Mohammed Ali Jinnah
-
జిన్నా మహాపురుషుడు: బీజేపీ ఎంపీ
లక్నో : అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటంపై వివాదం చల్లారకముందే బీజేపీ ఎంపీ సావిత్రిబాయి పూలే మరో వివాదానికి తెర లేపారు. జిన్నాను మహాపురుషుడిగా (గొప్ప వ్యక్తి) కీర్తించి కలకలం రేపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహా పురుషుడని జిన్నాను పొగిడారు. సావిత్రి బాయి గత కొన్ని రోజులుగా బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ సొంత పార్టీకి తలనొప్పిగా మారారు. తాజాగా అలీగఢ్ విశ్వవిద్యాలయంలో జిన్నా ఫొటో వివాదానికి ఆజ్యం పోశారు. జిన్నా గురించి మాట్లాడుతూ... ‘భారత స్వాతంత్ర్య పోరాటంలో జిన్నా ఎనలేని కృషి చేశారు. ఆయన మహాపురుషుడు, మనం ఆయన త్యాగాన్ని మరవకూడదు’ అంటూ పొగిడి బీజేపీని ఇరుకున పెట్టారు. అంతేకాక తాజాగా రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీ నిర్వహిస్తున్న ‘దళితల ఇళ్ల సందర్శన’ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకులు దళితుల ఇళ్లకు వెళ్లడమంటే వారిని తీవ్రంగా అవమానించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఏఎంయూలో జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్.. వర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) తారిఖ్ మన్సూర్‌కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. ‘జిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద’ అన్నారు. -
జిన్నా ఫొటోపై వివాదం
అలీగఢ్ (యూపీ): అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)లో పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అలీ జిన్నా చిత్రపటం ఉండటంపై వివాదం చెలరేగుతోంది. వర్సిటీలో జిన్నా చిత్రపటాన్ని ఎందుకు ఉంచారో వివరణ ఇవ్వాలని స్థానిక బీజేపీ ఎంపీ సతీశ్ గౌతమ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన వర్సిటీ వైస్ చాన్స్‌లర్ (వీసీ) తారిఖ్ మన్సూర్‌కు లేఖ రాశారు. వారం కిందట ఏఎంయూలో ఆరెస్సెస్ శాఖ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని ఓ విద్యార్థి కోరగా.. వీసీ అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఏఎంయూ స్టూడెంట్ యూనియన్ కార్యాలయంలో ఉన్న జిన్నా చిత్రపటంపై సతీశ్ గౌతమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఏఎంయూ అధికార ప్రతినిధి షఫీ కిద్వాయ్ మీడియాకు వివరణ ఇచ్చారు. ‘జిన్నా ఏఎంయూ వ్యవస్థాపక సభ్యుడు. వర్సిటీకి విరాళం ఇచ్చారు. అంతేకాదు పాకిస్తాన్ కోసం డిమాండ్ చేయకముందే వర్సిటీ ఏర్పాటుకు కృషి చేశారు. 1938లో వర్సిటీ విద్యార్థి సంఘం జీవిత కాల సభ్యత్వం పొందారు. అలా సభ్యత్వం పొందినవారి చిత్రపటాలు యూనియన్ కార్యాలయంలో ఉంచడం సంప్రదాయంగా వస్తోంది. ఆ చిత్రపటాలు ఉమ్మడి భారతదేశ వారసత్వ సంపద. మహాత్మా గాంధీ, మౌలానా ఆజాద్, సర్వేపల్లి రాధాకృష్ణ, సి.రాజగోపాలాచారి, రాజేంద్ర ప్రసాద్, నెహ్రూలతో సహా ఏ జాతీయ నాయకుడూ ఆ చిత్రపటం గురించి అభ్యంతరం వ్యక్తం చేయలేదు’అని చెప్పుకొచ్చారు. ఆరెస్సెస్ శాఖ ఏర్పాటుకు అనుమతిపై వివరణ ఇస్తూ వర్సిటీలో రాజకీయ పార్టీలు, దాని అనుబంధ సంస్థల ప్రత్యక్ష ప్రవేశానికి తావు లేదన్నారు. -
పాకిస్థాన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ
భారత దేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ సృష్టిస్తున్న రాజకీయ ప్రకంపనల్ని స్పూర్తిగా తీసుకుని పాకిస్థాన్ లో అదే పేరుతో ఓ పార్టీని ప్రారంభించారు. గుజ్రన్ వాలాలోని అర్సలాన్ ఉల్ ముల్క్ గ్రూప్ కు చెందిన మితవాదులు ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) పేరుతో పాకిస్థాన్ ఎలక్షన్ కమిషన్ వద్ద పార్టీని నమోదు చేశారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ ఆలీ జిన్నా కలల్ని నిజం చేస్తామని ఆప్ చైర్మన్ తెలిపారు. ఆమ్ ఆద్మీ నేత అరవింద్ కేజ్రివాల్ నిర్వహించిన ఉద్యమ పంథాను స్పూర్తిగా తీసుకుని వచ్చేవారం పంజాబ్ అసెంబ్లీ ఎదుట నిరవధిక దీక్షను చేపట్టనున్నారు. పోలీసు సంస్కరణ, వేధింపుల నిరోధక చట్టాన్ని ఆమోదించాలనే డిమాండ్ తో నిరవధిక దీక్షతో ఆందోళన ఆరంభించనున్నారు. ఏ ఉద్దేశంతో పాకిస్థాన్ ఏర్పడిందో.. ఆ ఆశయం నెరవేరలేదని, ప్రస్తుత రాజకీయ నాయకత్వం, అధికార వ్యవస్థ నమ్మకం కోల్పోయిందని.. జిన్నా కలలు కన్న పాకిస్థాన్ ఇదేనా అంటూ పాకిస్థాన్ కు చెందిన ఆప్ నేతలు మండిపడ్డారు.