
శ్రీనగర్: ఇంతకాలం మిలిటెన్సీతోని అతలాకుతలం అవుతూ వస్తున్న జమ్మూ కశ్మీర్‌ను ఇప్పుడు సరికొత్త భూతం వేధిస్తోంది. గుర్తుతెలియని శక్తులేవో అర్థరాత్రి ఆడ పిల్లల జుత్తును కత్తిరిస్తున్న సంఘటనలు రాష్ట్ర ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇది భూత, ప్రేత, పిశాచాల పనేమోనని కొంత మంది ప్రజలు ఆందోళన చెందుతుండగా, ఇదంతా భద్రతా దళాల పన్నాగమని మిలిటెంట్లు, ప్రజల్లో అలజడి సష్టించేందుకు మిలిటెంట్లు చేస్తున్న తతంగమని భద్రతా దళాలు పరస్పరం ఆరోపించుకుంటున్నాయి. ఒకవిధమైన మానసిక రుగ్మత కారణంగా ఆడ పిల్లలే తమ జుట్లను కత్తిరించుకుంటున్నారన్నది వైద్యుల భావన.
ఏదేమైనా ఢిల్లీ పరిసర ప్రాంత రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన ఈ ఆందోళన ఇప్పుడు కశ్మీర్ ప్రజలను పీడిస్తోంది. ఢిల్లీ, పరిసర యూపీ, హర్యానా రాష్ట్రాల్లో ఆడపిల్లల జుట్లను కత్తిరించే సంఘటనలు గత జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువగా జరగ్గా, గత సెప్టెంబర్ నెల నుంచి జమ్మూ కశ్మీర్ ప్రాంతాలకు పాకాయి. ఇలాంటి కేసులు ఇప్పటి వరకు కశ్మీర్‌లో 35, జమ్మూలో 192 నమోదయ్యాయి. అర్థరాత్రి ప్రజల ఆశ్రయం కోరే తమను ప్రజల వద్దకు రాకుండా దూరంగా ఉంచాలనే ఉద్దేశంతో, తమ పట్ల భేద భావం కలిగించాలనే లక్ష్యంతో సైనిక దళాలే ఇలాంటి సంఘటనలకు పాల్పడుతున్నాయని హిజుబుల్ ముజాహిద్దీన్ ఫీల్డ్ ఆపరేషన్ కమాండర్ రియాజ్ నైకూ సోమవారం విడుదల చేసిన ఓ ఆడియో టేప్‌లో ఆరోపించారు.
ఆడపిల్లలు ముస్లిం దుస్తులు ధరించి పడుకుంటే ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉండదని ఆయన సూచించారు. అవసరమైతే ఆడపిల్లల రక్షణ కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఇదంతా భద్రతా దళాలు, ఆరెస్సెస్ శక్తులు కలిసి చేసిన కుట్ర కారణంగానే ఈ సంఘటనలు జరుగుతున్నాయని వేర్పాటువాద హురియత్ కాన్ఫరెన్స్ నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ ఆరోపించారు. మొన్న కుల్గామ్‌లో జుత్తు కత్తిరించిన యువకుడిని ప్రజలు పట్టుకున్నప్పుడు అతను తప్పించుకునేందుకు వీలుగా భద్రతా దళాలు ఎందుకు కాల్పులు జరిపాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మహిళలపై ఇలాంటి దాడులు జరిపిస్తున్నారని రాజకీయ పరిశీలకులు ఆరోపిస్తున్నారు.
వదంతులు, కుహనాశక్తుల కుట్రలు, కుతంత్రాలను ఇట్టే నమ్మే కశ్మీర్ ప్రజలు అమాయకులైన అనుమానితులపై దాడులు జరుపుతున్నారు. ఇంటి పరిసరాల్లో, వీధుల్లో ఎవరూ అనుమానాస్పదంగా కనిపించినా ఆడ పిల్లల జుత్తు కత్తిరించడానికి వచ్చాడన్న అనుమానంతో నిర్బంధించి చితక బాదుతున్నారు. బారముల్లాలో మంగళవారం ఓ యువకుడిని ఇదే కారణంగా పట్టుకొని చితక్కొట్టారు. భద్రతా దళాలు జోక్యం చేసుకొని ఆ యువకుడిని విడిపించడం కోసం గాలిలోకి భాష్పవాయువు గోళాలను కూడా ప్రయోగించాల్సి వచ్చింది.
ఆ యువకుడి విచారించగా తాను ప్రేమిస్తున్న ఓ యువతిని కలుసుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఆ ఇంటివారే ఈ యువకుడంటే ఇష్టంలేక కొట్టించారా, లేదా అన్న అంశం ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రజలు పట్టుకుని చితకబాదిన దాదాపు పది మంది యువకులు అమాయకులేనని తేలింది. ఢిల్లీ, యూపీ ప్రాంతాల్లో జరిగిన ఇలాంటి సంఘటలనలకు ఇక్కడ జరుగుతున్న సంఘటనలకు దగ్గరి పోలికలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
బాధితుల్లో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారవడం, ఆర్థికంగా వెనకబడి, అనారోగ్యంతో బాధ పడుతున్న కుటుంబాలకు చెందిన వారవడం ఇక్కడ గమనార్హమని వారంటున్నారు. మాస్ హిస్టీరియా లోనవడం వల్ల కూడా బాధితులు తమ జుట్టును తమకు తెలియకుండానే కత్తిరించుకుంటారని వారంటున్నారు. కుటుంబం, ఇరుగు పొరుగు కలహాల వల్ల కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని సామాజిక కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రతి జిల్లాకు ఓ పత్యేక పోలీసు బందాన్ని ఏర్పాటు చేసి దోషులను పట్టుకోవాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment