పెరోల్ లభించడంపై తీవ్ర వివాదం తలెత్తింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇతడికి రెండుసార్లు పెరోల్ వచ్చింది. భార్య మాన్యత దత్ అనారోగ్యం కారణంగా పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు దత్ తెలిపారు. అయితే ఆమె ఓ సినిమా కార్యక్రమంలో కన్పించడంతో ఒక్కసారిగా ఈ విషయంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. పెరోల్‌ను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఆర్పీఐ యెరవాడ జైలు ఎదుట ఆందోళనకు దిగింది. కొన్ని సామాజిక సంఘాలు కూడా ప్రభుత్వ ధోరణిపై మండిపడ్డాయి. వేలాది మంది ఖైదీలు బెయిల్ రాక జైళ్లలో మగ్గిపోతున్నారని, దత్ వంటి నేరగాళ్లకు మాత్రం నెలకోసారి పెరోల్ ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి. దీంతో సర్కారు ఇతడికి పెరోల్ రద్దు చేసింది. సంజయ్‌దత్‌కు జైళ్లో ఏకంగా మద్యం అందుతున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో మరోసారి ఇతడు వార్తల్లో నిలిచాడు. పాటిల్ సమాధానంపైనే అందరి దృష్టి... అసెంబ్లీలో వినోద్ తావ్డే ఆరోపణలకు హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఎలాంటి సమధానమిస్తారనే విషయంపై అందరి దృష్టీ కేంద్రీకృరితమయింది. అసెంబ్లీలో సోమవారం ఈ విషయంపై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశముంది. దత్‌కు పెరోల్ మంజూరుపైనా ఆర్.ఆర్. పాటిల్ విచారణకు ఆదేశించారు. -
‘జల’గలను వదలొద్దు
సాక్షి, ముంబై: జలవనరుల ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడి ప్రభుత్వంలో ఉన్నత పదవులు అనుభవిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా చూడాలని మాధవ్ చితలే సమితిని బీజేపీ సోమవారం కోరింది. ఏకంగా 14 వేల పేజీల ఆధారాలను సమర్పించింది. కంచన్వాడీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్మీ కార్యాలయం వరకు ఎడ్లబండ్లపై నాలుగు సూట్ కేసుల్లో ఉన్న పత్రాలను తీసుకొచ్చిన నేతలు వాటిని చితలే కమిటీకి అప్పగించారు. ఈ ర్యాలీలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే, రావ్‌సాహెబ్ దానవే, బబన్రావ్లోణీకర్లతోపాటు మరాఠ్వాడాకు చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేయాలని డిమాండ్ చేశారు. తాము సమర్పించిన ఆధారాలు సరిపోతాయని, అవసరమనుకుంటే మరింత సమాచారాన్ని మరో 15 రోజుల్లో సమర్పిస్తామని చితలే కమిటీకి తెలిపామన్నారు. కుంభకోణంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, జలవనరుల శాఖ మంత్రి సునీల్ తట్కరేలతో పాటు పలువురు అధికారుల హస్తముందని ఆరోపించారు. గత కొన్నేళ్ల నుంచి జలవనరుల ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఎన్నో ఉద్యమాలు చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడితో పాటు అడ్వొకేట్ జనరల్ దరియాస్ కాంబటా ఇచ్చిన సలహా మేరకు చితలే కమిటీ ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులు జలవనరుల ప్రాజెక్ట్‌ల్లో జరిగిన అవినీతి ఆధారాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అనుమతించిన సంగతి తెలిసిందే. కాగా, మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జలవనరుల కుంభకోణం అంశం ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో దుమారంలేపుతూనే ఉంది. సాగునీటి ప్రాజెక్టులు ఇతర జలవనరుల పనులలో సుమారు రూ. 70 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. అనంతరం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జలవనరుల నిపుణులైన మాధవ్‌రావ్ చితలే అధ్యక్షతన ఈ జలవనరుల కుంభకోణం దర్యాప్తు సమితిని ఏర్పాటు చేసింది. అందరు సమర్పించిన ఆధారాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా నివేదికను రూపొందించే పనిలో ఈ సమితి నిమగ్నమైంది.