సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్త ఎన్‌ఆర్‌సీపై చర్చ ఉండబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేసిన అనంతరం దేశ రాజధానిలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు తగ్గుముఖం పట్టిన క్రమంలలో ఈ చట్టంపై ప్రజల్లో సానుకూలత పెంచేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీలపై అవగాహన చేపట్టడంపై బీజేపీ కార్యనిర్వాహక చీఫ్ జేపీ నడ్డా పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ పటేల్, ముక్తార్ అబ్బాస్ నక్వీ, కిరణ్ రిజిజు, అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, గజేంద్రసింగ్ షెకావత్‌లతో పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయ్యారు. లడక్ ఎంపీ, మైనారిటీ సభ్యుడు సెరిగ్ నగ్యాల్ సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే పార్టీ ఎంపీలు రాజీవ్ చంద్రశేఖర్, జీవీఎల్ నరసింహరావు కూడా ఈ భేటీలో పాలుపంచుకున్నారు.
వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై పార్టీ వైఖరిని ప్రజలను ఒప్పించేలా బలంగా ముందుకు తీసుకువెళ్లడంపైనే ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.మరోవైపు పౌర చట్టం, ఎన్‌ఆర్‌సీలతో ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు పంపుతారన్న విపక్షాల ప్రచారం అవాస్తవమని ప్రధాని చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అసోంలో నిర్మిస్తున్న నిర్బంధ కేంద్రానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసిన రాహుల్ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రధాని మోదీని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment