కళ్యాణ మంటపంలో ఖాళీగా ఉన్న కుర్చీలు,మంటపంలో ఒంటరిగా పురోహితుడు
సాక్షి, కర్ణాటక : పెళ్లి మంటపంలో వధూవరులు కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన ఆదివారం కోలారు జిల్లా, మాలూరులోని పద్మావతి కళ్యాణ మంటపంలో చోటు చేసుకుంది. వివరాలు... తాలూకాలోని చన్నకల్లు గ్రామానికి చెందిన గురేష్, బంగారుపేట తాలూకా నేర్నహళ్లి గ్రామానికి చెందిన ఎన్. సౌమ్యలకు వివాహం జరగాల్సి ఉంది. శనివారం రిసెప్షన్, ఆదివారం వివాహం నిశ్చయించారు. పెళ్లికి వంటలతో పాటు అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. బంధువులు, వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే శనివారం రాత్రి నిశ్చితార్థ సమయానికి వధువు సౌమ్య కళ్యాణ మండపానికి రాలేదు.
రాత్రి 10 గంటలు గడిచినా కల్యాణ మంటపానికి పెళ్లి కూతురు వారి తరుపు వారు రాకపోవడంతో ఆగ్రహించిన వరుడి తాలూకా వారు ఇదే ముహూర్తానికి వధువు సౌమ్య చిన్నాన్న కూతురు వెంకటరత్నమ్మతో గురేష్ వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈమేరకు నిశ్చితార్థం ఇతర శాస్త్రాలను ముగించారు. అంతా సుఖాంతం అనుకుంటున్న సమయంలో ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఉదయం వరుడు పెళ్లి మంటపంలో నుంచి కనిపించకుండా పోయాడు. షేవింగ్ చేసుకుని వస్తానని బయటకు వెళ్లినవాడు తిరిగి రాలేదు. తన మొబైల్ ఫోన్‌ను స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో కల్యాణ మండపంలో తిరిగి గందరగోళం నెలకొంది. ఎంతకీ వరుడు తిరిగి రాకపోవడంతో పెళ్లికి వచ్చిన వారు తిరుగుముఖం పట్టారు. పెళ్లికి చేసిన పిండి వంటలు అలాగే ఉండి పోయాయి.
Comments
Please login to add a commentAdd a comment