
ప్రపంచంలోని ఎన్నో సామాజిక ఉద్యమాల్లో ‘కళ’ బలమైన పాత్ర నిర్వహించింది. ‘కత్తి కంటే కళ గొప్పది’ అని ఢంకా బజాయించి చెప్పింది. నిరూపించింది.
కొన్ని నెలల క్రితం కేరళలో వరకట్న హత్యలు కలకలం సృష్టించాయి. ‘ఎందుకు ఇలా జరుగుతుంది?’ అంటూ చర్చ మొదలైంది. ‘అక్షరాస్యతకు పేరుగాంచిన ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు ఏమిటి!’ అనే ఆవేదన కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో వరకట్నహింసతో పాటు స్త్రీలపై జరిగే రకరకాల హింసలకు వ్యతిరేకంగా కేరళలో ‘స్త్రీ నవకేరళం’ పేరుతో కళాఉద్యమం మొదలుకానుంది.
పాటలు, నాటికలు, స్ట్రీట్‌ప్లే, చిత్రాలు, కార్టూన్‌లు, గోడపత్రికలు, సోషల్ మీడియా చాలెంజ్, వీడియోలు రూపొందించడం... మొదలైన వాటిలో వివిధ జిల్లాలో నుంచి ముగ్గురు మహిళలను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. ఈ ముగ్గురు తమ జిల్లాలలోని పదిమంది బృందానికి శిక్షణ ఇస్తారు. ఈ కళాఉద్యమానికి సంబంధించి పూర్తిస్థాయిలో కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం అయింది. కళాబృందాలు జిల్లా కేంద్రం నుంచి మారుమూల పల్లెల వరకు అన్ని ప్రాంతాలకు వెళ్లి తమ కళారూపాలను ప్రదర్శిస్తాయి. దీంతో పాటు గ్రామ ప్రజలతో చర్చా కార్యక్రమం నిర్వహిస్తారు.
‘ఫలాన గ్రామంలో వరకట్న వేధింపులు భరించలేక ఒక అమ్మాయి ఆత్మహత్మ చేసుకుంది...’ అని కళాబృందంలోని ప్రధాన వక్త చర్చ ప్రారంభిస్తుంది.
‘ఇది అన్యాయం... అలా జరగడానికి వీల్లేదు’ అంటాడు ఒక పెద్దాయన.
ఆయనతో గొంతు కలుపుతాడు ఒక నవయువకుడు. ఆ వాతావరణంలో మార్పు కనిపిస్తుంది. అది భవిష్యత్‌కు ఆశావహమైన మార్పు కావచ్చు. ఈ కళా ఉద్యమానికి అంబాసిడర్‌గా నటి నిమిష సజయ ఎంపిక అయ్యింది.
‘ఉద్యోగాలలో లింగవివక్షతను ప్రశ్నించే కళారూపాలు, స్త్రీసాధికారతకు సంబంధించిన కళారూపాలు కూడా మా ప్రచారయాత్రలో చోటుచేసుకుంటాయి’ అంటుంది నిమిష సజయ.
Comments
Please login to add a commentAdd a comment