‘ఉట్టి’.. ఇకపై సాహసక్రీడ..!
ప్రకటించిన బీజేపీ సర్కార్
సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాలను ‘సాహస క్రీడ’ల జాబితాలో చేర్చాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని నాగపూర్‌లో జరుగుతున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం క్రీడా శాఖ మంత్రి వినోద్ తావ్డే ప్రకటించారు. ఉట్టి ఉత్సవాల్లో గోవిందా బృందాల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. నిర్వాహకులు అందజేసే నగదు బహుమతి, ఇతర పారితోషికాలకు ఆశపడి బృంద సభ్యులు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. అనేక మంది పైనుంచి కిందపడి గాయపడడం, మృతి చెందడం లాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉట్టి ఉత్సవాన్ని సాహస క్రీడల జాబితాలో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకే ముంబై హైకోర్టు ఉట్టి ఉత్సవాలపై అనేక ఆంక్షలు విధించింది. కోర్టు నిర్ణయాన్ని నగరంలోని అన్ని సార్వజనిక గోవిందా బృందాలు వ్యతిరేకించాయి. దీంతో కోర్టు కొన్ని నియమాలు సడలించడంతో ఈ ఏడాది ఎప్పటిలానే ఉత్సవాలు నిర్వహించారు. కాని ఈ ఉట్టి ఉత్సవాలను సాహస క్రీడా జాబితాలో చేర్చాలనే డిమాండ్ మరోసారి తెరమీదకు వచ్చింది. దీంతో రాష్ట్రంలోని బీజేపీ, శివసేన కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది.
విదేశాల్లో మానవ పిరమిడ్లు నిర్మించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. కాని మన దేశంలో అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లు ఎక్కడ కనిపించదు. కాగా, దీన్ని సాహస క్రీడల జాబితాలో చేర్చడంవల్ల నియమ, నిబంధనాల్లో స్వల్ప మార్పులు చేయాల్సి ఉంటుంది. కొన్ని నిబంధనలతో కూడిన ప్రత్యేక జాబితాను తయారుచేయాల్సి ఉంటుంది. దీంతో ఈ క్రీడను గోవిందా బృందాలు మరింత సురక్షితంగా ఆడేందుకు వీలుపడనుందని తావ్డే అభిప్రాయపడ్డారు.
ఎన్సీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్
అసెంబ్లీ సభాగృహంలో గందరగోళాన్ని సృష్టించేందుకు ప్రయత్నించిన ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాడ్‌ను శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేశారు. శాసన సభలో కరువుపై చర్చల్లో భాగంగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతుండగా ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ పోడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో సభను 15 నిమిషాలపాటు వాయిదా వేయాల్సి వచ్చింది.
అనంతరం మళ్లీ సమావేశాలను ప్రారంభించినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం ఏ మాత్రం వెనక్కితగ్గలేదు. కాగా, సభ్యుల ఆందోళన సమయంలో పోడియంలోకి అవాడ్ దూసుకెళ్లడంతో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గిరీష్ బాపట్ స్పందించారు. ఆయనను సస్పెండ్ చేయాలంటూ ప్రతిపాదించారు. అనంతరం జితేంద్ర అవాడ్‌ను శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ హరిబావు బాగడే ప్రకటించారు.