రైతు సమస్యలు పరిష్కరించకుంటే జైల్ భరో
సాక్షి, ముంబై : కరవు ప్రాంతాల్లోని రైతుల సమస్యలు నెల రోజుల్లో పరిష్కరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ‘జైల్ భరో’ ఆందోళన చేపడతామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలకు కారణమైన వారిని గద్దె దించాలని ఆయన అన్నారు. కరవుతో మూడు రోజుల మరాఠ్వాడా పర్యటనను ఆయన శుక్రవారం ఉస్మానాబాద్ జిల్లా నుంచి ప్రారంభించారు. మొదటి రోజు ఉస్మానాబాద్‌లో ర్యాలీ నిర్వహించిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
అనంతరం జరిగిన బహిరంగ సభలో పవార్ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పేదలను, కరవు కోరల్లో చిక్కుకున్న రైతుల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. కొత్త ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తుందనుకున్న ప్రజలకు నిరాశే ఎదురైందని అన్నారు. ఒక్క ఉస్మానాబాద్‌లోనే 88 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు.
25 రోజులు వృథా
పార్లమెంట్‌లో రైతుల సమస్యలను ప్రస్తావించాలని అనుకున్నామని.. అయితే సమావేశాలు సక్రమంగా జరగకపోవడం వల్ల 25 రోజులు వృథా అయ్యాయని, ఒక్క రోజు కూడా ప్రధాని పార్లమెంట్‌కు హాజరుకాలేదని మండిపడ్డారు. ప్రధానికి రైతు తమ్ముళ్లు, కుటుంబాలు ఎందుకు గుర్తురావడంలేదని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను బీజేపీ విస్మరించిందని దుయ్యబట్టారు. సెప్టెంబరు 14వ తేదీలోపు రైతుల డిమాండ్లను నెరవేర్చని పక్షంలో జైల్ భ రో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శని, ఆదివారాలు లాతూర్, బీడ్, పర్భణి జిల్లాలో ర్యాలీలు ఉంటాయని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వాన్ని నిద్ర లేపాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలపై పోరాడేందుకు 35 ఏళ్ల తర్వాత ఆయన రోడ్డుపైకి వచ్చారు. దీంతో అందరి దృష్టి పవార్‌పై పడిం ది. 1980, డిసెంబర్‌లో ఆయన చివరగా జల్గావ్ నుంచి నాగ్‌పూర్ వరకు ర్యాలీ చేపట్టారు.
ఎన్సీపీలో సరైన నాయకుడు లేడు: వినోద్ తావ్డే
అయితే విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే మాట్లాడుతూ.. ఎన్సీపీలో మరో నాయకుడు లేడు కాబట్టి పార్టీ అధినేత గల్లీల వెంబడి తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు. ఉస్మానాబాద్ ర్యాలీని కేవలం పవార్ నిర్వహిస్తున్నారా?.. మిగతా ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్, సునీల్ ఠాక్రే, జయంత్ పాటిల్ ఎక్కడ అని ప్రశ్నించారు. దీనిపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత ధనంజయ్ ముండే మాట్లాడుతూ.. బోగస్ డిగ్రీ ఉన్న మంత్రులు బోగస్ మంత్రులని, ఎన్సీపీ నాయకుల గూర్చి మాట్లాడే ముందు.. బోగస్ డిగ్రీపైనిజనిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.