వారెవరో తెలిస్తే కాంగ్రెస్‌కే ఇబ్బంది
నల్లకుబేరుల పేర్ల వెల్లడిపై జైట్లీ
న్యూఢిల్లీ: విదేశాల్లో అక్రమంగా సంపద దాచుకున్న ఖాతాదార్ల పేర్లు బహిర్గతమైతే ఇరకాటంలో పడేది కాంగ్రెస్ పార్టీయేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. నల్లధనం ఖాతాలున్నవారి పేర్లు త్వరలోనే బహిర్గతమవుతాయని, అపుడు బీజీపీకి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని, కాంగ్రెస్‌కే సమస్య ఎదురవుతుందన్నారు. ఎన్డీటీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జైట్లీ మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. అభియోగాలు ఎదుర్కొంటున్న నల్లధనం ఖాతాదార్ల పేర్లను త్వరలోనే కోర్టుకు నివేదిస్తామన్నారు. ‘నల్లధనం ఖాతాదార్ల పేర్లు మేం వెల్లడించబోమంటూ మీడియా చెబుతోంది, చట్టప్రకారం పాటించవలసిన నిబంధనలను అమలుచేసిన తర్వాతనే పేర్లను వెల్లడిస్తామని మేం చెబుతున్నాం’. అని జైట్లీ అన్నారు.
జర్మనీతో ఉన్న ద్వంద్వ పన్నుల విధింపు నివారణ ఒప్పందం కారణంగా ఖాతాలపై సమాచారం మీడియకు వెల్లడించేందుకు వీలుకాదని, కోర్టుకు వెల్లడించడానికి ఇబ్బందేమీలేదని, కోర్టులో ప్రకటించిన వెంటనే మీడియాలో ప్రచారమవుతుందని జైట్లీ అన్నారు. ఆర్థిక వ్యవహారాల ప్రధాన సలహాదారుగా నియమితుడైన అరవింద్ సుబ్రమణియణ్ అంతర్జాతీయు గుర్తింపు ఉన్న నిపుణుడు, అనుభవశాలి అని జైట్లీ అన్నారు.