'బీజేపీకి ఏ గతి పడుతుందో మోదీకి తెలుసు'
లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి ఏ గతి పట్టన్నుందో ప్రధాని నరేంద్ర మోదీ సహా ఆ పార్టీ పెద్దలకు ఇప్పటికే అర్థమై ఉంటుందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఎద్దేవా చేశారు. ఆమె మంగళవారం మీడియాతో మాట్లాడారు. గత ఆదివారంతో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే మూడో దఫా ఓటింగ్ ముగిసింది. అసెంబ్లీ పోలింగ్ దఫాలు ఇంకా మిగిలి ఉన్న నేపథ్యంలో మాయావతి తన విమర్శనాస్త్రాలను బీజేపీపై ఎక్కుపెట్టారు. తనకు మద్ధతుగా ఉన్న దళితులకు ప్రధాని మోదీ పూర్తి వ్యతిరేకమని మాయావతి మరోసారి వ్యాఖ్యానించారు.
'గత మూడు, నాలుగు రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. నల్లధనం పై తాను పోరాటం చేస్తే బద్ధ శత్రువులైన బీఎస్పీ, ఎస్పీలు కలిసిపోయాయన్న మోదీ వ్యాఖ్యలు అర్ధరహితం. యూపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తమ పార్టీ కాదని ప్రధానికి ఈ పాటికే అర్థమై ఉంటుంది' అని మాయావతి అన్నారు. కుల, మత అంశాలపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని ఇది దేశానికి మంచిది కాదని హితవు పలికారు.
ఇటీవల ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. బీఎస్పీ అంటే బెహన్ జీ (మాయావతి) సంపత్తి పార్టీగా మారిందని విమర్శించారు. ‘బెహన్ జీ.. మీది ఇకపై బహుజన్ సమాజ్ పార్టీ కాదు. బహుజనులు ఎప్పుడో మీ తీరుతో దూరమవుతున్నారు’ అన్న మోదీ వ్యాఖ్యలపై నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మాయావతి ధీటుగా స్పందించారు.