సాక్షి, ముంబై: ఇటీవలే పెరోల్ వివాదంతో ఇబ్బందులుపడ్డ బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్‌కు మరో సమస్య ఎదురయింది. 1993లో ముంబైలో వరుస పేలుళ్ల కేసులో ఇతడు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ బాలీవుడ్ నటుడికి యెరవాడ జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నట్టు బీజేపీ ఆరోపించింది. జైలు శిక్షపడిన అనంతరం సంజయ్ దత్‌ను ముంబై నుంచి పుణే యెరవాడ జైలుకు తరలించిన విషయం విదితమే.
అందరు ఖైదీల మాదిరిగానే సంజయ్ దత్ ను కూడా జైలు అధికారులు చూడాల్సి ఉంటుంది. అయితే ఆయనకు జైళ్లో ఏకంగా మద్యం (బీర్, రమ్) అందిస్తున్నట్టు ప్రతిపక్ష నాయకుడు వినోద్ తావ్డే ఆరోపించారు. కొందరు పోలీసులు అధికారులు, సిబ్బంది ఇలాంటి వారికి సహకరిస్తుంటారని చెప్పారు. తావ్డే తాజాగా చేసిన ఈ ఆరోపణలు దుమారం లేపాయి. విధానసభలో ఈ అంశంపై సోమవారం గొడవ జరిగే అవకాశాలున్నాయి. బీజేపీ ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది.
జైళ్లల్లో శిక్షను అనుభవిస్తున్న సంపన్న వ్యక్తులకు జైలు సిబ్బంది సహకరిస్తున్నట్టు గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. దత్ వంటివాళ్లతోపాటు శక్తిమిల్లు వద్ద అత్యాచారానికి పాల్పడిన నిందితులకు కూడా రాచమర్యాదలు అందుతున్నాయని తావ్డే ఆరోపించారు. దత్‌కు ఇటీవలే 30 రోజుల పెరోల్ లభించడంపై తీవ్ర వివాదం తలెత్తింది. ఈ ఏడాదిలో ఇప్పటికే ఇతడికి రెండుసార్లు పెరోల్ వచ్చింది. భార్య మాన్యత దత్ అనారోగ్యం కారణంగా పెరోల్‌కు దరఖాస్తు చేసుకున్నట్టు దత్ తెలిపారు. అయితే ఆమె ఓ సినిమా కార్యక్రమంలో కన్పించడంతో ఒక్కసారిగా ఈ విషయంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. పెరోల్‌ను తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఆర్పీఐ యెరవాడ జైలు ఎదుట ఆందోళనకు దిగింది.
కొన్ని సామాజిక సంఘాలు కూడా ప్రభుత్వ ధోరణిపై మండిపడ్డాయి. వేలాది మంది ఖైదీలు బెయిల్ రాక జైళ్లలో మగ్గిపోతున్నారని, దత్ వంటి నేరగాళ్లకు మాత్రం నెలకోసారి పెరోల్ ఇస్తున్నారంటూ విరుచుకుపడ్డాయి. దీంతో సర్కారు ఇతడికి పెరోల్ రద్దు చేసింది. సంజయ్‌దత్‌కు జైళ్లో ఏకంగా మద్యం అందుతున్నట్టు ఆరోపణలు వస్తుండడంతో మరోసారి ఇతడు వార్తల్లో నిలిచాడు.
పాటిల్ సమాధానంపైనే అందరి దృష్టి...
అసెంబ్లీలో వినోద్ తావ్డే ఆరోపణలకు హోంశాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఎలాంటి సమధానమిస్తారనే విషయంపై అందరి దృష్టీ కేంద్రీకృరితమయింది. అసెంబ్లీలో సోమవారం ఈ విషయంపై ఆయన ఒక ప్రకటన చేసే అవకాశముంది. దత్‌కు పెరోల్ మంజూరుపైనా ఆర్.ఆర్. పాటిల్ విచారణకు ఆదేశించారు.
దత్‌కు మద్యం అందుతోంది
Published Sat, Dec 14 2013 11:10 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement
Advertisement