![Bollywood star Shashi Kapoor dies aged 79 - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/5/shas.jpg.webp?itok=XAfDRutg)
ముంబై: బాలీవుడ్ దిగ్గజ నటుడు శశికపూర్(79) కన్నుమూశారు. మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం చనిపోయారని కుటుంబసభ్యులు తెలిపారు. పాతతరం కథా నాయకుడు పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడే శశికపూర్. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ నాలుగేళ్ల వయసులోనే నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు. 1961లో ధర్మపుత్ర సినిమాలో హీరోగా ప్రస్థానం ప్రారంభించిన శశికపూర్ 116 చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లవర్‌బాయ్‌గా70, 80వ దశకాల్లో ఆయన పేరు మారుమోగిపోయింది. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్‌వంటి సినిమాలు చిత్ర సీమలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా చేశాయి. 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఆయనను కేంద్ర ప్రభుత్వం 2011లో పద్మభూషణ్‌తో గౌరవించింది. శశికపూర్ అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి.
ప్రముఖుల సంతాపం
శశికపూర్ మృతికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం ప్రకటించారు. ఆయన నటించి, నిర్మించిన ఎన్నో సినిమాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాయని, సినీ, నాటక రంగానికి ఆయన సేవలు శ్లాఘనీయమన్నారు. ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించిన ఆయన ప్రజల హృదయాల్లో ఎన్నటికీ నిలిచిపోతారని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. శశికపూర్ మృతి తీవ్ర విచారం కలిగించిందని ప్రధాని మోదీ తెలిపారు. సినీ, నాటక రంగ అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడ్డారని చెప్పారు. శశికపూర్ అద్భుతమైన నటుడని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. ఒక సినీ దిగ్గజం వెళ్లిపోయిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆయన మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment