బ్రహ్మపుత్ర నది
న్యూఢిల్లీ : ఆకాశగంగ బ్రహ్మపుత్ర నదిలోని నీరు నలుపెక్కడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం పేర్కొంది. ఈ విషయంపై చైనా విదేశాంగ శాఖతో చర్చించినట్లు కూడా వెల్లడించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ మాట్లాడుతూ.. జల వనరుల శాఖతో చర్చించి బ్రహ్మపుత్ర నది నీరు నలుపు రంగులోకి మారడంపై నిజాలను తెలుసుకున్నట్లు చెప్పారు.
ఇదే విషయంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ చైనా విదేశాంగ మంత్రితో చర్చించినట్లు తెలిపారు. బ్రహ్మపుత్ర నది నీరు నలుపు రంగులోకి మారడం, నీరు విష తుల్యం కావడంపై కారణాలను తెలుసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జల వనరుల శాఖను ఆదేశించిన అనంతరం విదేశాంగ శాఖలో సైతం కదలిక రావడం గమనార్హం. బ్రహ్మపుత్ర నీటిపై జరిగిన చర్చలో మోదీ, సుష్మా స్వరాజ్, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌లు బుధవారం భేటీ అయిన విషయం తెలిసిందే.
త్సాంగ్ పో(టిబెట్‌లో బ్రహ్మపుత్రను త్సాంగ్‌పో అని పిలుస్తారు) నది నీటి సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని మోదీ ఈ సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. బ్రహ్మపుత్ర సింహభాగం చైనాలో ఉండటంతో ఆ దేశంతో కూడా చర్చించాలని మోదీ విదేశాంగ శాఖకు సూచించారు. అంతకుముందు సియాంగ్ నది(అసోంలో బ్రహ్మపుత్రను సియాంగ్ అని పిలుస్తారు) నీటికి సంబంధించిన 15 శాంపిల్స్‌ను అసోం రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీకి పరీక్షల కోసం పంపింది.
కాగా, నవంబర్ చివరి నుంచి బ్రహ్మపుత్ర నది నీరు నలుపు రంగులోకి మారింది. నదికి ఎగువన చైనా 1000 కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్న కారణంగానే ఇలా జరుగుతోందనే రిపోర్టులు కూడా ఉన్నాయి. అయితే, ఈ రిపోర్టులను చైనా ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment