మోదీ ప్రభుత్వం... 12 వైఫల్యాలు | Narendra modi's government: 12 failures | Sakshi
Sakshi News home page

మోదీ ప్రభుత్వం... 12 వైఫల్యాలు

Published Fri, Jan 1 2016 3:38 PM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

మోదీ ప్రభుత్వం... 12 వైఫల్యాలు - Sakshi

మోదీ ప్రభుత్వం... 12 వైఫల్యాలు

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎన్నో హామీలతో ప్రజల్లో ఎన్నో ఆశలు రేకెత్తిస్తూ 2014, మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. 2015లోనన్నా తమ బతుకులకు కొత్త మెరుగులు దిద్దుతుందని ఆశించిన ప్రజలు భారీ మెజారిటీతో బీజేపీకి పట్టంగట్టారు. ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్క హామీని కూడా అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ నెరవేర్చలేక పోయింది.

 

గడిచిందీ ఏడాదిన్నరేగదా! ఇంకా మూడున్నర ఏళ్ల గడువుందంటూ గొంతు విప్పేవాళ్లు, వాదించే వాళ్లు ఉండొచ్చు. కానీ హామీలను అమలుచేసే దిశగా చిత్తశుద్ధితో చర్యలైతే మొదలు పెట్టాలిగా. మరది కనిపించదేం. ముఖ్యంగా 12 రంగాల్లో ఘోరంగా విఫలమైంది. కనీసం నెలకో అంశం మీద దృష్టి పెట్టినా ఈ రంగాల్లో విజయం సాధించి ఉండేది.

1.ధరల పెరుగుదల: ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరకుల ధరలను అరికట్టడంలో, ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో  గత యూపీఏ ఘోరంగా విఫలమైందని బీజేపీ ఎండగట్టింది. ఆహార ద్రవ్యోల్బణంపై నరేంద్ర మోదీ నాయకత్వంలోని ముఖ్యమంత్రుల కమిటీ 2011లో సమర్పించిన సిఫార్సులను అమలు చేసినట్లయితే ఈ పరిస్థితి దాపురించేది కాదని కూడా కూతలేసింది. మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ రంగంలో పరిస్థితి ఏమైనా మారిందా? సామాన్యులకు అందుబాటులో ఉండాల్సిన ఉల్లి, పప్పు దినుసుల ధరలు నేడెక్కడున్నాయో అందరికి తెల్సిన విషయమే. తాము అధికారంలోకి వస్తే సరకు అక్రమ నిల్వదారుల భరతం పడతామని, వారిని సత్వరం విచారించి శిక్షలు విధించేందుకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రత్యేకంగా ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.

 2. చమురు ధరలు: యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు లీటరు పెట్రోలు ధర 75 రూపాయలు ఉండింది. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బారెల్ ధర 100 డాలర్లకు పైనే. చమురు ధరలు చంపేస్తున్నాయని, వీటిని ఎందుకు అరికట్టడం లేదంటూ అప్పుడు ప్రతిపక్షంలోవున్న బీజేపీ మంట పుట్టించింది. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్‌లో బారెల్ ధర 50 డాలర్లుకు దిగువకు పడిపోయినా దేశంలో లీటరు పెట్రోలు ధర 61 రూపాయలకు పైనే ఎందుకున్నది. యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే పెట్రోలు ధర లీటరు 38 రూపాయలకు దాటకూడదు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ధరలు నిర్ణయించేందుకు చమురు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని గొప్పగా చెబుతూ వస్తోన్న మోదీ ప్రభుత్వం అంతర్జాతీయంగా పడిపోతున్న ధరలకు అనుగుణంగా చేకూరే లబ్ధిని ఎందుకు వినియోగదారులకు బట్వాడా చేయడం లేదు?

 3. ఉద్యోగావకాలు: దేశంలో ఉద్యోగావకాశాలను మెరుగుపర్చడంలో అప్పటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోదీ నాలుకకు తడారిపోయేలాగా ప్రతిచోట విమర్శిస్తూ వచ్చారు. ఆయన్నే స్వయంగా ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నప్పుడు ప్రభుత్వరంగంలో ఉద్యోగావకాశాలపరంగా ఆయన తీసుకున్న చర్యలేమిటీ? ప్రైవేటు రంగంలో ఉద్యోగావకాశాలను దండిగా కల్పిస్తామంటూ ‘మేక్ ఇన్ ఇండియా’ అనే నినాదాన్ని పట్టుకొని దేశ దేశాలు తిరుగుతున్నారే తప్పా తెచ్చిందేమీ లేదు.

4. నల్లడబ్బు సంగతేమిటీ?: విదేశాల్లో మూల్గుతున్న 70లక్షల కోట్ల రూపాయల డబ్బును వంద రోజుల్లోగా దీశంలోకి తీసుకొస్తామని శపథం చేసిన ప్రభుత్వం 19 నెలలవుతున్నా నెరవేర్చలేదు. ఇప్పుడిది మాట్లాడడం కూడా పెద్ద జోక్‌గా మారింది. బీహార్ ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పదే పదే ప్రస్తావించి మోదీ ప్రభుత్వం పరవుతీశారు.
 
5. ప్రభుత్వ సేవల్లో వైఫల్యం: ప్రభుత్వ సేవల రంగంలో కూడా అప్పటికీ ఇప్పటికీ ఏమీ మార్పు రాలేదు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు కావాలంటే చెప్పులరిగేలా తిరగాల్సిందే. అంత ఓపిక లేనివారు చేతులు తడిపి పనులు చేయించుకుంటున్నారు. రెడ్ టేపిజానికి బూజులు దులుపుతున్న దాఖలాలు లేవు. వివిధ విభాగాలను సమన్వయం చేసి సామాన్యులకు సైతం సులభంగా పనులయ్యేలా చేస్తామన్న ప్రభుత్వం అసలు ఆ దిశగానే ఆలోచించడం లేదంటే ఆశ్చర్యం వేస్తోంది.

6. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు: ఈ అంశంలోనూ పురోగతి పెద్దగా ఏమీ కనిపించడం లేదు. టీమ్ ఇండియా స్ఫూర్తి గురించి ఇప్పటికీ చెప్పే మోదీ మరి ఎందుకు ఇందులో విఫలమవుతున్నారు. తమ పాలిత రాష్ట్రాల పట్ల మోదీ శీతకన్నేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుండగా, తమ ప్రభుత్వం పట్ల వివక్ష చూపిస్తున్నారంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎందుకు గోల చేస్తున్నారు? ఇక ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వంతోని నిత్త తగువేనాయే!

7. మహిళల కోసం ఏం చేశారు?: మహిళల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని బీజేపీ ప్రకటించింది. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని పునరుద్ఘాటించింది. ఇది ఈజీగా ఇట్టే అమలు చేయవచ్చు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించన బిల్లును యూపీఏ హ యాంలోనే రాజ్యసభ ఆమోదించింది. ఇప్పుడు లోక్‌సభలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ ఉంది. తల్చుకోవడమే తరువాయి.

 8. జమ్మూ కాశ్మీర్ : కాశ్మీర్ పండిట్లకు గౌరవప్రదంగా పునరావాసం కల్పిస్తామని, వారి పూర్వికుల ఆస్తులను వారికి అప్పగిస్తామని, ఉపాధి కూడా కల్పిస్తామని బీజేపీ పదే పదే హామీ ఇచ్చింది. ఇది పార్టీ ఎజెండాలోని ప్రధాన అంశం అయినప్పటికీ ఇప్పటికీ దీన్ని నెరవేర్చలేదు. పండిట్టు స్వదేశంలో పరాయి బతుకు బతుకుతున్నారు.

 9. జుడిషియల్, పోలీసు, ఎన్నికల సంస్కరణలు: న్యాయం జరగడంలో ఆలస్యమైతే అసలు న్యాయం జరగని కిందకే లెక్కన్న మాట ఇప్పటికీ అక్షరాల నిజమే. ఇందులో గత ప్రభుత్వానికి ఇప్పటికీ తేడా ఏమీ లేదు. ఇప్పటికీ లక్షల కేసులు వివిధ స్థాయిల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి. సత్వర విచారణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడంగానీ, అధికారాలు పెంచడంగానీ చేయలేదు. అంతర్జాతీయ ప్రమాణాలకు సమానంగా పోలీసు వ్యవస్థను పటిష్ఠం చేస్తామని చెప్పారు. ఆ మాట దేవుడెరుగు, వారి ప్రాథమిక అవసరాలను తీర్చేందుకు కూడా నిధులివ్వడం లేదు. ఎన్నికల బరిలోకి నేరస్థులను అనుమతించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎన్నికల వ్యయాన్ని తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అదీ అతీగతీ లేదు.

 10. మైనారిటీలకు చేసిందేమీ లేదు?: వారిని మరింత దూరం చేసుకోవడం తప్పా మైనారిటీల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. కనీసం ప్రభుత్వం పదవుల్లో కూడా వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించలేక పోయింది.

 11. ఉమ్మడి పౌరస్మృతి: బీజేపీ ప్రధాన ఎజెండాలో ఇదో అంశం. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో చెప్పినట్లు ఉమ్మడి పౌరస్మృతిని తీసుకరాకపోతే ప్రజల మధ్య సమానత్వం సాధించడం అసాధ్యమని చెప్పే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికీ కనీసం బిల్లును కూడా రూపొందించలేదు.

12. జీఎస్‌టీ బిల్లు: ఇది ఎందో కీలకమైన బిల్లుగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ప్రతిఘటనా వైఖరితో బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ కలసిరాకపోవడం వల్లనే సాధ్యంకాక పోవచ్చు. ప్రతిపక్షాల వైఖరి అలాగే ఉంటుంది. సర్దుబాటు ధోరణితో వ్యవహారాన్ని చక్చబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement