ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు
కోచి: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఈ నెల 25న ముంబై నుంచి వచ్చే ఒక విమానాన్ని పేల్చేయడం లేదా వీలైతే ఆత్మాహుతి దాడి చేస్తారని కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్టు విమానాశ్రయం డైరెక్టర్ ఏకేసీ నాయర్ చెప్పారు.
శనివారం ముంబై నుంచి కోచి వచ్చే విమానం లేదా శుక్రవారం రాత్రి అహ్మదాబాద్-ముంబై సెక్టార్ విమానంపై దాడి చేయనున్నట్టు హెచ్చరికలు వచ్చాయి. గురువారం రాత్రి ఓ ఆగంతకుడు కోల్కతా విమానాశ్రయ అధికారికి ఫోన్ చేసి ఈ మేరకు బెదిరించాడు. ఆయన వెంటనే కోచి విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. సీఐఎస్ఎఫ్ డీఐజీ ఆనంద్ మోహన్ చెన్నై నుంచి కోచి చేరుకుని అత్యున్నత స్థాయి భద్రత సమావేశం నిర్వహించారు. కోచి విమానాశ్రయంలో భద్రత బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు.