పొలిటీషియన్ భార్యకు స్టంట్ మాస్టర్ ఝలక్
ముంబయి: అతడు పేరుమోసిన ఓ స్టంట్స్ మెన్. షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్ వంటి ప్రముఖ బాలీవుడ్ హీరోలకోసం ఎన్నో స్టంట్స్ చేశారు. పూర్తి స్థాయిలో చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుని ఈ మధ్యే మాస్టర్ గా కూడా మారాడు. అయితే, ఇప్పటి వరకు మంచి స్టంట్స్ మెన్ గా పేరు సంపాధించుకున్న అతడు ఒక చెడ్డ అపవాదును మూటగట్టుకున్నాడు. పెద్ద దొంగతనాన్ని చేశాడు. రూ.2లక్షలకు ఆశపడి ఏకంగా రూ.98లక్షల విలువైన కారును దొంగిలించే ప్రయత్నం చేసి పోలీసుల చేతికి అడ్డంగా దొరికిపోయాడు. కారు కూడా ఓ రాజకీయ నాయకుడి భార్యది.
వివరాల్లోకి వెళితే, శంషర్ ఖాన్(30) అనే వ్యక్తి బాలీవుడ్ చిత్రాల కోసం స్టంట్ మేన్ గా పనిచేస్తూ కుర్ల ప్రాంతంలో ఉంటున్నాడు. అతడికి అభయ్ పాటిల్ (42) అనే కారు డీలర్ కు, విజయ్ వర్మ అనే ఓ పని మనిషికి పరిచయం ఉంది. వెయిన్ గంగా అనే అపార్ట్ మెంట్లో పలువురు రాజకీయ నాయకులు, బిజినెస్ టైకూన్లు ఈ కాంప్లెక్స్ లో నివాసం ఉంటారు. ఇక్కడే ఓ పొలిటీషియన్, వ్యాపార వేత్త భార్య అయిన అభా బాఫ్నాకు రూ.98లక్షల విలువైన ఆడి ఏ 8(2008) కారు ఉంది. ఆ కారును ఎలాగైనా దొంగిలించి తనకు ఇవ్వాలని, అందుకు రూ.2లక్షలు ఇస్తానని స్టంట్ మెన్ అయిన శంషర్ ఖాన్ కు చెప్పడంతో అతడు విజయ్ వర్మ అనే పనిమనిషితో కలిసి ముందుగా అనుకున్న ప్రకారం ప్లాన్ అమలు చేశారు.
పని మనిషి విజయ్ వర్మ తాళం చేతులు అందించగా తాఫీగా ఆ కారు వేసుకొని పాటిల్ కు ఇచ్చేందుకు నేవీ ముంబయి రోడ్డుపై వెళుతున్నాడు. దొంగతనం జరిగిన కాసేపటికే ఈ విషయం పోలీసులకు తెలిసి ముందుగానే రోడ్డుపై కాపలాకాశారు. అతడు స్టంట్ మాస్టర్ అని ముందే తెలిసి రోడ్డుపై నాకా బందీలు (బారీ గేడ్స్)లాంటివి పెట్టి అతడిని అడ్డుకున్నారు. మర్యాదగా అతడిని కారు దిగాలని చెప్పి అరెస్టు చేసి జైలుకు తరలించగా అసలు విషయం చెప్పాడు. మొత్తం ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, వర్మ చేతికి తాళాలు ఎలా వచ్చాయనే విషయాన్ని పోలీసులు విచారిస్తున్నారు. నాలుగు గంటల్లోనే పోలీసులు ఈ కేసు ఛేదించారు.