నల్ల కుబేరుల అందరి పేర్లు రేపు వెల్లడి!
న్యూఢిల్లీ: నల్ల ధనం కేసులో అందరి పేర్లను కేంద్ర ప్రభుత్వం రేపు బుధవారం సుప్రీం కోర్టుకు సమర్పించనుంది. ఈ కేసులో కేంద్రం వైఖరిపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బ్లాక్ మనీ దాచినవారి పేర్ల జాబితా సీల్డ్ కవర్లో సమర్పించాలని కోర్టు ఆదేశించింది. గత ఆదేశాలను సవరించాలన్న కేంద్రం తీరుపై కోర్టు మండిపడింది. విదేశాలో డబ్బు దాచినవారిని ఎందుకు కాపాడతారు? అని ప్రశ్నించింది. సోలిసిటర్ జనరల్ సమక్షంలోనే గతంలో ఆదేశాలు ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. కొత్త ప్రభుత్వం మార్పులు చేయమనడం సరికాదంది. ఉత్తర్వులలో ఒక్క పదాన్ని కూడా మార్చం అని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ రోజు దాదాపు 30 నిమిషాల సేపు విచారణ కొనసాగింది. జర్మనీ సహా వివిధ దేశాల నుంచి 500 పేర్లు వచ్చినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది.
ప్రభుత్వం విచారణ చేస్తే జీవిత కాలంలో కేసు పూర్తి కాదని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు వ్యాఖ్యానించారు. పేర్లు ఇవ్వండి, తదుపరి ఆదేశాలు తాము జారీ చేస్తామని కోర్టు తెలిపింది. నల్ల ధనాన్ని వెనుకకు తెచ్చే వ్యవహారాన్ని ప్రభుత్వానికి వదిలిపెట్టలేమని కోర్టు స్పష్టం చేసింది. విదేశాలలో బ్యాంకు ఖాతాలు ఉన్నవారి ప్రయోజనాలను కేంద్రం కాపాడవలసిన అవసరంలేదని కోర్టు చెప్పింది. దానిని సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) చూసుకుంటుందని సుప్రీం కోర్టు తెలిపింది.
**