
సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ పీఠాన్ని వరుసగా ఆరోసారి భారతీయ జనతాపార్టీ నిలబెట్టుకుంటుందని తాజాగా మరో సర్వే తెలిపింది. అంతేకాకుండా 2012తో పోలిస్తే.. సీట్లు కూడా మరింత పెరిగే అవకాశముందని తాజాగా టైమ్స్ నౌ - వీఎంఆర్ సర్వే ప్రకటించింది. మొత్తం 184 స్థానాలున్న గుజరాత్ శాసనసభలో బీజేపీ 118 నుంచి 134 స్థానాలు సాధిస్తుందని సర్వే తెలిపింది. ఇదే 2012లో ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో బీజేపీకి 115 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి మరోసారి గుజరాత్ చేదు ఫలితాలనే ఇస్తుందని సర్వే స్పష్టం చేసింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 49 నుంచి 61 సీట్లు లభించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.
సర్వే ముఖ్యాంశాలు
- ఈ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గణనీయంగా తన ఓట్ బ్యాంక్‌ను పెంచుకుంటుంది. 2012 ఎన్నికల్లో బీజేపీకి 48 శాతం ఓట్ షేర్ లభించగా.. ప్రస్తుతం ఇది 52 శాతానికి పెరిగే అవకాశం ఉంది.
- కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ఓట్ షేర్ 2 శాతం తగ్గే అవకాశం ఉంది. అంటే గత ఎన్నికల్లో 39శాతం ఉన్న ఓట్ షేర్.. 37కు తగ్గనుంది.
- గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా నరేంద్రమోదీ ప్రభావం ప్రజలపై అధికంగా ఉంది. ప్రదానిగా మోదీ నిర్ణయాలపై 42 శాతం గుజరాతీయులు సంతృప్తి వ్యక్తం చేశారు.
- పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి ఆర్థిక సంస్కరణల వల్ల మెరుగైన జీవన వసతులు లభిస్తాయని ప్రజలు నమ్ముతున్నారు.
- మోదీ ఆర్థిక సంస్కరణలపై 40 శాత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయగా.. 18 శాతం మంది మాత్రం ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. వీరిలో అధికశాతం మంది మోదీకి అనుకూలంగా ఓటు వేసే అవకాశం ఉంది,
- 67 శాతం మంది గుజరాతీయులు నరేంద్రమోదీని అత్యుత్తమ ముఖ్యమంత్రిగా అభివర్ణివంచారు. ఆయన తరువాత ఆనందీబెన్ పటేల్ పాలనపట్ల 20 శాతం, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ రూపానీ పాలనపై 13 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
- ప్రధాని నరేంద్ర మోదీ సొంత ప్రాంతమైన ఉత్తర గుజరాత్‌లో బీజేపీకి ఈ దఫా గణనీయంగా సీట్లు పెరిగుతాయి. ఉత్తర గుజరాత్‌లో మొత్తం 53 సీట్లు ఉన్నాయి. మోదీ ప్రభావంతో.. సుమారు 81 శాతం ఓట్ షేర్‌ను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉంది.
- సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణంపై 46 శాతం మంది గుజరాతీయులు హర్షం వ్యక్తం చేయగా.. 32 శాతం మంది ఎన్నికల స్టంట్‌గా కొట్టి పారేశారు.
- ఆల్ఫేశ్ థాకూర్, హార్ధిక్ పటేల్, జిగ్నేష్ మేవానిల ప్రభావం ఎన్నికలపై పెద్దగా ఉండదని... సర్వే తెలిపింది. ఈ ముగ్గురితో కలిసి రాహుల్‌గాంధీ జట్టు కట్టినా.. 37 శాతానికి మించి ఓట్ షేర్‌ను పెంచుకోలేరని సర్వే ప్రకటించింది.