బీఎంసీ అప్రమత్తం
సాక్షి, ముంబై : సీజనల్ వ్యాధుల నివారణ కోసం బీఎంసీ కృషి చేస్తోంది. వర్షా కాలంలో మలేరియా విజృంభిస్తుండడంతో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. హౌసింగ్ సొసైటీలకు తమ ఇంటి టెరస్ ఇతర చోట్ల నీరు నిలువ ఉంచకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నోటీసులు జారీ చేసింది. ఒకవేళ నీటిని తొలగించనట్లయితే జరిమానా వసూలు చేయనున్నట్లు హెచ్చరించింది. కార్పొరేషన్ వెల్లడించిన గణాంకాల మేరకు.. జూన్‌లో కె-వెస్ట్ వార్డ్ (అంధేరి తూర్పు) 234 నోటీసులు, ఎం-వెస్ట్ వార్డ్ (చెంబూర్) 199 నోటీసులు, ఈ-వెస్ట్ వార్డు (బైకల్లా)కు 171 నోటీసులు అందుకున్నాయి.
దోమల వృద్ధి ప్రాంతాల గుర్తింపు
వర్షాకాలంలో నగర వాసులు డెంగీ, మలేరియా లాంటి జబ్బుల బారిన పడకుండా దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతున్న ప్రాంతాలను బీఎంసీ ఇటీవలె గుర్తించింది. డెంగీ వ్యాపింపజేసే దోమలు ఎక్కువగా మొక్కలు, ఫ్లవర్ పాట్స్, ఫిష్ ట్యాంక్ల ద్వారా వృద్ధి చెందుతున్నాయని అధికారులు గుర్తిం చారు. మలేరియా దోమల వృద్ధికి సంబంధించి నగర వ్యాప్తంగా 593 ప్రదేశాలు, డెంగీ దోమలకు సంబంధించి 388 స్థలాలను బీఎంసీ క్రిమి సం హారక విభాగం సిబ్బంది గుర్తించారు. మలేరియా, డెంగీ వ్యాధులను వ్యాపింపజేసే దోమల వృద్ధి స్థలాలు సొసైటీకి చెందినవైతే వారికి నోటీసులు జారీ చేశారు.
వీటి నివారణ చర్యలు తీసుకోవాలని ఆ సొసైటీలను కార్పొరేషన్ సూచిం చింది. నివారణ చర్యలు తీసుకోని సొసైటీలకు జరిమానా విధిస్తుంది. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1888 ప్రకారం రూ.రెండు వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానా విధించవచ్చు. ఈ ఏడాది జూన్ చివరి వరకు కార్పొరేషన్ దాదాపు 8,246 సొసైటీలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో 351 సొసైటీలకు జరిమానా విధించింది. కార్పొరేషన్‌కు జరి మానా రూపంలో రూ.11.91 లక్షల ఆదాయం చేకూరింది.జూన్‌లో కార్పొరేషన్.. హౌసింగ్ సొసైటీలు, కార్యాలయాలు, ఇనిస్టిట్యూట్స్, నిర్మాణంలో ఉన్న భవనాలకు 2,284 నోటీసులను జారీ చేసింది. 2013లో 13,889 నోటీసులను జారీ చేయగా రూ.27.60 లక్షలను జరిమానా రూపంలో కార్పొరేషన్ వసూలు చేసింది.
వ్యాధుల నివారణే ధ్యేయం
నోటీసులు జారీ చేసి జరిమానా విధించడం తమ లక్ష్యం కాదనీ, మలేరియా, డెంగీ నివారణే తమ ముఖ్య ఉద్దేశమని కార్పొరేషన్ క్రిమి సంహారక విభాగం అధికారి డాక్టర్ రాజన్ నైరన్‌గేకర్ తెలి పారు బీఎంసీ ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మజా కేస్కర్ మాట్లాడుతూ.. నగర వ్యాప్తంగా ఉన్న హౌసింగ్ సొసైటీలకు చేరుకొని వివిధ కార్యక్రమా ల ద్వారా ప్రజలను చైతన్యపరుస్తున్నామన్నారు. ఈ సారి కూడా మలేరియా, డెంగీ నివారణకు కొత్త విధానాలను అవలంభిస్తున్నామని తెలిపారు.