బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే
లక్నో : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం చల్లారకముందే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే మరో వివాదానికి తెర లేపారు. జిన్నాను మహాపురుషుడిగా (గొప్ప వ్యక్తి) కీర్తించి కలకలం రేపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా పురుషుడని జిన్నాను పొగిడారు.
సావిత్రి బాయి గత కొన్ని రోజులుగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ సొంత పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా అలీగఢ్ విశ్వవిద్యాలయంలో జిన్నా ఫొటో వివాదానికి ఆజ్యం పోశారు. జిన్నా గురించి మాట్లాడుతూ... ‘భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా ఎనలేని కృషి చేశారు. ఆయన మహాపురుషుడు, మనం ఆయన త్యాగాన్ని మరవకూడదు’ అంటూ పొగిడి బీజేపీని ఇరుకున పెట్టారు. అంతేకాక తాజాగా రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ‘దళితల ఇళ్ల సందర్శన’ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు దళితుల ఇళ్లకు వెళ్లడమంటే వారిని తీవ్రంగా అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు.
ఏఎంయూలో జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్.. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) తారిఖ్ మన్సూర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. ‘జిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment