హర్యానా సీఎం పదవిపై మల్లగుల్లాలు
హర్యానా ముఖ్యమంత్రి ఎంపిక విషయంలో సమీకరణాలు మారిపోతున్నాయి. ఇప్పటి వరకు జాట్ వర్గీయులకే సీఎం సీటు అప్పగిస్తారని ప్రచారం జరగ్గా తాజాగా కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. జాట్ వర్గీయులకు కాకుండా వేరే వాళ్లకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సీఎం అభ్యర్థి రేసులో మనోహర్ లాల్ ఖట్టర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఖట్టర్‌కు ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులు కూడా పుష్కలంగా ఉన్నాయని సమాచారం.
ఆయన కర్నాల్ స్థానం నుంచి గెలుపొందారు. 1980 నుంచి 1994 వరకు ఆర్ఎస్ఎస్లో పూర్తి స్థాయిలో పనిచేసిన ఖట్టర్, ఆ తర్వాత బీజేపీలో చేరారు. ముందునుంచి ప్రధాని నరేంద్రమోదీకి ఈయన అత్యంత సన్నిహితుడిగా పేరొందారు. 60 ఏళ్ల వయసున్న ఖట్టర్.. ఇప్పటికీ బ్రహ్మచారే.
తొలుత కెప్టెన్ అభిమన్యు పేరును ముఖ్యమంత్రి పదవికి గట్టిగా పరిశీలనలోకి తీసుకున్నట్లు వినిపించింది. జాట్ వర్గానికి ఆ పదవి ఇచ్చేటట్లయితే ఇప్పటికీ అభిమన్యు ముందుంటారు. కానీ, వ్యూహం మార్చుకుంటే మాత్రం ఖట్టర్ ముందుకొచ్చే అవకాశం ఉంటుంది.