న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మంగళవారమిక్కడ ప్రారంభమైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ సీనియర్ నేతలు, పలువురు కేంద్రమంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో పార్లమెంట్ సమావేశాలపై చర్చించనున్నారు. ఈ వారంలోనే వస్తు సేవల పన్ను జీఎస్టీ బిల్లు రాజ్యసభకు రానుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును రాజ్యసభలో గట్టేక్కించేందుకు ఎన్డీయే యత్నాలు చేస్తోంది.
మరోవైపు జీఎస్టీపై ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇవాళ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సాధికార కమిటీతో భేటీ కానున్నారు. లోక్‌సభ ఆమోదించిన బిల్లుకు ప్రతిపాదించిన సవరణలపై వారితో చర్చించనున్నారు. ఆ తర్వాత బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా జీఎస్టీ రేట్లను చట్టంలో చేర్చాలని, ఉత్పత్తి ఆధారిత రాష్ట్రాలకు కల్పించిన ఒకశాతం అదనపు పన్ను విధింపు అధికారాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది.