పాక్ పడవపై రాజకీయాలు!
- కాంగ్రెస్, బీజేపీ పరస్పర విమర్శల వర్షం
- ‘ఉగ్రదాడి’ని అడ్డుకోవడంపై సాక్ష్యాలు లేవన్న కాంగ్రెస్
- ఉగ్రవాదంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డ కమల దళం
న్యూఢిల్లీ: పాక్ పడవ చుట్టూ రాజకీయాలు ముసురుకుంటున్నాయి! కాంగ్రెస్, బీజేపీలు పరస్పరం విమర్శల వర్షం కురిపించుకుంటున్నాయి. అరేబియా సముద్ర జలాల మీదుగా భారత్ వైపు వచ్చిన అనుమానాస్పద పడవ ఉదంతంలో వాస్తవాలు చెప్పాలని, ఆ పడవ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినదో తెలపాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్‌పై కమల దళం మండిపడింది. ఉగ్రవాదంపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందంటూ నిప్పులు చెరిగింది. ఆ పార్టీ దిగజారుడుతనం పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టింది.
ఆదివారమిక్కడ బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ తీరును ఎండగట్టారు. ‘‘కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలు అగాధానికి పడిపోయాయి. భారత్‌లో నెత్తుటేర్లు పారించాలన్న ఉగ్రవాదుల కుట్రను దేశ తీర రక్షణ దళం, నిఘా సంస్థలు కలిసి భగ్నం చేశాయి. అందువల్లే దేశం నూతన సంవత్సర వేడుకలు చేసుకోగలిగింది. పెను ప్రమాదాన్ని తప్పించినందుకు కోస్ట్‌గార్డ్, ఇంటెలిజెన్స్ విభాగాలను ప్రభుత్వం అభినందించింది. కానీ దురదృష్టవశాత్తూ కాంగ్రెస్ ఈ విషయంలో ప్రభుత్వ పక్షం వహించలేదు.
ఉగ్రవాదులపై సానుభూతి ప్రదర్శించింది. పాకిస్తాన్ చెబుతున్న మాటలకు, కాంగ్రెస్ మాటలకు ఏమాత్రం తేడా లేదు’’ అని దుయ్యబట్టారు. భారత్‌లో ప్రధాన ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్.. పాక్ వాదనకు బలమిచ్చేలా వ్యవహరిస్తోందని అన్నారు. పాక్ ప్రభుత్వాధికారులు, కాంగ్రెస్ అధికార ప్రతినిధుల గొంతుల్లో తేడా లేదని విమర్శించారు. 26/11 మారణహోమం సమయంలో కూడా కాంగ్రెస్ ఇలాగే మాట్లాడిందని, ఆ ఘటనకు లింకు పెడుతూ ఆరెస్సెస్ వైపు వేలెత్తి చూపిందని పేర్కొన్నారు.
‘‘బాట్లా హౌస్‌పై దాడి ఘటనలో ఉగ్రవాదులు చనిపోయినందుకు సోనియాగాంధీ కన్నీరు కార్చారు. ఈ విషయాన్ని స్వయంగా విదేశాంగ శాఖ మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీదే వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమక్షంలో 26/11 దాడిపై అప్పటి హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే మాట్లాడుతూ.. కాషాయ ఉగ్రవాదం అంటూ అవాకులు చెవాకులు పేలారు.
జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇంతలా దిగజారి అనుమానాలు వ్యక్తం చేస్తారా?’’ అని సంబిత్ పాత్ర ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులకు దేశ ఇంటెలిజెన్స్, కోస్ట్‌గార్డ్, ప్రభుత్వంపై విశ్వాసం లేదా అని అన్నారు. ఒక దిగ్భ్రాంతికర అంశాన్ని కాంగ్రెస్ నేలబారు ప్రచారానికి వాడుకోవాలని చూస్తోందా అంటూ నిలదీశారు. ఉగ్రవాద దాడిని అడ్డుకున్నట్లు ప్రభుత్వం చెబుతోందని, అయితే అందుకు ఎలాంటి సాక్ష్యాలూ లేవని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
పాక్ అదుపులో 12 మంది జాలర్లు
గుజరాత్ తీరం నుంచి ఆదివారం రెండు బోట్లలో చేపల వేటకు వెళ్లిన 12 మంది భారత మత్స్యకారులను పాకిస్తాన్ తీర భద్రత సంస్థ తమ అదుపులోకి తీసుకుంది. అంతర్జాతీయ జలాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోర్‌బందర్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘సాగర్ భారతి’ ప్రతినిధి ఒకరు తెలిపారు.