'నేను భర్తను కొనను.. నాకు ఆ పెళ్లి వద్దు'
తిరువనంతపురం: వరకట్నం గురించి ప్రస్తుతం ఎవరూ అంతగా మాట్లాడుకోకపోయినా అది చాపకింద నీరులా నేటి అమ్మాయిల కుటుంబాలను ఇప్పటికీ వెంటాడుతున్న సమస్యే. ముసుగులు ధరించి బ్రతుకుతున్న నేటి రోజుల్లో ఈ సమస్యపై నోరు విప్పేవారు అతి కొద్దిమంది మాత్రమే. వరకట్న నిషేధ చట్టం 1961 సెక్షన్ 304బీ, 498 ఏ ప్రకారం కట్నం ఇవ్వడం, కట్నం కోరడం నేరమే అవుతుంది. ఈ విషయం నేటి రోజుల్లో చాలామంది మరిచిపోయారనే అనుకోవచ్చు.
కానీ, కేరళలో మాత్రం ఓ యువతి ధైర్యంగా వరకట్నంపై తన గొంతును విప్పింది. పెళ్లిపీటల వరకు వచ్చిన పెళ్లిన వరుడు తరుపువాళ్లు కట్నం అడుగుతున్నారని, అలాంటి కుటుంబానికి తాను కోడలిగా వెళ్లాలనుకోవడం లేదని బహిరంగంగా ప్రకటించి తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పింది. కేరళలోని త్రిశూర్కు చెందిన రమ్యా రామచంద్రన్ అనే యువతికి ఈ మధ్య నిశ్చితార్థం అయింది. నిశ్చితార్థం సమయంలో ఎలాంటి డిమాండ్ చేయని అబ్బాయి తరుపువాళ్లు అనంతరం మాత్రం రూ.ఐదు లక్షల వరకట్నం, బంగారం కావాలని డిమాండ్ చేశారు.
దీంతో ముందునుంచే వరకట్నం విషయంలో ఒక స్పష్టమైన అభిప్రాయం ఉన్న రమ్యా తన వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. 'నేను భర్తను.. అతడి కుటుంబాన్ని కొనుక్కోవాలనుకోవడం లేదు. నేను వరకట్నానికి పూర్తిగా వ్యతిరేకిని. మాట తప్పిన వారితో మాకు ఎలాంటి సంబంధం వద్దు. అందుకే నేను నా వివాహాన్ని రద్దు చేసుకోవాలని అనుకుంటున్నాను' అని ఆమె ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేసింది. దీనిని చూసి నెటిజన్లు ఆమెను మెచ్చుకున్నారు.