
నిజాం పాలన కంటే ఘోరం
కేంద్రంతో పాటు మహారాష్ట్రలో కూడా అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వాల పాలన నిజాం ప్రభుత్వం కంటే ఘోరంగా ఉందని విమర్శించారు. నిజాం పాలనా కాలంలో హైదరాబాద్ సంస్థానంలో ఔరంగాబాద్‌తో పాటు మరాఠ్వాడా లోని కొన్ని ప్రాంతాలు కూడా ఉండేవి. నాటి నిజాం పాలన కంటే బీజేపీ పాలన దారుణంగా ఉందని ఔరంగాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రౌత్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశాఈ పర్యటనలపై కూడా రౌత్ మండిపడ్డారు. ప్రధానమంత్రి గురించి ఎప్పుడు అడిగినా.. స్విట్జర్లాండ్, లండన్, ఫ్రాన్స్, ఇరాన్ లేదా వేరే ఏదో దేశంలో ఉన్నారని చెబుతారంటూ మోదీ విదేశీ పర్యటనలపై ఎద్దేవా చేశారు.
పశ్చిమబెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో మోదీ డజన్ల కొద్దీ ర్యాలీలు నిర్వహించిరాఉ గానీ, మహారాష్ట్రలోని కరువు ప్రాంతమైన మరాఠ్వాడా వచ్చేందుకు ఆయనకు సమయం లేకపోయిందని రౌత్ అన్నారు. రైతుల సమస్యలపై మోదీకి నిజంగానే పట్టింపు ఉంటే ఆయన వచ్చి మరాఠ్వాడాలో పరిస్థితి చూడాలని తెలిపారు. మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంలో ఇటీవలే ఓ బుడగ పేలిందని ఏక్‌నాథ్ ఖడ్సే పేరు ప్రస్తావించకుండానే అన్నారు. త్వరలో మరిన్ని బుడగలు పేలుతాయని జోస్యం చెప్పారు.