సాక్షి, ముంబై: జలవనరుల ప్రాజెక్టుల్లో వేల కోట్ల అవినీతికి పాల్పడి ప్రభుత్వంలో ఉన్నత పదవులు అనుభవిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా చూడాలని మాధవ్ చితలే సమితిని బీజేపీ సోమవారం కోరింది. ఏకంగా 14 వేల పేజీల ఆధారాలను సమర్పించింది. కంచన్‌వాడీ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న వాల్మీ కార్యాలయం వరకు ఎడ్లబండ్లపై నాలుగు సూట్ కేసుల్లో ఉన్న పత్రాలను తీసుకొచ్చిన నేతలు వాటిని చితలే కమిటీకి అప్పగించారు.
ఈ ర్యాలీలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే, రావ్‌సాహెబ్ దానవే, బబన్‌రావ్‌లోణీకర్‌లతోపాటు మరాఠ్వాడాకు చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫడ్నవిస్ మాట్లాడుతూ తాము సమర్పించిన ఆధారాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా చేయాలని డిమాండ్ చేశారు. తాము సమర్పించిన ఆధారాలు సరిపోతాయని, అవసరమనుకుంటే మరింత సమాచారాన్ని మరో 15 రోజుల్లో సమర్పిస్తామని చితలే కమిటీకి తెలిపామన్నారు.
కుంభకోణంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, జలవనరుల శాఖ మంత్రి సునీల్ తట్కరేలతో పాటు పలువురు అధికారుల హస్తముందని ఆరోపించారు. గత కొన్నేళ్ల నుంచి జలవనరుల ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఎన్నో ఉద్యమాలు చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు ప్రతిపక్షాల నుంచి ఒత్తిడితో పాటు అడ్వొకేట్ జనరల్ దరియాస్ కాంబటా ఇచ్చిన సలహా మేరకు చితలే కమిటీ ముందు ప్రతిపక్ష పార్టీ నాయకులు జలవనరుల ప్రాజెక్ట్‌ల్లో జరిగిన అవినీతి ఆధారాలను సమర్పించేందుకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అనుమతించిన సంగతి తెలిసిందే. కాగా, మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జలవనరుల కుంభకోణం అంశం ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో దుమారంలేపుతూనే ఉంది.
సాగునీటి ప్రాజెక్టులు ఇతర జలవనరుల పనులలో సుమారు రూ. 70 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం కూడా విడుదల చేసింది. అనంతరం అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన జలవనరుల నిపుణులైన మాధవ్‌రావ్ చితలే అధ్యక్షతన ఈ జలవనరుల కుంభకోణం దర్యాప్తు సమితిని ఏర్పాటు చేసింది. అందరు సమర్పించిన ఆధారాలను పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకునేలా నివేదికను రూపొందించే పనిలో ఈ సమితి నిమగ్నమైంది.
‘జల’గలను వదలొద్దు
Published Tue, Oct 22 2013 12:15 AM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement