సంఘటనా స్థలంలో తనిఖీ చేస్తున్న పోలీసులు
మహిళ మృతి, ముగ్గురికి గాయాలు
సాక్షి, బెంగళూరు: బాంబు పేలుడుతో బెంగళూరు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నగరంలోని చర్చిస్ట్రీట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో వారాంతాల్లో జన సందోహం అధికంగా ఉండే ప్రాంతాల్లో చర్చి స్ట్రీట్ ఒకటి. ఈ ప్రాంతంలోని కోకోనట్ క్రో రెస్టారెంట్ వద్ద ఆదివారం రాత్రి 8.30 గంటలకు బాంబు పేలింది.
రెస్టారెంట్‌కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్ల పొదల్లో ఈ బాంబ్‌ను అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుడుకు ఫుట్‌పాత్‌పై నడుస్తున్న తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు భవానీ దేవి(38), కార్తిక్ (23) గాయపడ్డారు. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీరితో పాటు సందీప్, మరో వ్యక్తి సైతం గాయపడ్డారు. భవానీదేవికి తలకు తీవ్ర గాయమైంది. సందీప్ వెన్నెముకకు, కార్తీక్ కాలికి గాయాలయ్యాయి.
వీరిలో భవానీ దేవి, కార్తీక్‌లను మాల్యా ఆస్పత్రిలో, సందీప్ హోస్తాత్ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో భవానీదేవి మరణించారు. నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్‌రెడ్డి మాట్లాడుతూ పేలుడుకు ఐఈడీని వాడి ఉండొచ్చన్నారు. తక్కువ తీవ్రత ఉన్న బాంబ్ కావడం వల్ల విస్ఫోటన తీవ్రత తక్కువగా ఉందన్నారు. పేలుడు వెనక సిమి హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నామన్నారు. ప్రజలు ఏటా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే ఈ ప్రాంతంలో పేలుడు జరగడం గమనార్హం.