మార్కుల లిస్ట్ లో మంత్రి ఫొటో!
ముంబై: మహారాష్ట్ర విద్యా శాఖ మంత్రి వినోద్ తావ్డే మరో వివాదానికి తెర తీశారు. విద్యార్థుల మార్కుల లిస్టులపై తన ఫొటోను ప్రచురించి ముక్కున వేలేసుకునేలా చేశారు. బుధవారం పంపిణీ చేసిన పదో తరగతి సామర్థ్య పరీక్ష మార్కుల లిస్టుల్లో వినోద్ తావ్డే ఫొటో ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆశ్చర్యానికి లోనయ్యారు.
విద్యార్థులకు అభినందనల సందేశంతో పాటు, ఈ పరీక్ష ఎందుకు నిర్వహించారో వివరిస్తూ మార్కుల లిస్టులో వినోద్ తావ్డే ఫొటో ప్రచురించారు. విద్యార్థుల మార్కుల లిస్టులను సొంత ప్రచారాలకు వాడుకోవడం తగదని సీనియర్ ఉపాధ్యాయుడొకరు వ్యాఖ్యానించారు. అంతకుముందు వినోద్ తావ్డే ఇంజనీరింగ్ పట్టాపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.
కాగా, ఫిబ్రవరిలో నిర్వహించిన అప్టిట్యూడ్ పరీక్షను 15 లక్షల మందిపైగా విద్యార్థులు రాశారు. పదో తరగతి విద్యార్థుల నైపుణ్యాలు, అభిరుచుల గురించి తెలుసుకునేందుకు మహారాష్ట్రలో తొలిసారిగా ఈ పరీక్ష నిర్వహించారు.