‘అక్రమాల కూల్చివేత’ | BMC Suspends Five Officials For Kamala Mills Fire Tragedy | Sakshi
Sakshi News home page

‘అక్రమాల కూల్చివేత’

Published Sun, Dec 31 2017 2:55 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM

BMC Suspends Five Officials For Kamala Mills Fire Tragedy - Sakshi

ముంబై: పబ్‌లో ప్రమాదంపై బృహన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లో చలనం వచ్చింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్‌లలో అప్రమత్తత, రక్షణ చర్యలు, అక్రమ, చట్ట విరుద్ధ నిర్మాణాలను గుర్తించి చర్యలు తీసుకుంటోంది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సందడిగా ఉండే బార్లు, రెస్టారెంట్లలో భద్రతా ఏర్పాట్లు ఏ మేరకు ఉన్నాయో పరిశీలించి, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. 1 అబవ్‌ పబ్‌లో శుక్రవారం అర్థరాత్రి అగ్ని ప్రమాదంలో 14 మంది మృత్యువాతపడిన విషయం విదితమే.

314 చోట్ల అక్రమనిర్మాణాల కూల్చివేత
శనివారం సెంట్రల్‌ ముంబైతోపాటు మలాడ్, ములుంద్‌ వంటి సబర్బన్‌ ప్రాంతాల్లోనూ బీఎంసీ యంత్రాంగం తనిఖీలు చేపట్టింది. అనధికార నిర్మాణం ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే కూల్చివేయాలని ఆదేశాలిస్తూ 1000 మంది అధికారులు, సిబ్బందిని రంగంలోకి దించింది. వీరంతా బృందాలుగా విడిపోయి 624 మాల్‌లు, రెస్టారెంట్లు, పబ్‌లలో సోదాలు చేశారు. ప్రమాదం జరిగిన కమలా మిల్స్‌ ఏరియాతోపాటు ఇతర ఆయా ప్రాంతాల్లో చట్టవిరుద్ధమైన 314 కట్టడాలను కూల్చివేశారు. దక్షిణ ముంబై పోలీస్‌ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రముఖ జఫ్రాన్‌ హోటల్‌లో ఒక భాగాన్ని కూల్చివేసి, మరో ఏడు హోటళ్లను సీజ్‌ చేశారు. నగరంలోని 24వార్డుల్లో ఉన్న రెస్టారెంట్లు, పబ్‌లు, హోటళ్లను అన్నిటినీ తనిఖీ చేస్తామని బీఎంసీ అధికార ప్రతినిధి తెలిపారు.

ఆ రెండు పబ్‌లపై కేసులు
ఘోర ప్రమాదానికి కారణమైన 1 అబవ్‌ పబ్‌తోపాటు అదే భవనంలో ఉన్న మోజోస్‌ బిస్త్రో పబ్‌పై ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. అబవ్‌ పబ్‌ సహ యజమానులైన హితేష్‌ సంఘ్వి, జిగర్‌ సంఘ్విపై లుక్‌–ఔట్‌ నోటీసులు జారీ చేశారు. సంఘ్వి సోదరులతోపాటు పబ్‌ యజమానుల్లో ఒకరైన అభిజిత్‌ మాంకాతోపాటు మరికొందరిపై కేసులు నమోదు చేశారు. కమలా మిల్స్‌ కాంపౌండ్‌లో ఉన్న ఈ రెండు పబ్‌లతోపాటు కుర్లాలోని రఘవంశీ మిల్స్‌లో ఉన్న పీ22 మాల్‌పైనా బీఎంసీ ఫిర్యాదు మేరకు మహారాష్ట్ర రీజినల్‌ టౌన్‌ ప్లానింగ్‌ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విధులను నిర్లక్ష్యం చేసి, పబ్‌లో అగ్ని ప్రమాదానికి కారణమయ్యారంటూ ఇప్పటికే ఐదుగురు అధికారులపై బీఎంసీ సస్పెన్షన్‌ వేటు వేసింది.

ఘోరానికి కారణం ఏమిటి?
తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, కింది ఫ్లోర్‌లో ఉన్న మోజోస్‌ బిస్ట్రో పబ్‌లో అత్యవసర ద్వారం లేకపోవటంతో కిందికి దిగే దారి ఒక్కసారిగా కిక్కిరిసిపోయి ప్రాణనష్టానికి కారణమైందని 1 అబవ్‌ పబ్‌ యాజమాన్యం పేర్కొంది. మంటలు పక్కనే ఉన్న మరో సంస్థ నుంచి తమ పబ్‌లోకి వ్యాపించాయని తెలిపింది. టెర్రస్‌పై వెదురుతో షెడ్డు ఏర్పాటు చేసి 1 అబవ్‌ పబ్‌ నిర్వహిస్తున్నారని, బార్టెండర్ల విన్యాసాల సమయంలో మంటలు పైకప్పునకు ఉన్న ప్లాస్టిక్‌ కవర్లకు, వెదురుకు అంటుకుని ప్రమాదం జరిగిందని భావిస్తున్నామని అగ్ని మాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. పొరుగునే ఉన్న మరో పబ్‌లో హుక్కాల నుంచి లేచిన నిప్పురవ్వలు ప్రమాదానికి కారణమై ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నామన్నారు. సమగ్ర దర్యాప్తు అనంతరమే నిజానిజాలు తెలుస్తాయన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement