ఉత్తరప్రదేశ్‌లో గెలుపు కోసం బీజేపీ వ్యూహం
⇒ 900 సభలు
⇒ 10000 వాట్సాప్ గ్రూపులు
⇒ 67000 కార్యకర్తలు
లక్నో: యూపీ ఎన్నికల్లో స్వీప్ చేసిన కాషాయ దళం.. గెలుపే లక్ష్యంగా పక్కా వ్యూహంతో ముందుకెళ్లింది. రెండేళ్ల కిందటే కసరత్తు ప్రారంభించిన బీజేపీ.. సభలు, రోడ్‌షోలు, సమ్మేళనాలు, సోషల్ మీడియా.. వంటి అనేక మార్గాల్లో ప్రజలను చేరుకుంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ శ్రేణులను పటిష్టం చేసి, 67 వేలమంది క్రియాశీల కార్యకర్తలను రంగంలోకి దింపింది. ఒక్కో నియోజ కవర్గంలో 2 నుంచి 4 సభల చొప్పున మొత్తం 900 సభలు ఏర్పాటు చేసింది. మోదీ 23 సభ ల్లో ప్రసంగించారు. వ్యూహాన్ని పార్టీ అమిత్ షా, రాష్ట్ర ఇన్‌చార్జి ఓ మాధుర్, రాష్ట్ర కమిటీ చీఫ్ కేశవ్ ప్రసాద్ మౌర్య, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రూపొందించి అమలు చేశారు.
దళితులు, ఓబీసీల ఓట్ల కోసం..
గత ఏప్రిల్‌లో మాజీ ఎంపీ, బౌద్ధ సన్యాసి ధమ్మ విరియోతో బీజేపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. మాయావతి ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి దళితులు, ఓబీసీల జనాభా అధికంగా ఉన్న 175 నియోజకవర్గాల్లోవిరియో ‘ధమ్మ చేతన యాత్ర’ చేపట్టి మోదీకి మద్దతు పలకాలని ప్రజలను కోరారు. ఓబీసీలను ఆకట్టుకోవడానికి పార్టీ 200 పిచ్‌డా వర్గ్ సమ్మేళనాలను, ఎస్సీ, ఎస్టీలను ఆకర్షించేందుకు 18 స్వాభిమాన్ సమ్మేళనాలను, వ్యాపారుల మద్దతు కోసం 14 వ్యాపారీ సమ్మేళనాలను నిర్వహించింది. కాలేజీల్లో 1,650 సభల ద్వారా యువతకు చేరువైంది.
యాత్రలు.. మహిళా సమ్మేళనాలు..
రోడ్‌షోల రూపంలో డిసెంబర్ 24 నుంచి మొత్తం 403 నియోజకవర్గాల్లో పరివర్తన్ యాత్రలు చేపట్టింది. 50 లక్షల మంది ప్రజలకు మోదీ విజయాలను వివరించింది. మహిళల ఓట్లను రాబట్టుకోవడానికి అన్ని జిల్లాల్లో 77 ‘మహిళా సమ్మేళన్’లు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరిస్తూ 34 జిల్లాల్లో ‘కమల్ మేళా’ ఎగ్జిబిషన్లను, రైతులకు చేరువకావడానికి 3,564 ‘అలావో సభ’ (చలిమంట భేటీలు) ఏర్పాటు చేశారు. 75 జిల్లాల్లో జరిగిన ‘మాటీ తిలక్ ప్రతిజ్ఞా ర్యాలీ’ల్లో తాము రైతుల ఆకాంక్షలను నెరవేరుస్తామని బీజేపీ ఎంపీలు తిలకధారణ చేశారు.
సోషల్ మీడియా..
సోషల్ మీడియాలో ప్రచారం కోసం కమల నాథులు రాష్ట్రస్థాయిలో 25 మంది ఐటీ నిపుణు లతో ఒక టీమ్‌ను, ప్రాంతీయ స్థాయిలో 21 మందితో 6 టీమ్‌లను ఏర్పాటు చేశారు. 15 మంది సభ్యులతో మరో 90 జిల్లా యూనిట్లనూ రంగంలోకి దింపారు. ఈ టీమ్‌లన్నీ కలిపి మొత్తం 10,344 వాట్సాప్ గ్రూపులు, 4 ఫేస్‌బుక్ పేజీలను ఏర్పాటు చేసి, ఆడియో, వీడియో క్లిప్పులను చేరవేశాయి.
ఇంకా ఏం చేశారంటే..
► పార్టీ పరిశోధన బృందాలు ఒక్కో నియోజక వర్గానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎన్నికల ప్రణాళిక రూపొందించాయి.
► 33 మంది ఎంపీలు 92 నియోజకవర్గాల్లో 263 సభల్లో ప్రసంగించారు. 1,025 శిక్షణా శిబిరాలు నిర్వహించి 88 వేలమంది కార్యకర్త లకు పార్టీ విధానాలను వివరించారు.
► ప్రజల ఆకాంక్షలను తెలుసుకోవడానికి 75 వీడియో వ్యాన్లను రాష్ట్రమంతటా తిప్పారు. ‘బూత్ విజయ్ అభియాన్’ పేరుతో అభ్యర్థులకు ఓటేయాలని ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు పంచారు.
► రాష్ట్రంలోని మొత్తం 1,47,401 పోలింగ్ బూత్‌లలో 10 నుంచి 21 మందితో బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. బూత్ కమిటీ అధ్యక్షులతో నిర్వహించిన సమావేశాలను ఉద్దేశించి పార్టీ చీఫ్ అమిత్ షా ప్రసంగించారు. ‘ఆజీవన్ సహయోగ్ నిధి’ పేరుతో సభ్యుల నుంచి రూ.16.91 కోట్లను వసూలు చేసి పార్టీ కార్యక్రమాలకు ఖర్చు చేశారు.